నిధులు విడుదలైనా నిరసన ఎందుకు..?
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:33 AM
కెనాల్ నిర్మాణంలో భాగంగా రైతులకు పరిహారం చెల్లించడానికి నిధులు విడుదల అయినా నిరసన ఎందుకు తెలుపుతున్నారో అందరికి అర్థం అవుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, మార్చి 14(ఆంధ్రజ్యోతి) : కెనాల్ నిర్మాణంలో భాగంగా రైతులకు పరిహారం చెల్లించడానికి నిధులు విడుదల అయినా నిరసన ఎందుకు తెలుపుతున్నారో అందరికి అర్థం అవుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో సమస్యను రైతులు తన దృష్టికి తీసుకరావడంతో అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందని, ఇటీవలే రైతులతో కలిసి ఉపముఖ్యమంత్రికి వివరించడంతో వెంటనే నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇల్లంతకుంట మండల పరిధిలో కేవలం 10ఎకరాలకు పరిహారం ఇవ్వవలసి ఉందని అత్యధికంగా తంగళ్ళపల్లి మండలపరిధిలోనే వస్తుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఏనాడు పట్టించుకోని నాయకులు ఇప్పుడు రైతులను రెచ్చగొట్టుతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలపై ఉద్యమిస్తే తప్పులేదు కాని ప్రేరేపిత ఉద్యమాలను పట్టించుకోమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుమీద బీఆర్‌ఎస్ నాయకులు చేయని అక్రమం అంటూలేదన్నారు. బీఆర్‌ఎస్ నాయకుల అవినీతి తెలిసిన ప్రజలు వారిని మాటలను పట్టించుకోవడం లేదని, అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టవద్దని సూచించారు. రైతుల సమస్యల పరిఫ్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రైతులు ఇప్పటికైన వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పీసీసీ కోఆర్డీనేటర్ పాశం రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, అయిలయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, మాజీ ఫ్యాక్స్‌చైర్మన్ ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, నాయకులు కేతిరెడ్డి నవీన్‌రెడ్డి, ప్రసాద్, వెంకటరెడ్డి, నీలం అంజయ్య, నర్సింగం, శరత్‌రెడ్డిలతో పాటు నాయకులు పాల్గొన్నారు.