Share News

లక్ష్యం నెరవేరేనా?

ABN , Publish Date - May 21 , 2026 | 01:25 AM

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులకు ఆదాయ లక్ష్యాలు ఖరారయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మార్కెట్‌ యార్డుల వారీగా టార్గెట్లను ఉన్నతాధికారులు నిర్దేశించారు. ప్రస్తుత

లక్ష్యం నెరవేరేనా?

జగిత్యాల, మే 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులకు ఆదాయ లక్ష్యాలు ఖరారయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మార్కెట్‌ యార్డుల వారీగా టార్గెట్లను ఉన్నతాధికారులు నిర్దేశించారు. ప్రస్తుత ఏడాది మార్కెట్‌ యార్డులకు పంట ఉత్పత్తులు పెద్ద ఎత్తున వస్తాయన్న ఆంచనాతో లక్ష్యం మేర ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇలా...

జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో 13 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, ఒకటి ఉప మార్కెట్‌ కమిటీలున్నాయి. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, గొల్లపల్లి, ధర్మపురి, మల్యాల, కథలాపూర్‌, మేడిపల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, పెగడపల్లి, వెల్గటూరు, రాయికల్‌లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు పనిచేస్తున్నాయి. వీటితో పాటు జిల్లాలో వెల్గటూరు మండలం చెప్యాల్‌లో ఉప మార్కెట్‌ కమిటీ పనిచేస్తోంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో రైతులకు, వ్యాపారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి సేవలు అందిస్తున్నందుకు ప్రకటిత వ్యవసాయ ఉత్పత్తులపై ఒక శాతం మార్కెట్‌ ఫీజును కొనుగోలుదారుల నుంచి వసూలు చేస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో 29,550 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల 23 గోదాములు ఏర్పాటు చేశారు. నాబార్డు కింద జిల్లాలోని పలు ప్రాంతాల్లో 52,500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల 14 అధునాతన గోదాములు నిర్మించి రైతులకు సేవలు అందిస్తున్నారు. జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, గొల్లపల్లి మార్కెట్‌ యార్డులలో జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈ-నామ్‌) విధానాన్ని అమలు చేస్తున్నారు.

నాలుగేళ్లలో మార్కెట్‌ ఆదాయం ఇలా...

జిల్లాలోని 13 వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో గత నాలుగేళ్లలో లక్ష్యం మేరకు ఆదాయాన్ని సాధించారు. 2020-21 సంవత్సరమునకు జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలలో కలిపి రూ. 2722.53 లక్షల మార్కెట్‌ ఫీజును వసూలు చేశారు. అదే విధంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో కలిపి రూ.1,574.74 లక్షల లక్ష్యాన్ని నిర్దేశించగా వంద శాతం ఫీజును చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ ఫీజు లక్ష్యం రూ. 2,152 లక్షలు కాగా రూ. 2,622 లక్షలు వసూలు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 25.94 కోట్లు లక్ష్యం కాగా రూ. 29.70 కోట్లు ఆదాయాన్ని సాధించారు. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరానికి 21.29 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 26.54 కోట్ల ఆదాయం సాధించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,583.91 లక్షల ఫీజు వసూలు లక్ష్యంగా నిర్ణయించారు. ఏ యేటికి ఆ యేడు మార్కెట్‌ యార్డుల వారీగా ఉన్నతాధికారులు నిర్దేశించిన టార్గెట్లకు మించి ఆదాయం రాబట్టారు. జిల్లాలో గల మార్కెట్‌ కమిటీల్లో మెజార్టీ కమిటీలు ఆదాయ లక్ష్యాన్ని అధిగమిస్తున్నాయి.

మార్కెట్‌ యార్డులకు రైతులు తీసుకొని వచ్చిన పంట ఉత్పత్తులను వ్యాపారులు కొనుగోలు చేస్తారు. వ్యాపారుల చేపట్టే లావాదేవీల ఆదారంగా మార్కెట్‌ యార్డుకు సెస్‌ చెల్లిస్తారు. మార్కెట్‌ ఫీజు చెల్లింపు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోంది. దీంతో పాటు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే రైస్‌ మిల్లులు, ఆయిల్‌ మిల్లులు, జిన్నింగ్‌ మిల్లులు, ఇతర ఏజన్సీలు సైతం సెస్‌ చెల్లించాల్సి ఉంటుంది. పంట ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేటప్పుడు చెక్‌పోస్టుల వద్ద సంబంధిత యార్డులకు సెస్‌ చెల్లించాలి. ప్రభుత్వం తరఫున ఎఫ్‌సీఐ, సీసీఐ, ఐకేపీ, సింగిల్‌ విండోలు, మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌ తదితర సంస్థలు యార్డులలో పంట ఉత్పత్తులకు మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తుంటాయి. సంబందిత సంస్థలు సైతం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు సెస్‌ చెల్లించాల్సి ఉంటుంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిదిలో జరుపుతున్న పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలపై ఫీజును వసూలు చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నాయి.

లక్ష్యం రూ. 1583.91 లక్షలు

జిల్లాలో వివిధ ప్రాంతాల్లో గల 13 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,583.91 లక్షల ఆదాయ లక్ష్యాన్ని ఉన్నతాధికారులు నిర్దేశించారు. ఇందులో జగిత్యాల మార్కెట్‌ యార్డుకు రూ. 290.48 లక్షలు, మెట్‌పల్లి రూ. 164.52 లక్షలు, కోరుట్ల రూ. 125.31 లక్షలు, గొల్లపల్లి రూ. 97.31 లక్షలు, ధర్మపురి రూ. 175.44 లక్షల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ధేశించారు. అదేవిదంగా మల్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి రూ. 198.96 లక్షలు, కథలాపూర్‌ రూ. 94.64 లక్షలు, మేడిపల్లి రూ. 98.98 లక్షలు, మల్లాపూర్‌ రూ. 72.86 లక్షలు, ఇబ్రహీంపట్నం రూ. 42.77 లక్షలు, పెగడపల్లి రూ. 61.97 లక్షలు, వెల్గటూరు రూ. 101.58 లక్షలు, రాయికల్‌ రూ. 59.09 లక్షల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలో అత్యధికంగా జగిత్యాల యార్డుకు రూ. 290.48 లక్షలు నిర్ధేశించగా, అత్యల్పంగా ఇబ్రహీంపట్నం యార్డుకు రూ. 42.77 లక్షల ఆదాయాన్ని టార్గెట్‌గా నిర్ణయించారు.

జగిత్యాల మామిడికి ప్రసిద్ధి

జిల్లాలోని మార్కెట్‌ యార్డులలో వివిధ పంట ఉత్పత్తులు విక్రయానికి వస్తుంటాయి. ఇందులో జగిత్యాల, కోరుట్లలో మామిడి, మెట్‌పల్లి మార్కెట్‌ యార్డు పసుపునకు గుర్తింపు కలిగింది. అదే విధంగా వెల్గటూరులో పత్తి, ఇబ్రహీంపట్నంలో కందులు, వివిధ మార్కెట్‌ యార్డులలో వరి ధాన్యం, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తులు విక్రయానికి వస్తుంటాయి. వీటి క్రయవిక్రయాల ద్వారా మార్కెట్‌ కమిటీలు ఆదాయాన్ని సాధిస్తుంటాయి.

లక్ష్యం మేరకు ఆదాయం సాధిస్తాం

- ప్రకాశ్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, జగిత్యాల

జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆదాయం సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యం మేరకు ఆదాయం సాధించడానికి కృషి చేస్తాం. మార్కట్‌ కమిటీల్లో రైతులకు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.

Updated Date - May 21 , 2026 | 01:25 AM