ధాన్యం రవాణా వేగవంతమయ్యేనా..?
ABN , Publish Date - May 02 , 2026 | 01:13 AM
యాసంగి ధాన్యం దిగుబడి మొదలైనా మిల్లర్లు ముందుకు రాకపోవడం, రవాణాకు కొత్త విధానం ముందుకు రావడంతో ధాన్యం సేకరణలో ఆటంకాలుగా మారాయి. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించడంలో కొత్తగా అమలులోకి తెచ్చిన జీపీఎస్ విధానంతో పాటు ఆటో మెయిల్ ట్యాగ్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ధాన్యం రవాణా వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.
- యాసంగిలో జీపీఎస్.. ఆటో మెయిల్‌ట్యాగ్‌కు బ్రేక్
- పాత పద్ధతిలోనే మిల్లులకు ధాన్యం తరలింపు
- కొత్త విధానంలో మిల్లర్ పాయింట్ ముందే తెలియక రవాణాకు ఇబ్బంది
- జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద పేరుకుపోతున్న ధాన్యం
- జిల్లాలో ధాన్యం దిగుబడి అంచనా 4.56 లక్షల మెట్రిక్ టన్నులు
- పౌర సరఫరాల కొనుగోలు లక్ష్యం 3 లక్షల మెట్రిక్ టన్నులు
- ఏప్రిల్ వరకు మార్కెట్లోకి 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా
- పౌరసరఫరాల కొనుగోలు లక్ష్యం 1.25 లక్షల మెట్రిక్ టన్నులు
- ఇప్పటివరకు కొనుగోలు చేసింది 29,571 మెట్రిక్ టన్నులు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
యాసంగి ధాన్యం దిగుబడి మొదలైనా మిల్లర్లు ముందుకు రాకపోవడం, రవాణాకు కొత్త విధానం ముందుకు రావడంతో ధాన్యం సేకరణలో ఆటంకాలుగా మారాయి. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించడంలో కొత్తగా అమలులోకి తెచ్చిన జీపీఎస్ విధానంతో పాటు ఆటో మెయిల్ ట్యాగ్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ధాన్యం రవాణా వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. నూతనంగా తెచ్చిన ఆటో మెయిల్ ట్యాగ్ విధానానికి అధికారులు స్వస్తి చెప్పడంతో రవాణాకు లారీ యజమానులు ముందుకు వస్తున్నారు. గతంలో నిర్వహించిన పాత విధానంలోనే ధాన్యం కేటాయింపులు, మిల్లర్లకు పంపిస్తున్నారు. దీంతో జిల్లాలో ధాన్యం తూకం వేయడం మిల్లులకు వెంటవెంటనే పంపించే వీలు కలగడంతో ధాన్యం కొనుగోళ్లు గాడిన పడుతాయని భావిస్తున్నారు.
కొత్త విధానంతో కొనుగోలు జాప్యం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం 236 కేంద్రాలను ప్రారంభించే లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు 228 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇందులో ఐకేపీ ద్వారా 130 కేంద్రాలు, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 90 కేంద్రాలు, మెప్మా ద్వారా 7 కేంద్రాలు, డీసీఎంఎస్ ద్వారా ఒక కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ధాన్యం కుప్పలు పోసుకున్నా తూకం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానంతో పాటు ఆటో మెయిల్ ట్యాగ్ కొత్తగా అమల్లోకి తేవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ విధానం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రంలో లోడు చేసిన ధాన్యం ఏ మిల్లుకు వెళ్లాలో ముందే తెలియకపోవడంతో ట్రక్కు షీట్ నమోదైన తర్వాత కేటాయించిన మిల్లు తెలుస్తుంది. దీంతో కొనుగోలు కేంద్రానికి మిల్లుకు మధ్య దూరభారం పెరగడం లారీల కేటాయింపులకు కాంట్రాక్టరుకు సమస్యగా మారింది. ఈక్రమంలోనే ధాన్యం రవాణాలో తీవ్ర జాప్యం కావడంతోపాటు కొనుగోలు కేంద్రాల్లోనే తూకం వేసిన ధాన్యం పేరుకుపోయింది. మరోవైపు లారీ లేదా డీసీఎం ధాన్యం లోడు అయ్యాకే వెళ్లాల్సిన స్థలం తెలవడం ద్వారా వాహనాల డ్రైవర్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఎదురయ్యాయి. దీంతో కాంట్రాక్టర్లు లారీలు పంపకపోవడంతో కొత్త విధానంతో కొనుగోలులో ఏర్పడిన జాప్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం జీపీఎస్, ఆటో మెయిల్ ట్యాగ్ విధానాన్ని తొలగించి పాత పద్ధతిలోనే రవాణా ఏర్పాట్లు చేపట్టింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం మాత్రం రైతులకు ఉపయోగకరంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. గతంలో మాన్యువల్ విధానం వల్ల కేంద్రాల వద్ద నిర్వాహకులు ధాన్యం తూకం వేసి, ట్రక్‌షీట్ రూపొందించి ప్రభుత్వం కేటాయించిన మిల్లులకు పంపేవారు. ధాన్యం దిగుమతి చేసుకొని మిల్లర్లు సంతకం చేసి ఇచ్చిన తర్వాత నిర్వాహకులు ట్యాబ్‌లో ఆన్‌లైన్ చేసి బిల్లు చేసేవారు. ఎవరైనా ధాన్యం శుభ్రం చేయకుండా పంపితే, తూకం వేసిన తర్వాత రెండు మూడు రోజులకు బస్తాలు మిల్లులకు పంపినప్పుడు మిల్లు యజమానులు తూకం తక్కువ ఉందని, తాలు ఉందని కొర్రీలు పెడితే రైతులు వెళ్లి మాట్లాడుకొని క్వింటాలకు కిలో నుంచి రెండు కిలోల వరకు కోత పెట్టడానికి అంగీకరించేవారు. తర్వాత ట్యాబ్‌లో నమోదు చేసి బిల్లు చేసేవారు. కొత్త విధానం వల్ల ఎలాంటి కొర్రీలు పెట్టకుండా దిగుమతి చేసుకునే పరిస్థితి మొదలైంది. దీంతో రవాణా కాంట్రాక్టర్లు పెట్టిన అభ్యంతరాలకు మిల్లర్లు సైతం తోడు కావడంతో కొనుగోలులో జాప్యం జరిగినట్లుగా తెలుస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు పేరుకుపోతుండడంతో రైతుల్లో ఆందోళన మొదలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త విధానాన్ని ఉపసంహరించుకొంది.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు
ఎండలు ఒకవైపు మండిపోతుండగా రెక్కల కష్టాన్ని నమ్ముకొని పండించిన ధాన్యాన్ని అకాల వర్షం బారిన పడకుండా కాపాడుకుంటున్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకోవడానికి పడిగాపులు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగిలో 1.83 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 1,79,650 ఎకరాల్లో దొడ్డు రకం, 7,539 ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశారు. దీని ద్వారా 4 లక్షల 56 వేల 664 మెట్రిక్‌లో ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో దొడ్డు రకం 4 లక్షల 49 వేల 125 మెట్రిక్ టన్నులు, సన్న రకం 7,539మెట్రిక్ టన్నులు వస్తుందని. ఇందులో పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో 2.97 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 7539 మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఉంది. మార్చి, ఏప్రిల్ మాసాల్లో మార్కెట్లోకి 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, అందులో పౌరసరఫరాల శాఖ 1.20లక్షల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఉంది. పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకు 29 వేల 571 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. అందులో మిల్లులకు 18,516 మెట్రిక్ టన్నులు పంపించింది. పౌరసరఫరాల శాఖ లక్ష్యం ప్రకారం మే మాసం వరకు 2.75 లక్షల మెట్రిక్ టన్నులు, జూన్ మాసంలో 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు నత్తనడక సాగుతుండడంతో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో యాసంగి సాగు లెక్కలు
మండలం వరి మొత్తం
గంభీరావుపేట 18,900 19,420
ఇల్లంతకుంట 24,500 26,521
ముస్తాబాద్ 22,200 23,555
సిరిసిల్ల 4,700 4,895
తంగళ్లపల్లి 20,200 21,241
వీర్నపల్లి 7,500 7,500
ఎల్లారెడ్డిపేట 18,000 18,255
బోయినపల్లి 13,600 15,545
చందుర్తి 15,500 15,879
కోనరావుపేట 18,100 18,680
రుద్రంగి 4,550 5,682
వేములవాడ 5,300 5,522
వేములవాడ రూరల్ 10,800 11,136
-----------------------------------------------------------------------------------------------------
మొత్తం 1,83,850 1,93,837
-----------------------------------------------------------------------------------------------------