మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
ABN , Publish Date - May 24 , 2026 | 12:02 AM
జిల్లాలో మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
కరీంనగర్, మే 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. శనివారం మహిళా వారోత్సవాలపై మహిళా శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, మెప్మా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగాఈ నెల 25 నుంచి 30 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. 25న పోషకాహార వంటకాల ప్రదర్శన ఏర్పాటు చేసి సే నో టు జంక్ ఫుడ్‌పై అవగాహన కల్పించాలన్నారు. 26న బాల్య వివాహాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 27న మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు, షీటీమ్స్ సమన్వయం కార్యాలయాల్లో పీఓఎస్‌హెచ్ నిబంధనల అమలుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 29న జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీ కేంద్రాలు, వీవో భవనాలు ప్రారంభించాలన్నారు. 30న అమ్మ మాట అంగన్‌వాడీ బాట కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మెప్మా పీడీ స్వరూపారాణి డీఆర్డీఏ పీడీ గీత, డీపీవో జగదీశ్వరరావు పాల్గొన్నారు.