యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం కావాలి
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:24 PM
యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
కరీంనగర్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది యాసంగి సీజన్‌లో 2,75,550 ఎకరాల్లో వరి సాగైందని తెలిపారు. 6,46,320 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేస్తున్నామని, 3,67,776 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందన్నారు. జిల్లాలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్, హాకా ద్వారా 322 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పౌరసరఫరాలు, కో ఆపరేటివ్, డీఆర్డీవో, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్, తేమ యంత్రాలు, బరువుతూచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, డ్రైయర్లు, కాలిఫర్స్ వంటి సదుపాయాలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగారావు, పౌరసరఫరాల సంస్థ డిఎం రజనీకాంత్, డీఆర్‌డీవో శ్రీధర్, డీసీవో రామానుజాచార్య, డీఎంవో షాబుద్దీన్ పాల్గొన్నారు.
ఫ గ్యాస్ సరఫరాలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి గ్యాస్ సరఫరా చేయాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చిత్రా మిశ్రా గ్యాస్ ఏజెన్సీ నిర్వహకులను హెచ్చరించారు. మంగళవారం ఆమె సీతారాంపూర్‌లోని నిర్మల భారత్ గ్యాస్ ఏజెన్సీ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీలర్లు గృహవినియోగదారులకు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. స్టాక్ నిలువలు, బుకింగ్ సంఖ్య తదితర వివరాలను ఎప్పటికప్పుడు పౌరసరఫరాలశాఖకు తెలపాలని డీలర్లకు సూచించారు. కలెక్టర్ వెంట అడినషల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు ఉన్నారు.