Share News

మహిళలే మహారాణులు

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:36 AM

మున్సిపల్‌ పోరులో మహిళలు ప్రభంజనం సృష్టించారు.

మహిళలే మహారాణులు

జగిత్యాల, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ పోరులో మహిళలు ప్రభంజనం సృష్టించారు. జిల్లాలోని అతివలు ఓట్లలోనే కాదు సీట్లలోనూ ఆధిక్యతను నిరూపించుకున్నారు. అతివలకు రిజర్వ్‌ చేసిన స్థానాల కంటే ఎక్కువ చైర్‌పర్సన్‌ స్థానాలను, వార్డు కౌన్సిలర్ల స్థానాలను కైవసం చేసుకున్నారు. మహిళలకు ఇతర రంగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. జిల్లాలో నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఐదింటిలో మూడు మున్సిపల్‌ చైర్మన్‌ పదవులను మహిళలు చేజిక్కించుకున్నారు.

ఫజిల్లాలో 77 వార్డుల్లో మహిళలు విజయం..

జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లో కలిపి 136 వార్డు కౌన్సిలర్‌ స్థానాలుండగా 67 స్థానాలను, 49.26 శాతం మహిళలకు కేటాయించారు. అయితే జనరల్‌ స్థానాల్లోనూ పలువురు మహిళలు రంగంలోకి దిగి 77 మంది స్థానాల్లో కౌన్సిలర్లుగా విజయం సాధించారు. పురుషులు 59 మంది విజయం సాధించగా, మహిళలు 77 మంది గెలుపొందారు. పురుషుల కంటే మహిళలు 18 మంది అధికంగా ఎన్నికయ్యారు. జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి మున్సిపల్‌ చైర్మన్‌ జనరల్‌ మహిళకు, జగిత్యాల మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు.

ఫమున్సిపాలిటీల వారీగా ఇలా..

జిల్లాలోని జగిత్యాల మున్సిపల్‌లో 50 వార్డులకు గాను 30 వార్డుల్లో మహిళలు, 20 వార్డుల్లో పురుషులు గెలుపొందారు. ధర్మపురిలో 15 వార్డులకు గాను ఏడుగురు మహిళలు, 8 పురుషులు, కోరుట్లలో 33 స్థానాలకు గాను 19 మహిళలు, 14 పురుషులు, మెట్‌పల్లిలో 36 వార్డులకు గాను 14 మహిళలు, 12 పురుషులు, రాయికల్‌లో 12 వార్డులకు 7 మహిళలు, 5 పురుషులు గెలుపొందారు. జిల్లాలోని జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా సమిళ్ల వాణి శ్రీనివాస్‌, కోరుట్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా తిరుమల వసంత, ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా వేముల నాగలక్ష్మీలు ఎన్నికయ్యారు.

ఫ జిల్లాలో మహిళా ఓటర్లే అధికం

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 136 వార్డుల పరిధిలో మొత్తం 2,31,627 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,11,805 మంది పురుషులు, 1,19,797 మంది మహిళలు, 25 మంది ఇతరులున్నారు. పోలింగ్‌లో సైతం పురుషుల కన్నా 13,886 మంది మహిళలు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మున్సిపల్‌ ఫలితాల్లో పురుషుల కంటే మహిళలు అధికంగా వార్డు కౌన్సిలర్లుగా గెలుపొందారు.

ఫస్థానిక సమస్యలపై అవగాహన

స్థానిక సంస్థల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది. దీనివల్ల ఆ సమస్యల పరిష్కారానికి వారు ప్రత్యేక చొరవ తీసుకునే అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు. రాజకీయ నాయకులు తమకు అవకాశం రాని చోట తమ కుటుంబంలోని మహిళలను రంగంలోకి దించి గెలిపించారు.

ఫచట్ట సభల్లోనూ రిజర్వేషన్లు అమల్లోకి వస్తే...

మహిళలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం రాజకీయ చైతన్యం పెరిగిన నేపథ్యంలో 2029లో చట్ట సభల్లోనూ మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే ఎంత మంది మహిళా రాజకీయవేత్తలు వెళ్తారరేది ఆసక్తికరం. వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికయిన వారిలో విద్యాధికులు కూడా అధికంగా ఉండటం గమనార్హం. వార్డు సభ్యుల ఎన్నికలోనూ మహిళలు అన్‌ రిజర్వ్‌డ్‌ సీట్లలో గెలుపొంది సత్తాచాటారు. జిల్లాలో మహిళలకు పదవులు ఇస్తూ వారికి రాజకీయాల్లో రాణించే అవకాశం కల్పించడం మంచి పరిణామం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - Feb 20 , 2026 | 12:36 AM