Share News

నేడు కార్మికుల తీర్పు

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:53 AM

తెలంగాణ ఆర్టీసీలో దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ గుర్తింపు సంఘం ఎన్నికలతో కార్మికుల్లో ఉత్సాహం నెలకొంది.

నేడు కార్మికుల తీర్పు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

తెలంగాణ ఆర్టీసీలో దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ గుర్తింపు సంఘం ఎన్నికలతో కార్మికుల్లో ఉత్సాహం నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో గుర్తింపు సంఘాలను రద్దు చేసింది. ఆర్టీసీలో కార్మిక సంఘాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిన సమయంలో కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల తర్వాత ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు తెరలేపడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు ఆర్టీసీ డిపోల వద్ద ఎన్నికల సందడి నెలకొంది. ఆర్టీసీ ఎన్నికల్లో 12 సంఘాలకు గుర్తులు కేటాయించినప్పటికీ కొన్ని సంఘాలు కూటమిగా బరిలోకి దిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు సంఘాలు ఒక కూటమిగా, మూడు సంఘాలు మరో కూటమిగా ఏకతాటి పైకి రావడంతో ఆర్టీసీలో ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ బలపరిచిన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌(టీడబ్ల్యూయూ), స్టాఫ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఎస్‌డబ్ల్యూయూ), స్టాఫ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఒక కూటమిగా పోటీ చేస్తుండగా, ఎంప్లాయిస్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఎన్‌ఎంయూ) మరో కూటమిగా ఉంది. అలాగే తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ పోటీలో నిలిచింది. ఇందులో ప్రధానంగా రెండు కూటమిల మధ్య ముమ్మరంగా పోరు సాగుతోంది. తొలిసారిగా అధికార కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్‌టీయూసీ తొలిసారిగా ఎన్నికల బరిలో దిగింది. కార్మికులు ఎటువైపు నిలుస్తారనే దానిపై చర్చ మొదలైంది. జిల్లాలో రెండు డిపోల్లో 426 మంది ఓటర్లు ఉన్నారు. సిరిసిల్ల డిపోలో 208 మంది, వేములవాడ డిపోలో 218 మంది ఓటర్లు ఉన్నారు. 2016లో చివరిసారిగా ఎన్నికలు జరగగా, 2018లో ఎన్నికలు నిర్వహించలేదు. 2019లో కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం యూనియన్లను రద్దు చేసి వెల్ఫేర్‌ బోర్డులను ఏర్పాటు చేసింది. తాజాగా కార్మిక శాఖ ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రశ్నార్థకంగా మారిన యూనియన్లకు జీవం వచ్చింది. గురువారం ప్రచారం ముగిసిపోవడంతో శుక్రవారం సిరిసిల్ల, వేములవాడ రెండు డిపోల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ నిర్వహించి 17న ఫలితాలు ప్రకటిస్తారు. 14, 15 తేదీల్లో ఆన్‌ డ్యూటీ సిబ్బంది కోసం పోస్టల్‌ బ్యాలెట్‌కు అవకాశం కల్పించారు. కార్మికులు ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనడానికి రెండు బ్యాలెట్‌ పత్రాలను అందిస్తారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు కోసం ఒక సంఘం గుర్తుపై, రెండు బ్యాలెట్‌ పత్రంలో రీజియన్‌, స్థానిక గుర్తింపు కోసం ఇష్టమైన సంఘానికి మద్దతు తెలిపేలా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. దీంతో కార్మికులు ఏ కూటమి వైపు మొగ్గు చూపుతారని ఆసక్తి నెలకొంది.

తటస్థులపై ప్రత్యేక దృష్టి..

సుదీర్ఘకాలం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపి లక్ష్యంగా కార్మికులను ఆకట్టుకునే దిశగా యూనియన్లు ప్రయత్నం చేశాయి. కార్మికులను ప్రసన్నం చేసుకోవడానికి వ్యూహాలు, తమ వైపు తిప్పుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. ఓట్లలో 51 శాతం ఓట్లు ఏ సంఘానికి వస్తాయో ఆ సంఘం గుర్తింపు సంఘంగా ఉంటుంది. డిపోల వద్ద ఓట్లను రాబట్టుకోవడానికి శాయశక్తులా యూనియన్‌ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తటస్థులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి కార్మికులను వ్యక్తిగతంగా కలుస్తూ మద్దతు కోరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై హామీలు ఇస్తూ ప్రచారం చేశారు. కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు.

కార్మికులకు సంఘాల డిమాండ్లు, హామీలు..

ఫ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఉద్యోగ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచాలి

ఫ టికెట్‌ తీసుకునే బాధ్యత ప్రయాణికులకు చేస్తూ డ్రైవర్‌, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ఫ ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దుచేసి ఖాళీల్లో రెగ్యులర్‌ ఉద్యోగులను నియమించాలి

ఫ మహిళా కండక్టర్లు, ఇతర మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు 240 రోజులకు పెంచాలి

ఫ రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన బదిలీ పాలసీ అమలు చేయాలి

ఫ ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాలలో నిరుపేద ఆర్టీసీ ఉద్యోగులకు ఇల్లు కట్టించి ఇవ్వాలి

ఫ సిబ్బందిపై పని భారం తగ్గించడం

ఫ కొత్త బస్సుల కొనుగోలు ద్వారా సంస్థను బలోపేతం చేయడం

ఫపెండింగ్‌ ఉన్న బకాయిలు, వేతన సవరణలు అమలు చేయడం

ఫ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు

ఫ బకాయి వేతనాలు, పిఎఫ్‌ కోపరేటివ్‌ బకాయిల చెల్లింపు

ఫ కార్మిక సంఘాలపై ఉన్న ఆంక్షలు తొలగింపు, యూనియన్‌ హక్కుల పరిరక్షణ

ఫ ఉద్యోగ భద్రత, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చర్యలు

ఫ ఉద్యోగులందరికీ పండుగలకు అడ్వాన్స్‌ రూ 20 వేలు చెల్లించాలి

ఫ అద్దె బస్సులను రద్దుచేసి ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలి

ఫ అన్ని కేటగిరీలలో ఖాళీలు భర్తీ చేసి పదోన్నతులు ఇవ్వాలి

Updated Date - Oct 09 , 2026 | 12:53 AM