విజేతలెవరో..?
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:41 AM
గెలుపు కోసం పడిన కష్టాలు... ఓటరు నాడి పట్టుకోవడానికి, అభ్యర్థుల ఎంపికకు చేసిన సర్వేలు... సొంత పార్టీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా రంగంలో దిగిన రెబల్ అభ్యర్థులు.. నాయకులు, బరిలో నువ్వా.. నేనా..? అన్నట్లుగా ఓటు కోసం లక్షలు రూపాయల ఖర్చు.. వీటిలో ఏవి ఫలితాన్ని ఇస్తాయో... ఏ కారణాలు నిండా ముంచనున్నాయో తేలాల్సి ఉంది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
గెలుపు కోసం పడిన కష్టాలు... ఓటరు నాడి పట్టుకోవడానికి, అభ్యర్థుల ఎంపికకు చేసిన సర్వేలు... సొంత పార్టీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా రంగంలో దిగిన రెబల్ అభ్యర్థులు.. నాయకులు, బరిలో నువ్వా.. నేనా..? అన్నట్లుగా ఓటు కోసం లక్షలు రూపాయల ఖర్చు.. వీటిలో ఏవి ఫలితాన్ని ఇస్తాయో... ఏ కారణాలు నిండా ముంచనున్నాయో తేలాల్సి ఉంది. ఏ సర్వేలు నిజం కాబోతున్నాయో విజయానికి ఏలాంటి అంశాలు ప్రభావితం చేశాయి. ఓటరన్న ఎవరికి జై కొట్టారు అనేది శుక్రవారం ఉదయం కొద్దిగంటల్లోనే తేలిపోతుంది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగిన 67 వార్డుల్లో విజేతలు ఎవరు.. పరాజితులు ఎవరో తేల్చడానికి యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సిరిసిల్ల, వేములవాడల్లో సినారె కళామందిరం భవనల్లో లెక్కింపునకు గురువారం జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. మాక్ కౌంటింగ్ పరిశీలించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపునకు అవసరమయ్యే 250 మంది సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. రెండు మున్సిపాలిటీల్లో 1,22,836 ఓట్లకు గాను 95,443 ఓట్లు పోలయ్యాయి. సిరిసిల్లలో 39 వార్డుల్లో 170 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 81,959 మంది ఓటర్లు ఉండగా, 63,562 మంది ఓట్లు వేశారు. వేములవాడలో 28 వార్డుల్లో 113 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 40,877 మంది ఓటర్లు ఉండగా 31,881 మంది ఓట్లు వేశారు. సిరిసిల్లలో 39, వేములవాడలో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద లెక్కింపునకు నలుగురు సిబ్బంది చొప్పున 250 మందిని నియమించారు. లెక్కింపుపై శిక్షణ కూడా అందించారు. రెండు రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. మొదటి రౌండ్ వెయ్యి ఓట్లతో పూర్తి చేస్తారు. రెండో రౌండ్ మిగిలిన ఓట్లను లెక్కిస్తారు. ముందుగా బూత్‌లవారీగా ఓట్లను లెక్కిస్తారు. అన్నీ కట్టలు ఒక చోటకు చేర్చి గుర్తుల వారీగా విడదీస్తారు. 8 గంటలకు లెక్కింపు ప్రారంభించి 11 గంటలలోపే పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
సిరిసిల్ల, వేములవాడ కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్పీ మహేష్ బీ గీతే పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించనున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్‌ను అమలులో ఉంచారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలను జారీ చేశారు. ఇప్పటికే స్ర్టాంగ్ రూంలో పోలీస్ రక్షణలో బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచారు. శుక్రవారం లెక్కింపు ప్రశాంతంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు.
సిరిసిల్లలో కారు.. వేములవాడలో హస్తం..
సిరిసిల్లలో కారు, వేములవాడలో హస్తం పార్టీల వారు పురాధీశులుగా నిలుస్తారని భావిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 67 వార్డులు ఉండగా, 283 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో బీఆర్‌ఎస్ 117 మంది, బీజేపీ 117 మంది, కాంగ్రెస్ 117 మంది, సీపీఐ ముగ్గురు, సీపీఎం ముగ్గురు, ఏఐఎఫ్‌బీ నలుగురు, జేఎస్‌పీ 12 మంది, స్వతంత్రులు 55 మంది పోటీలో ఉన్నారు. సిరిసిల్లలో 39 వార్డుల్లో 170 మంది బరిలో ఉండగా బీఆర్‌ఎస్ 39 మంది, బీజేపీ 39 మంది, కాంగ్రెస్ 39 మంది, సీపీఎం ముగ్గురు, ఏఐఎఫ్‌బీ ఇద్దరు, జేఎస్‌పీ 7 మంది, 36 మంది స్వతంత్రులు ఉన్నారు. వేములవాడలో 28 వార్డులో 113 మంది బరిలో ఉండగా బీఆర్‌ఎస్ 28 మంది, బీజేపీ 28 మంది, కాంగ్రెస్ 28 మంది, సీపీఐ ముగ్గురు, ఏఐఎఫ్‌బీ ఒకరు, జేఎస్‌పీ ఐదుగురు, స్వతంత్రులు 19 మంది ఉన్నారు. అభ్యరులు ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నారు. భారీ నజరానాలను అందించారు. లక్షలను కుమ్మరించారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్, వేములవాడలో కాంగ్రెస్ చైర్‌పర్సన్ స్థానాలను దక్కించుకునే అవకాశాలున్నాయి. ఎవరి ప్రచారం ఏలా ఉన్నా కొద్దిగంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం మాత్రం తేలిపోనుంది.
ఓట్ల చీలిక ఎవరికి నష్టం జరిగేనో...
సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో 283 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సిరిసిల్లలో 39 వార్డుల్లో 170 మంది, వేములవాడలో 28 వార్డుల్లో 113మంది పోటీ పడ్డారు. వీరిలో స్వతంత్రులుగా, రెబెల్స్ అభ్యర్థులుగా పోటీ పడ్డారు. స్వతంత్రులుగా పోటీపడ్డ అభ్యర్థులు ఎవరి ఓట్లలో చీలిక తెస్తారోననే ఆసక్తి పెరిగింది. రెండు మున్సిపాలిటీల్లో పోలైన ఓట్లపై అభ్యర్థులు మాత్రం లెక్కలు కడుతున్నారు. రెండు మున్సిపాలిటీల్లో 1,22,836 మంది ఓటర్లు ఉండగా 95,443 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 45,267 మంది, మహిళలు 50,161 మంది ఉన్నారు. వీరి ఓటు ఏటు వేశారనే దానిపై అభ్యర్థులు సర్వేలు చేసి లెక్కలు కడుతూ మునిగిపోయారు.
కౌంటింగ్ ప్రక్రియలో ర్యాండమైజేషన్ పూర్తి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ నేతృత్వంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ర్యాండమైజెషన్ ప్రక్రియను జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పూర్తిచేశారు. కార్యక్రమంలో డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఈడీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.