Share News

కాలం కలిసొచ్చేనా..

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:23 AM

రోహిణి కార్తెలో దుక్కులు దున్ని మృగశిరకార్తెతో వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తూ రైతన్నలు వానాకాలం సాగుకు సిద్ధమవుతారు.

 కాలం కలిసొచ్చేనా..

- వానాకాలం సాగుకు ఎల్‌నినో గండం

- ఆలస్యమైన రుతుపవనాలు

- సాధారణ వర్షపాతం కష్టమేనంటున్న శాస్త్రజ్ఞులు

- వరి సాగుకు అనుకూలించని పరిస్థితి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రోహిణి కార్తెలో దుక్కులు దున్ని మృగశిరకార్తెతో వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తూ రైతన్నలు వానాకాలం సాగుకు సిద్ధమవుతారు. సోమవారం మృగశిర ప్రారంభమైంది. ఇప్పటికీ నైరుతి రుతుపవనాల జాడ లేదు. సాధారణంగా జూన్‌ 1న రుతుపవనాలు కేరళను తాకి వారంరోజుల్లోగా తెలంగాణలో విస్తరిస్తాయి. అదిగో వర్షం.. ఇదిగో వర్షం అనడమే కానీ ఇంకా రుతుపవనాలు తెలంగాణను తాకలేదు. ఎల్‌నినో రోజురోజుకు బలపడుతూ వేడిగాలులతో సముద్రాన్ని వేడెక్కిస్తున్నదని, ఈసారి రుతుపవనాల ప్రభావం తగ్గి సాధారణ వర్షపాతానికంటే తక్కువ వర్షం కురుస్తుందని శాస్త్రజ్ఞులు పదేపదే చెబుతున్నారు.

- సన్నరకం వరికే డిమాండ్‌

ప్రభుత్వం వర్షభావ పరిస్థితులు నెలకొనే నేపథ్యంలో ప్రత్యామ్నాయ వానాకాలం సాగుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. పప్పు దినుసులు తదితర పంటలు సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో 90 శాతం విస్తీర్ణంలో వరిని మాత్రమే సాగు చేసే జిల్లా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సన్న వరి రకాలను మాత్రమే సాగు చేయాలని, వాటిని మాత్రమే సేకరిస్తామని చెబుతోంది. రాష్ట్రంలో పౌరసరఫరాలశాఖ ద్వారా ఇచ్చే రేషన్‌ బియ్యమే కాకుండా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో సన్న బియ్యం భోజనమే పెడుతుండడంతో సన్న వరి రకాలకు సహజంగానే డిమాండ్‌ ఏర్పడుతున్నది.

- నీటి లభ్యత ఎలా..

సన్న వరి రకాలు సాగు చేస్తే దీర్ఘకాలిక పంట కావడంతో నీరు ఎక్కువ అవసరమవుతుంది. వర్షాలే సరిగా పడవు అంటున్న నేపథ్యంలో ఈ వరి రకాలను సాగు చేస్తే ఎలా అని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు సన్నవరి రకాలను చీడపీడలు ఎక్కువ ఆశించడం, క్రిమిసంహారక మందులకు ఎక్కువ డబ్బు వినియోగించాల్సి రావడం రైతులను ఇబ్బందులకు గురి చేస్తాయి. దీంతో జిల్లాకు చెందిన రైతులు ఎక్కువగా దొడ్డు రకాలనే సాగుచేస్తూ వస్తున్నారు. సాధారణంగా వానాకాలంలో 2.8 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తారు. 40 శాతం మేరకు మాత్రమే సన్నరకాలు సాగు చేసి 60శాతం దొడ్డు వరి రకాలను సాగు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. దొడ్డు వరి రకాలను సేకరించే పరిస్థితులు ఉండకపోవచ్చని కేంద్ర ప్రకటనలు సూచిస్తుండగా నీటి కొరత కూడా ఉండే అవకాశం ఉంది. జిల్లాలో వానాకాలంలో 3,44,420 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారు. ఇందులో 81 శాతం వరి సాగు ఉంటుంది. ఈసాగులో 90 శాతం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు ద్వారానే సాగవుతున్నది. మిగతా 10 శాతం బావులు, బోరుబావులు, చెరువులు, కుంటల ద్వారా సాగు చేస్తారు. ప్రాజెక్టుల్లో నీరు పూర్తిగా అడుగంటి పోవడం, భూగర్భజలాలు 8.5 మీటర్ల నుంచి 13.5 మీటర్లకు పడిపోవడంతో బావుల కింద సాగు ప్రశ్నార్థకం కానున్నది.

- ఆందోళనకరంగా ప్రాజెక్టుల పరిస్థితి

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో 80.5 టీఎంసీల సామర్థ్యానికి 12.9, మధ్యమానేరు రిజర్వాయర్‌లో 27.55 టీఎంసీలకు 7.49, లోయర్‌ మానేరు డ్యామ్‌లో 24.030 టీఎంసీలకుగాను ఆరు టీఎంసీల నీరు నిలువ ఉన్నది. వర్షాలు పడకపోతే త్వరలోనే ఈ నీరు కూడా డెడ్‌ స్టోరేజీ లెవల్‌కు పడిపోయి మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరందించడం కష్టమవుతుంది. దీంతో రైతులు నైరుతి రుతుపవనాలపైనే భారీగా ఆశలు పెట్టుకున్నారు. నాలుగు నెలల్లో సాధారణ వర్షపాతం 733.2 మిల్లీమీటర్లు. జూన్‌ నెలలో 124.5, జూలైలో 238, ఆగస్టులో 203.6, సెప్టెంబరులో 167.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైతే సాగుకు ఇబ్బందులు ఉండక పోవచ్చు. వర్షం కురవక పోతే ప్రత్నామాయ సాగుకు వెళ్లినా రైతుల ఆదాయం 50 నుంచి 40 శాతానికి పడిపోయి తీవ్రంగా నష్టపోయే అవకాశమున్నది. .

- ప్రత్యామ్నాయ సాగుకు ఏర్పాట్లు

వర్షాలు ఆలస్యమైతే 26,983 ఎకరాల విస్తీర్ణంలో వరి, 5,294 ఎకరాల్లో పత్తి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయంగా కందులు, పెసర, బబ్బర్ల సాగుకు రైతులు మారాలని వ్యవసాయశాఖ సూచిస్తున్నది. వరికి బదులుగా 4,497 ఎకరాల్లో కంది, 13,492 ఎకరాల్లో బబ్బర్లు, 8,994 ఎకరాల్లో పెసర పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం 360 క్వింటాళ్ల కంది, 1,369 క్వింటాళ్ల బబ్బెర, 720 క్వింటాళ్ల పెసర విత్తనాలు అవసరమని అంచనా వేసింది. పత్తికి బదులుగా సాగు చేసే 882 ఎకరాల్లో 71 క్వింటాళ్ల కంది, 2647 ఎకరాల్లో 265 క్వింటాళ్ల బబ్బర విత్తనాలు అవసరమవుతాయని భావించిన వ్యవసాయశాఖ ఆ మేరకు విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. పంట పొలాలను సారవంతం చేసేందుకు పచ్చిరొట్టను పెంచి దున్నేస్తారు. ఇందుకోసం 5,200 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు, 760 క్వింటాళ్ల జనుము విత్తనాలు అవసరం కాగా జిల్లాలో 1159 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 4,040 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు, 760 క్వింటాళ్ల జనుము విత్తనాల కోసం ప్రతిపాదనలు పంపించారు.

Updated Date - Jun 09 , 2026 | 01:23 AM