‘వీబీ-జీ రామ్‌జీ’ ఎందుకు వద్దు
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:44 AM
‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ-జీ రామ్‌జీ పథకం అద్భుతం... గ్రామానికి స్ధిర ఆస్తులను సృష్టించడంతోపాటు ప్రతి ఒక్కరికి కచ్చితంగా 125 రోజుల పని దొరుకుతుంది... వ్యవసాయ సీజనలో కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ పథకం ఉపశమనం కల్పించబోతుంది... గతంతో పోలిస్తే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.17 వేల కోట్లు కేటాయించబోతోంది.
- రాషా్ట్రనికి అదనంగా రూ. 340 కోట్లు వస్తాయి
- గ్రామాలకు ఆస్తులను సృష్టించే పథకం
- రైతులకు ఉపశమనం.. కూలీలకు 125 రోజుల పని
- నేరుగా కూలీల ఖాతాలోనే డబ్బులు జమ
- ప్రజలకు మంచి జరుగుతుంటే కాంగ్రెస్‌కు ఎందుకింత అక్కసు
- కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్
కరీంనగర్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ-జీ రామ్‌జీ పథకం అద్భుతం... గ్రామానికి స్ధిర ఆస్తులను సృష్టించడంతోపాటు ప్రతి ఒక్కరికి కచ్చితంగా 125 రోజుల పని దొరుకుతుంది... వ్యవసాయ సీజనలో కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ పథకం ఉపశమనం కల్పించబోతుంది... గతంతో పోలిస్తే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.17 వేల కోట్లు కేటాయించబోతోంది. తెలంగాణ రాషా్ట్రనికి రూ.340 కోట్లు అదనంగా వస్తాయి..ఇంత గొప్ప పథకం ఎందుకు వద్దు... ఈ పథకాన్ని అడ్డుకోవాలని చూడటం కాంగ్రెస్ నీచ రాజకీయాలకు నిదర్శనం’ అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తీసేయడంపై కాంగ్రెస్ అవనసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ముందుగా ఈ పథకానికి మహాత్ముడి పేరు కాంగ్రెస్ పెట్టలేదని చెప్పారు. పాలకులు మారినపుడు పథకాల పేర్లు మారడం సహజమేనన్నారు. గతంలో వాల్మీకి, అంబేద్కర్ పేర్లతో వాజ్‌యేయి ప్రభుత్వం వాంబే స్కీం పేరుతో ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రవేశపెడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారి పేర్లను తొలగించి ఇందిరాగాంధీ ఆవాస్ యోజన పథకంగా మార్చిందని గుర్తు చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్. హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరుండగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా నామకరణం చేసిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. వీబీ జీ రామ్‌జీ పథకం అనేది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామానికి దీర్ఘకాలిక ఆస్తులు కూడబెట్టేందుకు ఉద్దేశించినదని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఏటా రూ.86 వేల కోట్లను ఖర్చుచేసినా గ్రామానికి ఆస్తులు పెద్దగా పెరుగలేదని, తవ్విన గుంతలే తవ్వడం వంటి పనులే చేశారని విమర్శించారు. ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ నూతన చట్టబద్ధ ఉపాధి హామీ పథకం అమలు వల్ల ఏటా రూ. 1,51,282 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ పథకంలో కేంద్ర, రాషా్ట్రల భాగస్వామ్యం తప్పనిసరి అని, ఇందులో కేంద్రం వాటా 95,692 కోట్లు కాగా అన్ని రాషా్ట్రల వాటా 55,589 కోట్లు, గత ఏడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా ఈ ఏడాది 17 వేల కోట్లు అదనంగా కేంద్రం ఖర్చుచేయబోతుందన్నారు. ఈపథకం సమర్థవంతంగా అమలయ్యేందుకు పరిపాలనకు సంబంధించిన నిధులను 6 నుంచి 9శాతానికి పెంచామన్నారు. ఉపాధి పనుల ఎంపిక గ్రామసభల ద్వారా జరుగుతుందని, ఆ పనుల ద్వారా గ్రామానికి ఆస్తులను నిర్మించాలన్నదే ప్రజలు నిర్ణయిస్తారని, కేంద్ర పభుత్వం గైడ్‌గా వ్యవహరిస్తోందే తప్ప అజమాయిషీ చేయదని అన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే కాంగ్రెసకు అక్కసు ఎందుక ని ప్రశ్నించారు. ఉపాధిహామీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ నాయకులు నీచ రాజకీయడం సిగ్గుచేటని విమర్శించారు. గాంధీ పేరును వాడుకున్నారే తప్ప మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని పాతరేసి ఆయన ఆత్మను క్షోభకు గురిచేసిన ఘాంఢీ వారసులు కాంగ్రెస్ నేతలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన గాంధీ ఆశయాలను నీరుగార్చారని, కాంగ్రెస్ అంటే జవహర్‌లాల్‌నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళే కదా... మహాత్మాగాంధీ నిజంగా బతికుంటే మిమ్మల్ని మీ ఘాంఢీ కుటంబ వారసులను చూసి పైనున్న గాంధీ ఆత్మక్షోభిస్తుందని,పథకాల మార్పుపై కాంగ్రెస్ చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అని బండి సంజయ్ ప్రశ్నించారు. శ్రీరాముడి పేరును బతికినంత కాలం పెట్టుకుంటాం.. మాకార్యకర్తలు ఎక్కడికి పోయినా జై శ్రీరాం అంటారు.. మా ఊపిరి ఆగిపోయే క్షణంలో కూడా భారతమాతాకీ జై... జైశ్రీరాం అంటాం... నక్సల్స్ కాల్చి చంపుతుంటే కూడా భారతమాతాకీ జై.. జై శ్రీరాం అని నినదించిన చరిత్ర బీజేపీది.. రాముడి బాటలో నడుస్తాం.. రాముడి ఆలయాలను నిర్మిస్తాం.. మీకు నొప్పి ఏంటని సంజయ్ ప్రశ్నించారు. దేశంలో అనేక పథకాలు కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నడుసున్నవే కదా... ఈ పథకానికి రాషా్ట్రల భాగస్వామ్యం కల్పిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఉపాధి కూలీల వేతనాలే సకాలంలో ఇవ్వలేని కాంగ్రెస్ నేతలా మాట్లాడేది అంటూ సంజయ్ ఎద్దేవా చేశారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ విషయంలో కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరించారని, కుటుంబ ఆస్తులను పంచినట్లుగా కొడుకు, కూతురు, అల్లుడి కోసం జిల్లాను ఏర్పాటు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదే తీరులో చేస్తే ఇబ్బందులు తప్పవని, తక్షణమే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, ప్రజాభిప్రాయ సేకరణ జరుపాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ స్టాండ్ క్లియర్‌గా ఉందని, మతపరమైన రిజర్వేషన్లను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను తొలగించి బీసీలకు రిజర్వేషన్లను అమలుచేసి తీరుతామని సంజయ్ అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ, మాజీ ఎంపీపీ వాసాల రమేశ, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
ఫ కరీంనగర్‌పై కాషాయ జెండా ఎగురవేస్తాం
కరీంనగర్ టౌన: స్మార్ట్‌సిటీ, స్వచ్ఛభారత, అమృత సహా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే కరీంనగర్‌లో అభివృద్ధి జరిగిందని, త్వరలో జరిగే కార్పొరేషన ఎన్నికల్లో కరీంనగర్‌పై కాషాయ జెండా ఎగురవేయడం తథ్యమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరిగిందని, జరుగుతోందని గుర్తించిన ప్రజలు ఈసారి బీజేపీకి ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేషనకు అర్బన ఇనఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి 50 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, వీటిలో కేంద్ర వాటా 40 కోట్లు అని తెలిపారు. వీటితో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామన్నారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంజయ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో కాషాయ కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అవినీతి ఆరోపణలు, రౌడీషీట్లు లేని వారినే బీజేపీలో చేర్చుకుంటామని సంజయ్ స్పష్టం చేశారు.