Share News

ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తా

ABN , Publish Date - Jan 04 , 2026 | 01:34 AM

ఆంజన్న ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.

ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తా

- అంజన్న దయతోనే పునర్జన్మ

-ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

-కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు

-వసతిగదులు, దీక్షావిరమణ మండపానికి భూమిపూజ

ఆంజన్న ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల వసతి సముదాయ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా పవన్‌ కల్యాణ్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని ఓ రిసార్టులో జనసేన శ్రేణులతో పవన్‌ సమావేశం నిర్వహించారు. పవన్‌ పర్యటన సందర్భంగా పోలీసులు కొండగట్టు, నాచుపల్లి ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అభివాదం..సన్మానాలతో పవన్‌ పర్యటన

- తరలివచ్చిన అభిమానులు

జగిత్యాల, జనవరి3 (ఆంధ్రజ్యోతి): సెంటిమెంటు.. పూజలు.. అభివాదాలు.. సన్మానాలతో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ శనివారం జిల్లా పర్యటన కొనసాగింది. హైదరాబాద్‌ నుంచి చాపర్‌ ద్వారా కొడిమ్యాల మండలం జేఎన్‌టీయూ వద్ద గల హెలీప్యాడ్‌కు పవన్‌ కల్యాణ్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్‌ ద్వారా కొండగట్టు దేవస్థానానికి వచ్చారు. దారిపొడవుగా నిలిచి ఉన్న అభిమానులు, కార్యకర్తలకు పవన్‌ అభివాదం చేస్తూ వెళ్లారు. దేవస్థానానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో పలు పూజలను నిర్వహించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి వారి దర్శనం అనంతరం పవన్‌కల్యాణ్‌ను అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కొండగట్టుపైకి తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు, భక్తులనుద్ధేశించి కొద్దిసేపు ప్రసంగించారు. అనంతరం కొండగట్టు శివారులోని బృందావన్‌ ఫ్యామిలీ రిసార్ట్స్‌కు వెళ్లారు. దారి మధ్యలో జేఎన్‌టీయూ వద్ద కొద్దిసేపు ఆగి అభిమానులకు, జనసేన కార్యకర్తలకు అభివాదం చేశారు. బృందావన్‌ ఫ్యామిలీ రిసార్ట్స్‌లో అభిమానులు, కార్యకర్తలతో ఫొటోలు దిగారు. కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. రిసార్ట్‌లోని సమావేశ మందిరంలో రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలుపొందిన 148 మంది సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లను అభినందించారు. జన సేన కార్యకర్తలతో కొద్దిసేపు భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాలు, ఇతర అంశాలపై జనసేన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అక్కడి నుంచి కాన్వాయ్‌ ద్వారా జేఎన్‌టీయూ వద్ద హెలీప్యాడ్‌ ప్రాంతానికి వెళ్లి చాపర్‌ ద్వారా తిరుగు ప్రయాణం అయ్యారు. జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. జైజై జనసేన అంటూ అభిమానులు నినాదాలు చేశారు.

Updated Date - Jan 04 , 2026 | 01:34 AM