Share News

మున్సిపల్‌ ఎన్నికల్లో కార్యకర్తలే రథసారథులు

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:04 AM

వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీకి కార్యకర్తలే రథసారథులని, జగిత్యాల నియోజక వర్గంలో పది సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ జెండా మోసినోళ్ళకే పార్టీ టికెట్‌లు ఇస్తామని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో కార్యకర్తలే రథసారథులు
మాట్లాడుతున్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

జగిత్యాల అర్బన్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీకి కార్యకర్తలే రథసారథులని, జగిత్యాల నియోజక వర్గంలో పది సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ జెండా మోసినోళ్ళకే పార్టీ టికెట్‌లు ఇస్తామని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటి వేయాలని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపు నిచ్చారు. ఆదివారం జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో జీవన్‌రెడ్డి పార్టీ నాయకులు వెంకటస్వామితో కలిసి పాల్గొన్నారు. 1987 నుంచి 2019 మినహా ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జగిత్యాల మున్సిపల్‌లో గెలుపొందిందని, పట్టణంలో ఆది నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఆదిపత్యం కొనసాగుతున్నదన్నారు. ఎన్నడూ కాంగ్రెస్‌ జెండా పట్టని వారు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. మున్సిపల్‌ పాలక మండలిపై ఎమ్మెల్యేగా ఏ రోజూ తాను జోక్యం చేసుకోలేదని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్లు పంచుకోవడానికి నీ సొత్తు కాదని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ను ఉద్ధేశించి అన్నారు. తాను ప్రజా జీవితంలో ఉన్నంత కాలం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం పోరాటం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు గాజంగి నందయ్య, టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు కొత్త మోహన్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌లు విజయలక్ష్మీ, జిఆర్‌. దేశాయి, గాజుల రాజేందర్‌, దుర్గయ్య, మన్సూర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2026 | 01:04 AM