నేతన్నలపై పనిభారం
ABN , Publish Date - May 01 , 2026 | 12:59 AM
మరమగ్గాలే వాళ్లకు లోకం.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మరమగ్గాలే వాళ్లకు లోకం. నిత్యం నేత పనిలోనే జీవితం. కానీ 8 గంటలకు బదులు 12 గంటలు ఉపాధికోసం మరమగ్గాల చప్పుళ్ల మధ్య నలిగిపోతున్నారు. కూలి ఒప్పందాల సమయంలో కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేస్తామని యాజమాన్యాలు రాసుకున్న ఒప్పందాలు అమలులోకి రావడం లేదు. పని గంటల పరిమితి కోసం సాగిన పోరాటంలో కార్మికుల రక్తంతో తడిసి ఎగిరిన ఎర్రజెండాతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులు ఉపాధికోసం, కూలీ పెంపుకోసం పోరాటాలు కొనసాగిస్తూ ప్రభుత్వం నుంచి నిత్యం చేతినిండా పని ఉండే విధంగా ప్రభుత్వ ఆర్డర్లను సాధించుకున్నారు. ఉపాధి సమస్య లేకపోయినా 12 గంటల పాటు మరనేతలో అనారోగ్యంతో అకాలమరణాలు చెందుతున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా 30,352 వేల మరమగ్గాలు, డైయింగ్‌లు, సైజింగ్‌లు, వార్ఫిన్‌లపై 25 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. 12 గంటలకు పైగా పనిచేసిన నెలకు రూ 12 నుంచి 15 వేల వరకు సంపాదించుకోగలుగుతున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వ చేయూతతో నేత కుటుంబాలు పాత కష్టాలను అధిగమించి కొత్త అవకాశాలతో ముందుకు సాగుతున్నా పని గంటల పరిమితి లేకపోవడంతోనే మానసికంగా, ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్నారు. కార్మిక సంఘాలు 8 గంటల పనివిధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.
స్వశక్తి చీరలతో చేతినిండా పని..
కష్టాలు.. సుఖాలు.. విషాదాలు నిత్యం వెంటాడే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమలో సర్కార్ అందించే వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు కార్మికులకు ఉపాధి ఇస్తున్నాయి. గత సంవత్సరం కొత్త సొబగులతో ఇందిరా మహిళా శక్తి చీరలు ఆడపడుచులకు అందించే ప్రక్రియ సర్కార్ మొదలుపెట్టింది. సిరిసిల్ల నేతన్నల చేతిలో మెరిసిన స్వశక్తి చీరలు ఆడపడుచుల చెంతకు చేరి మురిసిపోయాయి. ఇందిరా మహిళా శక్తి పథకంలో మహిళలకు అందిస్తున్న స్వశక్తి చీరలను స్వశక్తి సంఘాల మహిళలకు మాత్రమే పంపిణీ చేశారు. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ చీరలు ఇవ్వాలని భావించడం మహిళల్లో హర్షం వ్యక్తమైంది. ఇందిరా మహిళా శక్తి చీరలు ఎంతో అందంగా ఆకర్షణీయంగా సిరిసిల్ల మరమగ్గాల వస్త్ర పరిశ్రమలో ఉత్పత్తి ఆర్డర్లు పూర్తి చేశారు. ఈ సంవత్సరం జనవరి, మార్చి మాసంలో 4.30 కోట్ల మీటర్ల చీర బట్ట ఉత్పత్తి ఆర్డర్లు రావడంతో మరగ్గాల చప్పుళ్లు మళ్లీ నిరంతరం వినిపిస్తున్నాయి.. అదే క్రమంలో సిరిసిల్ల మరమగ్గాలపైన చీరల వస్త్ర ఉత్పత్తి పూర్తిచేయగా మళ్లీ అదనంగా 1.87 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్లలో దాదాపు 30352వేల వరకు మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో జియోట్యాగింగ్ చేసిన మరమగ్గాలు 27 వేల వరకు ఉన్నాయి. ఇందులో స్వశక్తి చీరల ఉత్పత్తి 131 మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటీ సొసైటీ(మ్యాక్స్)ల ద్వారా 9600 మరమగ్గాలపైన ఉత్పత్తి జరిగింది. గతంలో బతుకమ్మ చీరల ఉత్పత్తి కోసం తెలంగాణలోని వరంగల్, జగిత్యాల, నల్లగొండ, వికారాబాద్‌లాంటి జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా నేత కార్మికులు సిరిసిల్లకు వచ్చి ఉపాధి పొందారు. సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు చేతినిండా ఉపాధి కలుగుతుందనే ఆలోచనతో చీరల ఉత్పత్తి ఆర్డర్లను అందించారు. నాణ్యతలో ఎలాంటి తేడా రాకుండా పలు చర్యలు తీసుకున్నారు. స్వశక్తి మహిళకు డ్రెస్ కోడ్‌గా ఉండే విధంగా ఉత్పత్తి చేసిన చీరలను పంపిణీ చేశారు. మహిళలకు అందించిన స్వశక్తి చీరలను గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు 2017 నుంచి 2023 వరకు ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని నిలిపివేసింది. ప్రభుత్వం నుంచి ఆర్డర్లు లేకపోవడంతో వస్త్ర పరిశ్రమ ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయింది. నేతన్నల ఆత్మహత్యలు, కార్మిక సంఘాల ఆందోళనలు, అనేక విషాద సంఘటనల మధ్య ప్రభుత్వం మళ్లీ సిరిసిల్ల నేతన్నల ఉపాధిని దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన చీరలను ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా చీరల ఉత్పత్తితో సిరిసిల్ల మరమగ్గాల కార్మికుల పని కల్పించే దిశగా ఆర్డర్లను ఇవ్వడంతో కార్మికులకు నిరంతరంగా ఉపాధి భరోసా వచ్చింది. దీంతోపాటు సమగ్ర శిక్ష శాఖ నుంచి స్కూల్ యూనిఫామ్ వస్త్ర ఉత్పత్తి ఆర్డర్‌ను ఇచ్చింది. అది చేతినిండా పని కల్పించినా 8 గంటల పని విధానం లేకపోవడంతో అనారోగ్యాల పాలవుతున్నారు.