Share News

మహిళా సంక్షేమ సంబరం షురూ

ABN , Publish Date - May 26 , 2026 | 12:57 AM

ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా శాఖల ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ వారోత్సవాలు నిర్వ హిస్తున్నారు.

మహిళా సంక్షేమ సంబరం షురూ

జగిత్యాల, మే25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా శాఖల ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ వారోత్సవాలు నిర్వ హిస్తున్నారు. మహిళల అభివృద్ధి, ఆరోగ్యం, పోషకాహారం, బాల్య వివాహాల నిరోధం, మహిళల భద్రత, అంగన్‌వాడీల అభివృద్ధిపై కార్యక్ర మాలు ప్రణా ళికాబద్ధంగా నిర్వహిస్తారు. మహిళా సంక్షేమ వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించడానికి ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆయా జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఫ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన వారోత్సవాలు...

జిల్లా వ్యాప్తంగా తొలి రోజు స్థానికంగా లభ్యమయ్యే తక్కువ ఖర్చుతో కూడిన పోషకాహార పదార్థాల ప్రదర్శనలు, పోషకాహార వైవిద్యంపై అవగాహన కార్యక్రమాలు, వంటల పోటీలు, గర్భిణులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార ప్రదర్శనలు నిర్వహించారు.

ఫ బాల్య వివాహాల నిరోధంపై..

బాల్య వివాహం-బతుకు ఆగం నినాదంతో ఈనెల 26న అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోస్టర్లు, వాల్‌పెయింటింగ్స్‌, సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారాలు నిర్వహించనున్నారు. బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల మ్యాపింగ్‌ చేయడం, మత పెద్దలు, గ్రామపెద్దలతో సమావేశాలు నిర్వహించడం, గ్రామ పంచాయతీ తీర్మానాల ప్రదర్శించనున్నారు. తల్లిదండ్రులు, మత పెద్దల నుంచి చట్టబద్ధ వివాహ వయస్సుపై అంగీకార పత్రాలు తీసుకోనున్నారు. హెల్ప్‌ లైన్‌ నంబర్లు 1098, 181, 100లను ప్రచారం చేయనున్నారు. సారంగాపూర్‌ మండలంలో బాల్య వివాహాల నిరోధక ర్యాలీ, జైనాలో గ్రామ సభల నిర్వహన, బీర్‌పూర్‌, వెల్గటూరులో యువత, తల్లిదండ్రులతో సమావేశాలు, బుగ్గారంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఫ మహిళల భద్రతపై అవగాహన..

జిల్లాలో ఈనెల 28న మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నిపుణుల సెషన్లు, షీ బాక్స్‌ పోర్టల్‌పై మహిళలకు అవగాహన కల్పించడం, మహిళల భద్రతపై ఇంటరాక్టివ్‌ చర్యలు నిర్వహిం చడం, పోష్‌ కమిటీల ఏర్పాటు, నమోదు ప్రక్రియ చేపట్టడం, మహిళలకు ఫిర్యాదు వ్యవస్థలపై అవగాహన కల్పించడం వంటివి నిర్వహించనున్నారు. బీర్‌పూర్‌, బుగ్గారం మండలాల్లో మహిళా ఉద్యోగులతో అవగాహన సమావేశాలు, జగిత్యాల అర్బన్‌, కోరుట్ల మండలాల్లో న్యాయ నిపుణులతో ప్రత్యేక సెషన్లు నిర్వహించడం, మెట్‌పల్లి మండలంలో మహిళా సంఘాలతో భద్రతా చర్చలు చేపట్టడం వంటివి నిర్వహించనున్నారు.

ఫ అంగన్‌వాడీ భవనాల ప్రారంభాలు..

ఈనెల 29న అంగన్‌వాడీ భవనాల ప్రారంభోత్సవాలు నిర్వహించ నున్నారు. ఎంపిక చేసిన భవనాల ప్రారంభోత్సవాలు నిర్వహించడం, అవసరమైన చోట్ల కొత్త భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ధర్మపురి మండలం జైనా, సారంగాపూర్‌, మేడిపల్లి, మెట్‌పల్లి మండల ప్రాంతాల్లో భవన ప్రారంభోత్సవాలు నిర్వహించడానికి ప్రతిపాదించారు. అంగన్‌వాడీల్లో మౌలిక వసతులను కల్పించడంపై దృష్టి సారించనున్నారు. ధర్మపురి మండలం దొంతాపూర్‌లో అంగన్‌వాడీ భవనం ప్రారంభం, సారంగాపూర్‌ మండలం అర్పపల్లిలో, మేడిపల్లి మండలం మాదాపూర్‌లో, మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌లో అంగన్‌వాడీ భవనాల ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ఫ అమ్మమాట-అంగన్‌వాడీ బాట..

ఈనెల 30న ‘అమ్మమాట- అంగన్‌వాడీ బాట’ అను నినాదంతో నమోదు కార్యక్రమం నిర్వహించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల నమోదు ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతారు. పాఠశాల ముందు విద్యపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి సెక్టార్‌లో పిల్లల గుర్తింపు, నమోదు కార్యక్రమాలు చేపట్టడం వంటి వాటిపై దృష్టి సారించనున్నారు. బీర్‌పూర్‌, బుగ్గారం, జైనా, నేరెళ్ల ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం ద్వారా పిల్లల నమోదు కార్యక్రమాలు, జగిత్యాల రూరల్‌, మల్లాపూర్‌ మండలాల్లో తల్లిదండ్రుల సమావేశాలు, కోరుట్ల, మెట్‌పల్లి మండలాల్లో అంగన్‌వాడీల శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఫ పోషణ, ఆరోగ్య కార్యక్రమాల అమలు..

మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడం వంటివి నిర్వహిస్తారు. జిల్లాలో 6,625 మంది..గర్భిణులను గుర్తించారు. వీరికి కుటుంబ ఆరోగ్య శాఖ సమన్వయంతో ఎనిమియాపై అవ గాహన కల్పిస్తారు. క్యాంపుల ద్వారా గర్భిణులకు హీమోగ్లోబిన్‌ పరీక్షలు, రక్తహీనత నివారణపై అవగాహన కల్పించడం, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతారు.

ఫ బ్యాంకు లింకేజీ, రుణ మేళాలు..

మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో 30వ తేదీ వరకు డీఆర్‌డీఏ, మెప్మా తదితర శాఖల ఆద్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహిళా సంఘాల ద్వారా తయారు చేయబడిన ఉత్పత్తుల ప్రదర్శన, బ్యాంక్‌ లింకేజీ కార్యక్రమాలు, రుణ మేళాలు, డిజిటల్‌ లావాదేవీలపై అవగాహణ, మార్కెటింగ్‌ అవకాశాలపై శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. మహిళా వ్యాపారవేత్తలకు మున్సిపాలిటీలలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సేవలు అందించనున్నారు. ఎస్‌హెచ్‌జీ మహిళల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. రుణ మేళాలు, మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం, పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద క్రెడిట్‌ లింక్‌ సబ్సీడీ రుణాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అర్హులైన మహిళా సంఘాలు రుణాలు పొందేలా కృషి చేయనున్నారు.

పకడ్బందీగా మహిళా వారోత్సవాలు

- ఆడెపు భాస్కర్‌, జిల్లా సంక్షేమ అధికారి

జిల్లా వ్యాప్తంగా మహిళా వారోత్సవాల కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించనున్నాము. మహిళల అభివృద్ధి, ఆరోగ్యం, భద్రత, సాధికారత, బాలల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా సమర్థవంతంగా అమలు చేయడంపై దృష్టి సారించాము. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తాము.

Updated Date - May 26 , 2026 | 12:57 AM