Share News

ధాన్యం కొనేవారెవరు..?

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:16 AM

ఎల్‌నినో ఉన్నా వానాకాలం సీజన్‌ అనుకూలించి అత్యధిక వరి దిగుబడి వస్తున్నదన్న రైతుల ఆనందం కల్లాల్లోకి ధాన్యం వచ్చే సరికి చెదిరిపోతున్నది. ముందస్తుగా నాట్లు వేసిన రైతులు 15 రోజుల క్రితమే కోతలు పూర్తి చేయగా ప్రైవేట్‌ వ్యాపారులు సన్న వరి రకాలకు క్వింటాల్‌కు 3,200 వరకు, జైశ్రీరామ్‌ రకాన్ని 3,800 నుంచి 4,000 రూపాయల వరకు, దొడ్డు రకాలను 2,800 రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు.

ధాన్యం కొనేవారెవరు..?

- మిల్లర్లకు ప్రభుత్వానికి కుదరని ఒప్పందం

- బియ్యం తీసుకున్నాక.. కొత్త వడ్లు ఇవ్వండంటున్న మిల్లర్లు

- కొనుగోలు కేంద్రాలకు మిల్లులు కేటాయించని అధికారులు

- ఆందోళనలో రైతులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఎల్‌నినో ఉన్నా వానాకాలం సీజన్‌ అనుకూలించి అత్యధిక వరి దిగుబడి వస్తున్నదన్న రైతుల ఆనందం కల్లాల్లోకి ధాన్యం వచ్చే సరికి చెదిరిపోతున్నది. ముందస్తుగా నాట్లు వేసిన రైతులు 15 రోజుల క్రితమే కోతలు పూర్తి చేయగా ప్రైవేట్‌ వ్యాపారులు సన్న వరి రకాలకు క్వింటాల్‌కు 3,200 వరకు, జైశ్రీరామ్‌ రకాన్ని 3,800 నుంచి 4,000 రూపాయల వరకు, దొడ్డు రకాలను 2,800 రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు. ధాన్యం ఎండకున్నా.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువే చెల్లించి హైదరాబాద్‌, మిర్యాలగూడ, స్థానిక వ్యాపారులు కొనుగోలు చేయడంతో జిల్లా రైతులు తమ పంట పండిందని ఆదాయంపై ఆశలు పెంచుకున్నారు. యాసంగి సీజన్‌లో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో వానాకాలం పంటకు డిమాండ్‌ వచ్చింది.

ఫ చేతులెత్తేస్తున్న మిల్లర్లు

కస్టమ్‌ మిల్లింగ్‌లో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం, కేసులు, నమోదు చేసి ఫెనాల్టీలు వడ్డించడంతో సగానికిపైగా మిల్లులు డిఫాల్ట్‌ లిస్టులో పడ్డాయి. గత యాసంగిలో కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం ప్రభుత్వం ఇచ్చిన వడ్లను బియ్యంగా మార్చినా ఎఫ్‌సీఐ స్థలం లేదనఇ, కోటాకు మించి తీసుకోలేవనిని మిల్లర్ల నుంచి తీసుకోవడం లేదు. దీంతో పాత ధాన్యమే చెడిపోతుందని కొత్త ధాన్యం తీసుకొని నిల్వ చేసుకోలేమని రైస్‌మిల్లర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ సీజన్‌లో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసినా తీసుకునే వారు లేని పరిస్థితి ఉత్పన్నమైంది. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేది రాష్ట్ర ప్రభుత్వమైతే బియ్యం తీసుకునేది కేంద్ర సంస్థ అయిన ఎఫ్‌సీఐ. దీంతో ఎఫ్‌సీఐ కేంద్రం విధించిన కోటా మేరకే మిల్లర్ల నుంచి బియ్యం తీసుకుంటామని, బాయిల్డ్‌ బియ్యాన్ని అంగీకరించబోమని చెప్పడంతో మిల్లర్లు ధాన్యం తీసుకోలేమని చెబుతున్నారు. గత యాసంగిలో సేకరించిన ధాన్యంలో 70 శాతం ఇంకా తమ మిల్లుల్లోనే ఉన్నదని, ఆ ధాన్యం తాలూకు బియ్యం మొత్తం తీసుకున్న తర్వాత ఈ సీజన్‌ ధాన్యం తమ మిల్లులకు పంపించడని మిల్లర్లు అంటున్నారు.

ఫ ధర తగ్గిస్తున్న వ్యాపారులు

కొందరు వ్యాపారులు రైతుల వద్ద నుంచి నేరుగా ఎక్కువ ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తున్నా చాలా మంది ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా చేసుకొని ధరకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 15 రోజులు గడిస్తే వరి కోతలు ముమ్మరమై ధాన్యం ఎక్కడ నిల్వ ఉంచుకోవాలో తెలియని పరిస్థితుల్లో తక్కువ ధరకే రైతులు అమ్ముకుంటారనే అభిప్రాయంతో వ్యాపారులు కొనుగోలు చేయకుండా వేచిచూస్తున్నారని తెలిసింది. జిల్లాలో గత వానాకాలంలో 2,65,734 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వం క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్‌ ప్రకటించిన ఏడు సన్న వరి రకాలను 1,79,671 ఎకరాల్లో, ఏ గ్రేడ్‌ రకాలను 53,426 ఎకరాల్లో, కామన్‌ వెరైటీలను 32,637 ఎకరాల్లో సాగు చేశారు. ఏడు రకాల సన్న ధాన్యం 4,15,128 మెట్రిక్‌ టన్నులు, ఏ గ్రేడ్‌ రకం ధాన్యం 1,30,894 మెట్రిక్‌ టన్నులు, దొడ్డు రకాలు 79,961 మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. జిల్లాలో 6,25,983 మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడి వస్తుందని అంచనా వేయగా ఇంచుమించు అంతే దిగుబడి వస్తున్నది. ఈ ధాన్యంలో సగానికిపైగా ప్రైవేట్‌ వ్యాపారులే కొనుగోలు చేస్తారని, సన్నరకాలకు డిమాండ్‌ ఉండడంతో బోనస్‌ధర కంటే ఎక్కువే చెల్లించి కొనుగోలు చేసే అవకాశాలున్నందున ప్రైవేట్‌ వ్యాపారులకే విక్రయిస్తారని అధికారులు భావించారు. ఈ మేరకు 1.8 లక్షల టన్నుల సన్న రకాలు, 70 వేల టన్నుల దొడ్డు రకాలు మార్కెట్‌కు వస్తాయని, వాటి కొనుగోలు కోసం 318 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించి, ఆ మిల్లుల ద్వారా కస్టమ్‌ మిల్లింగ్‌ చేయించి ఎఫ్‌సీఐకి బియ్యాన్ని ఇస్తారు. ప్రస్తుతం ఆ మిల్లింగ్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారు కావడంతో కొనుగోలు కేంద్రాలను నోటిఫై చేసినా.. అక్కడక్కడ ఎమ్మెల్యేలు వాటిని ప్రారంభించినా.. మిల్లుల కేటాయింపు జరుగక పోవడంతో కొనుగోళ్లు సాగడం లేదు. వారం, పది రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో జిల్లాలోని తారు రోడ్లలో, ఇతర ఖాళీ ప్రదేశాల్లో రైతులు ధాన్యం ఆరబోసుకుంటున్నారు.

ఫ జిల్లాలో 220 రైస్‌మిల్లులు

జిల్లాలో 220 రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటిలో 143 రా రైస్‌ మిల్లులు కాగా, 77 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు ఉన్నాయి. రా రైస్‌ మిల్లుల్లో 70 నుంచి 75 వరకు డిఫాల్ట్‌ మిల్లులుగా మారాయి. మరో 25 మిల్లులు యాజమాన్య సమస్యల కారణంగా మూతపడ్డాయి. గత యాసంగిలో 77 బాయిల్డ్‌ మిల్లులకు 23 రా రైస్‌ మిల్లులకు మాత్రమే కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం వడ్లు కేటాయించారు. ఆ ధాన్యం పక్కదారి పట్టించడం, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో ప్రస్తుతం 33 మిల్లులకు మాత్రమే కస్టమ్‌ మిల్లింగ్‌ చేసే అర్హత ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీటిలోనూ గత సీజన్‌కు సంబంధించిన 70 శాతం ధాన్యం నిల్వ ఉండడంతో వాటిని మిల్లింగ్‌ చేసి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇస్తామని వాటిని తీసుకున్న తర్వాతే తమకు ధాన్యం కేటాయించాలని మిల్లర్లు కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా చూసేందుకు మిల్లర్లపై పాత ధాన్యం ఉన్నా కొత్త ధాన్యం తీసుకోవలసిందేనని ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కొనుగోళ్లు ప్రారంభమైనా 33 మిల్లులకే అర్హత ఉండడంతో వంద మిల్లులకు కేటాయించాల్సిన ధాన్యాన్ని 33 మిల్లుల్లో ఎక్కడ నిల్వ చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

-------------------------------

Updated Date - Nov 12 , 2026 | 01:16 AM