Share News

సుడా పీఠం ఎవరికో..!

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:38 AM

దీపావళిలోగానే నామినేటెడ్‌ పదవులు భర్తీచేసి ద్వితీయశ్రేణి నేతలు, పార్టీశ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తున్నది. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, కొన్ని మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలపై దృష్టిసా రించాల్సి ఉన్నందున ఆలోగానే నామినేటెడ్‌ పదవుల వ్యవహారాన్ని పూర్తిచేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.

 సుడా పీఠం ఎవరికో..!

- పోటీపడుతున్న నరేంద్రులు

- రేసులో మరో ముగ్గురు నేతలు

- దీపావళిలోగా నామినేటెడ్‌ పదవుల భర్తీకి అవకాశం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

దీపావళిలోగానే నామినేటెడ్‌ పదవులు భర్తీచేసి ద్వితీయశ్రేణి నేతలు, పార్టీశ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తున్నది. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, కొన్ని మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలపై దృష్టిసా రించాల్సి ఉన్నందున ఆలోగానే నామినేటెడ్‌ పదవుల వ్యవహారాన్ని పూర్తిచేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కార్పొరేషన్లు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీలను కలుపుకొని 37 సంస్థలకు నియమించిన చైర్మన్ల పదవీకాలం ముగిసి నాలుగు మాసాలు పూర్తవుతున్నది. వీటిలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ (సుడా) కూడా ఒకటి. సుడా చైర్మన్‌గా కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డిని మంత్రి శ్రీధర్‌బాబు సిఫారసు మేరకు నియమించారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం పూర్తయిపోగా తను కూడా రెండవ సారి చైర్మన్‌ పదవి ఆశిస్తున్నారు. ఆయనతోపాటు కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీచేసి పరాజయం పాలైన ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ వి.నరేందర్‌రెడ్డి కూడా పదవి ఆశిస్తున్నారు. వీరిద్దరే కాకుండా జిల్లా కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసిన కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, తాళ్లపల్లి శ్రీని వాస్‌గౌడ్‌, రాచకొండ చక్రధర్‌ కూడా రేసులో ఉన్నారు. వీరిలో మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి మంత్రి శ్రీధర్‌బాబు అండదండలు సంపూర్ణంగా ఉన్నాయి. ఆల్ఫోర్స్‌ నరేందర్‌ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ చైర్మన్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారంలో ఉన్నది. అంతేకాకుండా గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు అభ్యర్థిగా రంగంలో నిలిచి డబ్బు ఖర్చుచేసి ఉన్నందున తనకు ప్రస్తుతం సుడా చైర్మన్‌ పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న కార్యకర్తలుగా, నాయకులుగా తమ సేవలను గుర్తించాలని పద్మాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, రాచకొండ చక్రధర్‌ కోరుతున్నారు. అయితే వీరంతా మంత్రి పొన్నం ప్రభాకర్‌ అండదండలపైనే ఆశలు పెట్టుకున్నారు. మంత్రి మాత్రం ఇప్పటికీ ఎవరికీ స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తున్నది. అయితే ఎవరికివారు మాత్రం మంత్రి సపోర్టు తమకే ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మంత్రులను కలిసిన ఆల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి మరో అడుగు ముందు కేసి టీపీసీసీ చైర్మన్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ మద్దతు కూడగట్టుకున్నారని పార్టీ అభ్యర్థిగా పట్టభ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచి నష్టపోయినందున సుడా చైర్మన్‌ పదవిని తప్పక ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు, తనే సుడా చైర్మన్‌ పీఠంపై కూర్చోనున్నానని కొద్దిరోజు లుగా జిల్లా కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. తొలిసారి సుడా చైర్మన్‌గా కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి నియమితులైన సందర్భంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆయనకు పదవిని ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా పదవి స్వీకరించవద్దని నేరుగా కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికే సూచించినట్లు ప్రచారం జరిగింది. అయినా ఆయన పదవి చేపట్టడమే కాకుం డా పూర్తి టర్మ్‌కూడా పదవిలో ఉన్నారు. ఈ సమయంలో పలుమార్లు ఆయన మంత్రి ప్రభాకర్‌ను కలిసి తనపట్ల ఉన్న వ్యతిరేకత తొలగించుకొని సానుకూలంగా మార్చుకోవడానికి పలు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే కొంత మెత్తపడిన మంత్రి ప్రభాకర్‌ పాత చైర్మన్లకు ఎవరికీ మళ్లీ పదవులు రెన్యువల్‌ చేసినా నీకు పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించనని పాతవారికి రెన్యూవల్స్‌ ఇవ్వని సందర్భంలో కొత్తవారిని సూచిస్తానని అన్నట్లు ప్రచారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పాత వారికి పదవి మళ్లీ ఇచ్చే విషయంలో కొంత డైలమాలో ఉన్నా కొందరికైనా ఇవ్వక తప్పని పరిస్థితులు ఎదురవుతు న్నాయని అలాంటి సమయంలో కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పదవి ఇవ్వడం విషయాన్ని శ్రీధర్‌బాబు పట్టుబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇద్దరు నరేంద్రుల మధ్యనే సుడా చైర్మన్‌ పదవి పోటీ ఉందని మిగతా వారు రేసులో ఉన్నా ఆశలు నెరవేరేది అంతంత మాత్ర మేనని పార్టీలో అనుకుంటున్నారు. అయితే కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి రెండవసారి పదవి ఇవ్వడం, ఆల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డికి ఒకసారి ఎమ్మెల్సీగా పోటీచేసే అవకాశం ఇచ్చి మళ్లీ ఇప్పుడు పదవి ఇవ్వడం కాకుండా మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న తమ అభ్యర్థిత్వాలను పరిగణలోకి తీసుకో వాలని అప్పుడే పార్టీశ్రేణులకు పార్టీపై నమ్మకం కలుగుతుందని ఇతర ఆశావహులు అంటు న్నట్లు పేర్కొంటున్నారు. మంత్రులు ఎవరికి అండగా నిలిచినా ముఖ్య మంత్రి ఎవరికి పదవి కట్టబెడతారో, ఎవరిని సుడా పీఠం ఎక్కిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:39 AM