Share News

అదృష్టం వరించేదెవరినో..?

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:37 AM

మున్సిపాలిటీల్లో ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెర పడనుంది. ఓటర్లు ఇచ్చిన తీర్పును బ్యాలెట్‌ బాక్సులు విప్పనున్నాయి.

అదృష్టం వరించేదెవరినో..?

జగిత్యాల, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల్లో ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెర పడనుంది. ఓటర్లు ఇచ్చిన తీర్పును బ్యాలెట్‌ బాక్సులు విప్పనున్నాయి. గెలుపే ధ్యేయంగా అనేక అస్త్రాలు ప్రయోగించిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. అధికారులు కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి ప్రధాన పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉండటంతో ముందు జాగ్రత్తగా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో గల 136 వార్డు కౌన్సిలర్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపులో 46 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డులో మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపును పూర్తి చేయనున్నారు. ఇందులో జగిత్యాల మున్సిపాలిటీలో 17 టేబుల్స్‌, రాయికల్‌లో 4 టేబుల్స్‌, కోరుట్లలో 11 టేబుల్స్‌, మెట్‌పల్లిలో 9 టేబుల్స్‌, ధర్మపురి మున్సిపల్స్‌లో 5 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు.

ఫ230 మంది సిబ్బంది

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించడానికి 230 మంది కౌంటింగ్‌ అధికారులను నియమించారు. ఇందులో 46 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 138 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లను నియమించారు. ధర్మపురి మున్సిపల్‌లో 25 మంది, జగిత్యాలలో 85 మంది, రాయికల్‌లో 20 మంది, కోరుట్లలో 55 మంది, మెట్‌పల్లిలో 45 మంది కౌంటింగ్‌ అధికారులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందులో ధర్మపురి మున్సిపల్‌లో 5 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 15 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, జగిత్యాల మున్సిపల్‌లో 17 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 51 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, రాయికల్‌ మున్సిపల్‌లో 4 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 12 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, కోరుట్ల మున్సిపల్‌లో 11 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 33 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మెట్‌పల్లి మున్సిపల్‌లో 9 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 27 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు విధులు నిర్వహించనున్నారు.

ఫఒక్కో టేబుల్‌కు ఒక్కో మైక్రో అబ్జర్వర్‌..

జిల్లాలో మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక్కో టేబుల్‌కు ఒక్కో మైక్రో అబ్జర్వర్‌ను నియమించారు. 46 టేబుల్స్‌కు గాను 46 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించి నిరంతర పరిశీలన చేయనున్నారు. ఇందులో మెట్‌పల్లిలో 9 మంది మైక్రో అబ్జర్వర్లు, ధర్మపురిలో 5, రాయికల్‌లో 4, జగిత్యాలలో 17, కోరుట్లలో 11 మంది మైక్రో అబ్జర్వర్లకు బాధ్యతలు అప్పగించారు.

ఫమూడు రౌండ్లలో లెక్కింపు...

ప్రతీ మున్సిపాలిటీలో 3 రౌండ్‌లలో ఓట్ల లెక్కింపును పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఒక్కో రౌండ్‌కు గంటన్నర నుంచి రెండు గంటల వరకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. ముందుగా బ్యాలెట్‌ బాక్సుల్లోని బ్యాలెట్‌ను ఒక్క చోట ఉంచుతారు. 25 బ్యాలెట్‌లకు ఒక బెండిల్స్‌ చొప్పున తయారు చేస్తారు. తర్వాత లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కో రౌండ్‌లో 17 వార్డుల ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో రిటర్నింగ్‌ అధికారికి మూడు వార్డులను కేటాయించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఫజిల్లాలో 1,62,445 మంది ఓటు..

జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలో కలిపి 2,31,627 మంది ఓటర్లు ఉండగా 1,62,445 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని ధర్మపురి మున్సిపాలిటీలో 14,035 మందికి గాను 10,562 మంది ఓటు వేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో 94,800 మందికి గాను 65,985 మంది ఓటు వేశారు. కోరుట్ల మున్సిపాలిటీలో 63,507 మందికి గాను 44,115 మంది ఓటు వేశారు. మెట్‌పల్లి మున్సిపాలిటీలో 46,201 మందికి గాను 31,975 మంది ఓటు వేశారు. రాయికల్‌ మున్సిపాలిటీలో 13,084 మందికి గాను 9,808 మంది ఓటు వేశారు.

ఫఎన్నికల బరిలో 635 మంది..

జిల్లాలోని 136 వార్డుల్లో 635 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందులో ధర్మపురి మున్సిపాలిటీల్లోని 15వార్డుల్లో 52మంది అభ్యర్థులు, జగిత్యాలలోని 50 వార్డుల్లో 254 మంది అభ్యర్థులు, కోరుట్లలో 33 వార్డుల్లో 150 మంది అభ్యర్థులు, మెట్‌పల్లిలోని 26 వార్డుల్లో 150 మంది అభ్యర్థులు, రాయికల్‌లోని 12 వార్డుల్లో 49 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో కలిపి అమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఒక్కరు, బహుజన్‌ సమాజ్‌ పార్టీ అభ్యర్థి ఒక్కరు, బీజేపీ అభ్యర్థులు 125 మంది, సీపీఐ (ఎం) అభ్యర్థులు 2, కాంగ్రెస్‌ అభ్యర్థులు 135 మంది, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులు 9 మంది, సీపీఐ అభ్యర్థులు 3 మంది, జనసేన అభ్యర్థులు 24 మంది, ఇతర రిజిస్టర్డ్‌ పొలిటికల్‌ పార్టీల అభ్యర్థులు 12 మంది, స్వతంత్రులు 184 మంది మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ పడ్డారు.

ఫజగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్‌ కళాశాలలో కౌంటింగ్‌

జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీల్లోని బ్యాలెట్‌ బాక్సులను జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కౌంటింగ్‌ కేంద్రానికి తరలించారు. జగిత్యాల-ధర్మపురి ప్రధాన రహదారిపై ఉన్న ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల భవనాన్ని కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఫభారీ బందోబస్తు...

జగిత్యాల జిల్లాలో కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎస్పీ అశోక్‌ కుమార్‌, డీఎస్పీ రఘు చందర్‌ల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మూడంచెల పోలీస్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వ్యక్తిని తనిఖీ చేసి ఫొటో గుర్తింపు కార్డు ఉంటేనే లోనికి పంపిస్తారు. కౌంటింగ్‌ హాల్‌లోకి మొబైల్‌ ఫోన్లకు అనుమతి లేదు. అధికారులతో పాటు అభ్యర్థులు కూడా గుర్తింపు కార్డులు తనిఖీ చేసి లోనికి పంపిస్తారు.

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

-సత్యప్రసాద్‌, కలెక్టర్‌

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశాము. జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఐదు మున్సిపాలిటీలకు చెందిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇందుకు అవసరమైన కౌంటింగ్‌ ఉద్యోగులను నియామకం చేసి శిక్షణను అందించాం. ఒక్కో వార్డుకు ఒక్కో టేబుల్‌ను ఏర్పాటు చేశాం. ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహిస్తాం.

Updated Date - Feb 13 , 2026 | 12:37 AM