విషజ్వరాలతో విలవిల
ABN , Publish Date - Sep 17 , 2026 | 01:06 AM
వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు జ్వరాలతో మంచం పదుతున్నారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు జ్వరాలతో మంచం పదుతున్నారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు, జలుబు, దగు, నీరసం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు వైద్యం కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పలు అస్పత్రులు జ్వర బాధితులతో కిటకిటలాతున్నాయి.
ఫ ఎక్కడ చూసిన జ్వర బాధితులే..
కొద్ది రోజులుగా జిల్లాలో వైరల్‌జ్వరాల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు జ్వరాలబారిన పడుతూ అస్పుత్రుల్లో చేరిన ఘటనలున్నాయి. చిన్నారులు, వృద్ధులతో పాటు యువత కూడా జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు, గొంతునొప్పి, జలుబు, దగ్గు, నీరసం వంటి లక్షణాలతో బాధితులు వైద్యులను సంప్రదిస్తున్నారు. కొందరిలో జ్వరం తగ్గిన తర్వాత కూడా నీరసం, ఒళ్లు నొప్పులు మాత్రం అలాగే కొనసాగుతున్నాయని చెబుతున్నారు.
ఫ ఆస్పత్రులకు తాకిడి..
జ్వరాల తీవ్రతతో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు జిల్లాలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఉదయం నుంచే ఓపీ విభాగాల వద్ద జ్వరబాధితులు బారులు తీరుతున్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ అసుపత్రికి నిత్యం మూడు వందలకు పైగా ప్రజలు వైద్య కోసం వస్తున్నట్లు అస్పత్రివర్గాలు చెబుతున్నాయి. అలాగే రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కూడా రోగులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతీరోజూ వందకు పైగా రక్తపరీక్షల నమోదు అవుతున్నాయి. జిల్లాలోని ఇతర ప్రధాన పట్టణాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జ్వరంతో బాధపడుతున్న భాదితులు నాలుగైదు రోజులు గడిచినా తగ్గక పోవడంతో వారిలో ఇవి సాధారణ జ్వరాలా లేక డెంగ్యూ ఇతర సీజనల్ వ్యాధులా అన్న అనుమానాలు కలిగి ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
ఫ డెంగ్యూ కేసులతో ఆందోళన
వైరల్‌జ్వరాలతో పాటు జిల్లాలో అక్కడక్కడా డెంగ్యూ కేసులు కూడా నమోదవుతున్నాయి. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఐదుకేసులు నమోదు కాగా వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెంట వెంటనే స్పందించి ప్రత్యేకశిబిరాలు నిర్వహించారు. కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో వందకు పైగా రక్త పరీక్షలు నిర్వహించారు.
జ్వరాలు తగ్గకపోవడం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా తమను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. సొంతంగా మందులు వాడకుండా వైద్యుల సలహామేరకు చికిత్స తీసుకోవాలని అంటున్నారు.
ఫ పారిశుధ్యం లోపం..
జిల్లాలో జ్వరాలు పెరగడానికి వర్షాలు, వాతావరణ మార్పులతో పాటు పలు ప్రాంతాల్లో పారిశుధ్య లోపాలు కూడా కారణమవుతున్నాయి. మురుగు కాలువలు సక్రమంగా శుభ్రం చేయకపోవడం, రోడ్ల పక్కన చెత్త పేరుకుపోవడం, నీరు నిల్వ ఉండడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. మురుగు నీటి కాలువలను శుభ్రం చేయడంతోపాటు నిల్వ ఉన్న నీటిని తొలగించడం, దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ ముందుస్తు చర్యలే మేలు..
సీజనల్ వ్యాధులు విస్తరించే సమయంలో వైద్యఆరోగ్యశాఖతో పాటు మున్సిపల్, పంచాయతీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. గ్రామాలు పట్టణాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు.