బియ్యం ధరలకు కళ్లెం పడేనా..?
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:49 AM
వర్షాభావ పరిస్థితులు ఇప్పటికే వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయగా, దాని ప్రభావం సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పడుతోంది.
జగిత్యాల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితులు ఇప్పటికే వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయగా, దాని ప్రభావం సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పడుతోంది. వానాకాలంలో ఇప్పటికే వరి సాగు విస్తీర్ణం తగ్గగా యాసంగిలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఈ నేపధ్యంలో కొన్ని రోజులుగా బియ్యం ధరలకు రెక్కలు వస్తున్నాయి. రెండు నెలల క్రితం ఉన్న ధరలకు ప్రస్తుతం విక్రయిస్తున్న ధరలకు పొంతన లేకుండా పోయింది. రోజురోజుకూ ధరలు ఆకాశన్నంటుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బియ్యం కొని తినలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వం ధరల కట్టడికి చర్యలు ప్రారంభించింది. అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. పౌర సరఫరాల శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.
ఫఅధికారుల స్పెషల్ డ్రైవ్
ప్రభుత్వమే రకాలను బట్టి బియ్యం ధరలను నిర్ణయించింది. బీపీటీకి క్వింటల్‌కు రూ.6.400, హెచ్‌ఎంటీ, సోనారకం బియ్యానికి రూ.7.400, జై శ్రీరామ్ రూ.7.900గా ధర నిర్ణయించింది. రంగంలోకి దిగిన జిల్లా సివిల్ సప్లయిస్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మిల్లర్లు, హోల్‌సెల్ వ్యాపారులతో సమావేశం నిర్వహిస్తూ నిబంధనలను వివరిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను వివరిస్తూ పోస్టర్ సైతం అందజేశారు. ధరల పట్టికను షాపుల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు.
ఫ10 వేలకు చేరిన జైశ్రీరామ్...
గతంలో ఎన్నడూ లేనివిధంగా బియ్యం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. రెండు నెలల క్రితం క్వింటాల్‌కు రూ.6000 నుంచి 6,500 లోపే ఉన్న జైశ్రీరామ్ బియ్యం ప్రస్తుతం రూ.10 వేలకు అమ్ముతున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. బియం ధరల పెరుగుదలకు ప్రభుత్వం కళ్లెం వేసే చర్యలు చేపట్టినప్పటికీ వ్యాపారుల వాదన అందుకు విరుద్ధంగా ఉంది. రైస్ మిల్లర్లు, హోల్‌సేల్‌గా అధిక ధరలకు విక్రయిస్తుంటే తాము మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎలా విక్రయించాలని ప్రశ్నిస్తున్నారు. మిల్లుల వద్ద నిర్ణీత ధరలకు బియ్యం లభించనప్పుడు చిల్లర వ్యాపారులు తక్కువ ధరలకు విక్రయించడం ఎలా సాధ్యపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో సీరియస్‌గా ముందుకు సాగుతోంది. నిర్ణయించిన ధర కంటే అధిక రేటుకు విక్రయిస్తే నిత్యావసర వస్తువుల చట్టం-1955 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.
అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
- జితేందర్ రెడ్డి, జిల్లా సివిల్ సప్లయిస్ శాఖ అధికారి
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రైస్‌మిల్లర్లు, రైస్ డిపోలు, దుకాణాదారులకు తెలియజేస్తున్నాం. రైస్‌మిల్లర్లు, హోల్‌సెల్ వ్యాపారులలో అవగాహన కల్పిస్తున్నాము. నిర్దేశించిన ధరల ప్రకారమే బియ్యం విక్రయించాలని ఆదేశించాం. ధరల పట్టికతో కూడిన పోస్టర్లను సైతం అందజేశాం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
క్వింటాలు బియ్యం ధరలు (రూపాయల్లో)
---------------------------------------------------------------------------------
రకం - రెండు నెలల క్రితం ప్రస్తుతం (పాతవి) - ప్రస్తుతం (కొత్తవి)
---------------------------------------------------------------------------------
బీపీటీ - 4,100 - 8,000, - 7,000
సోనా, హెచ్‌ఎంటీ - 5,500 - 8,000 - 7,000
జై శ్రీరాం - 6,200 - 10,000 - 8,000
---------------------------------------------------------------------------------
ప్రభుత్వం నిర్ణయించిన ధరలు...
---------------------------------------------------------------------------------
రకం - ధర (కిలో)
---------------------------------------------------------------------------------
బీపీటీ, కేఎన్‌ఎం, ఆర్‌ఎస్‌ఆర్ - రూ.66
తెలంగాణ సోనా - రూ.74
హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ - రూ.79
---------------------------------------------------------------------------------