Share News

స్త్రీ నిధి డబ్బులు.. రూ.కోటి స్వాహా

ABN , Publish Date - Jan 13 , 2026 | 01:32 AM

జిల్లాలో రూ.1కోటి స్త్రీనిధి డబ్బులు పక్కదారి పట్టాయి.

 స్త్రీ నిధి డబ్బులు.. రూ.కోటి స్వాహా

- మహిళా సంఘాల సభ్యుల రుణాలు వాడుకున్న వీవోఏలు

- సభ్యులు చెల్లించిన వాయిదా సొమ్మును సైతం బ్యాంకుల్లో చెల్లించకుండా సొంతానికి..

- స్వాహా చేసిన డబ్బుల్లో చెల్లించింది రూ.14.25లక్షలే..

- చెల్లించాల్సింది వడ్డీతో కలిపి రూ.1.43కోట్లు

- ఆర్‌ఆర్‌ యాక్టు అమలుకు రంగం సిద్ధం చేస్తున్న అధికారులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో రూ.1కోటి స్త్రీనిధి డబ్బులు పక్కదారి పట్టాయి. స్వశక్తి సంఘాల మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని గడిచిన ఐదేళ్లలో కోటి రూపాయలకు పైగా స్త్రీనిధి బ్యాంకు ద్వారా మంజూరైన రుణాలతోపాటు సభ్యులు రుణాలపై చెల్లించిన వాయిదాల సొమ్మును తిన్న కొందరు వీఏల నుంచి తిరిగి రాబట్టేందుకు సంబంధిత అధికారులు రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) చట్టాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పక్కదారి పట్టిన సొమ్ములో రూ.14లక్షల 25 వేలు చెల్లించగా, అసలు, వడ్డీతో కలిపి కోటి43లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని అధికారులు గుర్తించారు. తము కాళ్లపై తాము నిలబడేందుకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకుగాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో సెర్ప్‌ ఆధ్వర్యంలో స్త్రీనిధి బ్యాంకును ఏర్పాటు చేశారు. క్రమం తప్పకుండా పొదుపు చేసే మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా జీరో వడ్డీకే 5నుంచి 10లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తున్నారు. ఇవేగాకుండా పిల్లల పెళ్లిళ్ల కోసం, చదు వుల కోసం, ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పర్చుకునేందుకు గాను స్త్రీనిధి బ్యాంకు ద్వారా 30వేల నుంచి 3లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తున్నారు. సంఘ సభ్యులు అందరూ కలిసి తీర్మానాలు చేసిన తర్వాత మహిళా సంఘాల సహాయకుల (వీవోఏ) ద్వారా స్త్రీనిధి బ్యాంకుకు ప్రతిపాదనలు పంపిస్తారు. తద్వారా మంజూరైన రుణాన్ని సభ్యులకు అందజేయాల్సి ఉంటుంది. ఎవరికైతే రుణం కావాలని కోరుకుంటారో వారికే రుణం మంజూరయ్యిందని చెప్పి వారికి ఆ డబ్బులను ఇస్తారు. రుణం అవసరం లేని వారి పేరిట వారికి తెలి యకుండా వీవోఏలు స్త్రీనిధి బ్యాంకుకు ప్రతిపాదనలు పంపగా వచ్చిన సొమ్మును కొందరు వీవోఏలు తమ సొంతానికి వాడుకున్నారు. అలాగే రుణాలు పొందిన సభ్యులు చెల్లించే వాయిదా సొమ్మును బ్యాంకుల్లో చెల్లించకుండా స్వాహాచేసిన ఉదంతాలు జిల్లాలోనూ చోటు చేసుకు న్నాయి. తీసుకున్న రుణాలు చెల్లించడం లేదని స్త్రీనిధి బ్యాంకు నుంచి నోటీసులు వచ్చే వరకు కూడా మహిళలకు ఈ విషయం తెలియకుండా పోయింది. సభ్యులు చెల్లించిన వాయిదా సొమ్మును తీసుకునే వీవోఏలు వారికి ఎలాంటి రశీదులు ఇవ్వకుండా తెలివిగా వ్యవహరించారు.

ఫ ఐదేళ్లలో రూ.కోటి నిధులు స్వాహా..

2018-19నుంచి 2023-24వరకు గడిచిన ఐదేళ్లలో ధర్మారం, రామగిరి, ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్‌, అంతర్గాం, పాలకుర్తి మండలా ల్లోని పదిమంది వీవోఏలు 122సంఘాలకు చెందిన 606మంది సభ్యుల పేరిట మంజూరైన రుణాలతోపాటు చెల్లించిన వాయిదా సొమ్ము ఒక కోటి9,860 రూపాయల సొమ్మును స్వాహాచేసి తమ సొంతానికి వాడుకున్నట్లు స్త్రీనిధి బ్యాంకు అధికారులు గుర్తించారు. స్వాహా చేసిన సొమ్ములో వీవోఏలు 14,25,81 రూపాయలు మాత్రమే చెల్లించాలి. ఇంకా అసలు 85,84,779 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం వడ్డీతో కలిపి కోటి 43,65,667 రూపాయలు స్త్రీనిధి బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది. ఈ వ్యవహారంలో కొందరు వీవోఏలకు అధికారులు నోటీసులు పంపించారు. పాలకుర్తి మండలంలో ముగ్గురు వీవోఏలు స్త్రీనిధి రుణాలు, వాయిదా డబ్బులను స్వాహా చేయగా, తిరిగి చెల్లించే విషయమై సదరు వీవోఏలు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బాధిత మహిళలు రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ను కలిశారు. ఆయన సూచన మేరకు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ స్వాహా పర్వం అంతా స్త్రీనిధి బ్యాంకు నుంచి నోటీసులు వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చింది. ఒక వీవోఏ పరారీలో ఉన్నట్లు సమాచారం. సదరు వీవోఏ 38లక్షల రూపాయలు వాడుకున్నారు. అసలు 37.17 లక్షలు, వడ్డీతో కలిపి 53.67లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ రకంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహిళా సంఘాల అమాయకత్వాన్ని ఆసరా జేసుకుని డబ్బులు స్వాహా చేసిన ఉదంతాలు ఉన్నాయి.

ఫ నిధుల రికవరీ కోసం ఆర్‌ఆర్‌ యాక్టు అమలు..

స్త్రీ నిధులను స్వాహా చేసిన వీవోఏల నుంచి, రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని మహిళల నుంచి తిరిగి రాబట్టేందుకు గాను ప్రభు త్వం రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసింది. స్త్రీనిధి బ్యాంకు రుణాలు రికవరీపై సంబంధిత అధికారులు ఆర్‌ఆర్‌ యాక్టు అమలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించడంతో ఆ చట్టాన్ని ప్రయోగించే విధంగా గడిచిన ఏడాది నవంబర్‌ 20వ తేదీన జీవో ఎంఎస్‌ నంబర్‌ 146ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు దానిపై సంబంధిత అధికారులు లెక్కలు తీస్తున్నారు. జిల్లాలో 2025 అక్టోబర్‌ మొదటివారం నాటికి కోటి రూపాయల పైచిలుకు స్వాహా అయినట్లు గుర్తించారు. స్వాహా చేసిన వారినుంచి సొమ్ములు రాబట్టేందుకు ఆర్‌ఆర్‌ యాక్టు ద్వారా నోటీసులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్త్రీనిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు మన స్త్రీ నిధి యాప్‌ను కూడా తీసుకవచ్చారు.

ఫ స్వాహా అయిన సొమ్ము రికవరీ కోసం ఆర్‌ఆర్‌ యాక్టు..

- దుర్గా ప్రసాద్‌, ఆర్‌ఎం, స్త్రీనిధి

స్వాహా అయిన స్త్రీనిధి డబ్బులు, రుణాలు చెల్లించకుండా ఉన్న వారి నుంచి ఆ నిధులను తిరిగి రాబట్టేందుకు గాను ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయేగించేందుకు అవకాశం ఇచ్చింది. జిల్లాలో గడిచిన ఐదేళ్లలో కోటి రూపాయలకు పైగా పక్కదారి పట్టాయని గుర్తించాం. వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాఽధికారులు రంగం సిద్ధంచేస్తున్నారు. రుణాల స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన స్త్రీనిధి యాప్‌ గురించి మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం.

Updated Date - Jan 13 , 2026 | 01:32 AM