ఎర్లీబర్డ్ స్కీమ్‌పై విస్తృత ప్రచారం
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:49 PM
నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలలో 2026-27 ఆర్థిక సంవత్సరపు ఆస్తిపన్నులను ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రిబేట్‌ను ఇస్తూ ప్రభుత్వం ప్రకటించిన ఎర్లీబర్డ్ స్కీమ్‌పై కార్పొరేషన్ విస్తృత ప్రచారం చేస్తోంది.
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలలో 2026-27 ఆర్థిక సంవత్సరపు ఆస్తిపన్నులను ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రిబేట్‌ను ఇస్తూ ప్రభుత్వం ప్రకటించిన ఎర్లీబర్డ్ స్కీమ్‌పై కార్పొరేషన్ విస్తృత ప్రచారం చేస్తోంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు యేడాది ఆస్తి పన్నులను చెల్లించిన వారికి ఐదు శాతం రిబేట్ ఇస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ నగరంలోని ముఖ్య కూడళ్లతోపాటు పలు చోట్ల హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మైకుల ద్వారా ప్రచారంచేస్తుండడంతో నగర ప్రజల నుంచి ఈ పథకానికి రోజురోజు ఆదరణ పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీమ్ బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ పథకాన్ని కేవలం జీహెచ్‌ఎంసీకే పరిమితం చేయడంతో ఎర్లీబర్డ్ స్కీమ్ కూడా ఈయేడు వర్తింపజేస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వడ్డీ మాఫీ ఇవ్వక పోవడంతో ఆస్తిపన్నుల వసూళ్లు గత ఏడాదితో పోల్చితే తగ్గాయి. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎర్లీబర్డ్ స్కీమ్‌ను వర్తింపజేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించి పెద్ద మొత్తంలో ఆస్తిపన్నులను వసూలు చేయాలని ఆదేశించింది. దీంతో ఏప్రిల్ 2 నుంచి నగరపాలక సంస్థ అధికారులు ఓవైపు ప్రచారం చేయడంతోపాటు మరోవైపు నగరపాలక సంస్థలోని రెవెన్యూ విభాగంలో ఆస్తిపన్నుల స్వీకరణ కౌంటర్లను పెంచి ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కౌంటర్లను సందర్శించారు. ప్రజల నుంచి పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని, పన్నుచెల్లించేందుకు వచ్చే ప్రజలు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, మహిళలు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా సీటింగ్, మంచినీటి సౌకర్యం, కూలర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎనిమిది ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఆస్తిపన్నులను స్వీకరిస్తున్నారు. మేయర్ శ్రీనివాస్, కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ప్రత్యేక కౌంటర్లను సందర్శించి పన్నులు చెల్లించేందుకు వచ్చిన పౌరులతో సౌకర్యాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రాయితీని సద్వినియోగం చేసుకొని ఆస్తిపన్నులను చెల్లించాలని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా విస్తృత ప్రచారం చేస్తున్నామని చెప్పారు. పన్ను చెల్లించేందుకు వచ్చే ప్రజలు కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా రద్దీని బట్టి అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, సాంకేతిక సమస్యలు ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు. వార్డు ఆఫీసర్లు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఇంటింటికి వెళ్ళి 5శాతం రాయితీపై వివరించి ఆస్తిపన్నులు వసూలయ్యేలా చూడాలని చెప్పారు. ఈనెల 30 వరకు ఐదు శాతం రిబేట్ ఉంటుందని, ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకొని నగర అభివృద్ధికి సహకరించాలని మేయర్ కోరారు.