Share News

యువ వికాసం

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:17 AM

యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది.

యువ వికాసం

జగిత్యాల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. గత యేడాది ఏప్రిల్‌లో దరఖాస్తులు స్వీకరించి వెరిఫికేషన్‌ పూర్తి చేశారు. జూన్‌ 1వ తేదీ నాటికి ప్రొసీడింగ్స్‌ సిద్ధం చేశారు. ఆ తర్వాత పురోగతి లేకుండా పోయింది. ఇటీవల ప్రభుత్వం పథకాన్ని నెల రోజల్లో ప్రారంభిస్తామని ప్రకటించింది. దీంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. 17 నెలల క్రితం అర్హులైన యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొదటి విడతలో నవంబర్‌ 19వ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో యువతలో ఆశలు చిగురించాయి. గత యేడాది జూన్‌ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున లబ్ధిదారులకు చెక్కులు అందజేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

జిల్లా వ్యాప్తంగా 47,787 దరఖాస్తులు

జిల్లాలో గల జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీలతో పాటు అన్ని మండలాల పరిధిలో గల గ్రామాల్లో సుమారు నాలుగు లక్షల కుటుంబాల పరిధిలో సుమారు పన్నెండు లక్షల పైచిలుకు జనాభా ఉంది. రాజీవ్‌ యువ వికాసంలో భాగంగా ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులను అధికారులు ఆహ్వానించారు. ఆయా సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులు పోటెత్తాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన సుమా రు 47,787 మంది యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారు.

లబ్ధిదారుల్లో చిగురిస్తున్న ఆశలు

ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం యూనిట్ల పంపిణీపై దృష్టి సారిస్తుండడంతో ఆయా కేటగిరీలకు దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు ఆశలు చిగురిస్తున్నాయి. మొదటగా ప్రభుత్వం దరఖాస్తుదారులకు మండల పరిషత్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన వారికి యూనిట్‌ విలువ ప్రకారం అయిదు విడతల్లో అక్టోబర్‌ మాసాంతం వరకు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా మొదటి విడతలో కేటగిరీ - 1లో రూ. 50 వేలు, కేటగిరీ - 2లో రూ. 1 లక్ష వరకు ఎంపికైన లబ్ధిదారులకు గత యేడాది జూన్‌ 2వ తేదీ నుంచి జూన్‌ 9వ తేదీ వరకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి 15వ తేదీ లోపు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అదే విధంగా సాధ్యమైనంత తొందరలో రాయితీ విడుదల చేసి గ్రౌం డింగ్‌ పూర్తి చేయాలని తొలుత భావించారు. కానీ ఈ పంపిణీ ప్రక్రియలో మరోమరు కదలికలు వస్తుండడంతో ఆశలు చిగురిస్తున్నాయి.

నిరుద్యోగ యువకులకు ప్రయోజనం

- సుంకెట విజయ్‌, జగిత్యాల

గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తులకు మోక్షం లభించనుంది. దీంతో జిల్లాలో పలువురు నిరుద్యోగులకు ప్రయోజనం అందనుంది. ప్రభుత్వం సాధ్యమైనంత తొందరలో రుణాల గ్రౌండింగ్‌ పూర్తి చేయాలని నిరుద్యోగులు ఆశిస్తున్నారు.

జిల్లాలో వివిధ కార్పొరేషన్లలో రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తులు

-------------------------------------------------------------------------------------

కార్పొరేషన్‌ పేరు.....యూనిట్ల లక్ష్యం.....వచ్చిన దరఖాస్తుల సంఖ్య

-------------------------------------------------------------------------------------

ఎస్‌సీ...........................4,402................................11,300

ఎస్‌టీ...........................674....................................1,437

మైనారిటీ....................764....................................3,922

బీసీ..............................7,013.................................31,128

-------------------------------------------------------------------------------------

మొత్తం........................12,853..............................47,787

-------------------------------------------------------------------------------------

Updated Date - Oct 23 , 2026 | 12:17 AM