Share News

మొన్న కాంగ్రెస్‌.. నేడు బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:50 PM

నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరిన జమ్మికుంటకు చెందిన డాక్టర్‌ సురంజన్‌ తాజాగా బీఆరెస్‌ పార్టీ కండువ కప్పుకుని అందరికీ బిగ్‌ షాక్‌ ఇచ్చారు. జమ్మికుంట మున్సిపాల్టీ ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ అయ్యింది.

 మొన్న కాంగ్రెస్‌.. నేడు బీఆర్‌ఎస్‌

జమ్మికుంట, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరిన జమ్మికుంటకు చెందిన డాక్టర్‌ సురంజన్‌ తాజాగా బీఆరెస్‌ పార్టీ కండువ కప్పుకుని అందరికీ బిగ్‌ షాక్‌ ఇచ్చారు. జమ్మికుంట మున్సిపాల్టీ ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ అయ్యింది. అప్పటి నుంచి జమ్మికుంట మున్సిపల్‌ రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైద్య వృత్తిలో బిజీగా ఉన్న డాక్టర్‌ సురంజన్‌ అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరి అందరికీ షాక్‌ ఇచ్చారు. డాక్టరే.. చైర్మన్‌ అభ్యర్ధి అంటూ భారీగా ప్రచారం జరిగింది. దీంతో సదరు డాక్టర్‌పై సోషల్‌ మీడియా వేదికగా అనేక ఆరోపణలు చేస్తూ పలువురు పోస్టులు చేశారు. వాటన్నింటినీ లెక్క చేయని డాక్టర్‌ సురంజన్‌ పట్టణ పరిధిలోని 16వ వార్డు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ప్రచారం మొదలు పెట్టారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తమను కాదని బయటి వ్యక్తులకు చైర్మన్‌ పదవి కట్టబెడతారా అంటూ కొందరు నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కాని ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే డాక్టర్‌ సురంజన్‌ బీఆర్‌ఎస్‌లో చేరడం కాంగ్రెస్‌ నాయకులతో పాటుఅటు బీఆర్‌స్‌ నాయకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

- బీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థుల మల్లగుల్లాలు

నిన్నటి వరకు బీఆరెస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్ధి నువ్వా నేనా అని లెక్కలు వేసుకున్న ఆ పార్టీ నాయకులు డాక్టర్‌ సురంజన్‌ ఎంట్రీతో సైలెంట్‌ అయ్యారు. చైర్మన్‌ అభ్యర్ధి ఎవరనేది ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ ప్రకటించనప్పటికి.. నిన్నటి వరకు కాంగ్రెస్‌ చైర్మన్‌ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న డాక్టర్‌ సురంజన్‌ తమ పార్టీలోకి రావడంతో వారంతా సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. చైర్మన్‌ పదవికి అర్హులమైన తమ పరిస్థితి ఏమిటని పలువురు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పుడే చైర్మన్‌ అభ్యర్ధిని ప్రకటించేది లేదని, అదంతా పార్టీ అదిష్టానం చూసుకుంటుందని ఆయన నచ్చజెప్పినట్లు తెలిసింది.

Updated Date - Jan 27 , 2026 | 11:50 PM