Share News

కో ఆప్షన్‌ పదవులు దక్కేదెవరికో..?

ABN , Publish Date - Feb 27 , 2026 | 01:01 AM

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరడంతో కో-ఆప్షన్‌ పదవులపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

కో ఆప్షన్‌ పదవులు దక్కేదెవరికో..?

జగిత్యాల, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరడంతో కో-ఆప్షన్‌ పదవులపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని, ఎన్నికల సమయంలో కష్టపడిన మైనారిటీలకు కో-ఆప్షన్‌ పదవులు ఇస్తామని అధికార, విపక్ష పార్టీలు బుజ్జగింపులు చేశాయి. ఐదు మున్సిపాలిటీలకు గాను రాయికల్‌ మినహా నాలుగు మున్సిపాలిటీల్లో అధికార పార్టీ వారే పాగా వేసింది. రాయికల్‌ మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్‌ఎస్‌ దక్కించుకుంది.

ఫఐదు మున్సిపాలిటీల్లో బలాబలాలు..

జగిత్యాల మున్సిపల్‌లో 50 వార్డు కౌన్సిలర్‌ స్థానాలుండగా కాంగ్రెస్‌ 23, బీజేపీ 6, బీఆర్‌ఎస్‌ 4, ఎంఐఎం 2, స్వతంత్రులు 15 మంది విజయం సాధించారు. మెట్‌పల్లిలో 26 మంది కౌన్సిలర్లకు గానూ 10 బీజేపీ, 6 బీఆర్‌ఎస్‌, 6 కాంగ్రెస్‌, 4 స్వతంత్రులు గెలుపొందారు. రాయికల్‌ మున్సిపల్‌లో 12 స్థానాలకు గానూ 3 కాంగ్రెస్‌, 5 బీజేపీ, 3 బీఆర్‌ఎస్‌, 1 స్వతంత్రులు గెలుపొందారు. దర్మపురిలో 15 స్థానాలకు గానూ 15 స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకొని క్లీన్‌ స్వీప్‌ చేసింది. కోరుట్లలో 33 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 18, బీఆర్‌ఎస్‌ 8, బీజేపీ 6, స్వతంత్రులు 1 కైవసం చేసుకున్నారు.

ఫకౌన్సిలర్లతో సమాన హోదా..

ప్రధానంగా మున్సిపాలిటీ పరిధిలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సమాజంలో తగిన ప్రాతినిథ్యం లేని మైనారిటీలకు మున్సిపాలిటీల్లో భాగస్వామ్యం చేసేందుకు ఈ పదవులను కట్టబెడుతారు. కో-ఆప్షన్‌ సభ్యులు కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్‌ సమావేశాలకు హాజరవుతారు. వీరి ఎంపికకు మున్సిపాలిటీ పాలకవర్గం కొలువు దీరిన, తొలి సమావేశం నిర్వహించిన 45 రోజుల్లో నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పదవులు ఆశించిన పలువురు ఆశావహులు ప్రజాప్రతినిధులు, చైర్మన్ల చుట్టూ తిరుగుతున్నారు. కాగా జనరల్‌ కోటాకు చెందిన కో-ఆప్షన్‌ పదవులకు మాత్రం గట్టి పోటీ ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఫమున్సిపల్‌ చట్టం 2019 ప్రకారం..

తెలంగాణ మున్సిపల్‌ చట్టం 2019 ప్రకారం కో-ఆప్షన్‌ సభ్యులను నియమిస్తారు. వీరు కౌన్సిలర్లతో సమాన హోదాను కలిగియుంటారు. గౌరవ వేతనంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో మాత్రం వీరికి ఓటు హక్కు ఉండదు. కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు 45 రోజుల్లోపు మున్సిపల్‌ కమిషనర్‌లు ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. మైనారిటీ కోటాలో పోటీ పడే వారు తమ కుల దృవీకరణ పత్రం జతచేస్తే మున్సిపల్‌ కమిషనర్‌ పరిశీలిస్తారు. ఎక్కువ మంది పోటీలో ఉంటే కౌన్సిలర్లతో ఓటింగ్‌ నిర్వహించాలనే నిబంధన ఉంది. మున్సిపాలిటీ పాలకవర్గం ఉన్నంత వరకు వీరు పదవుల్లో కొనసాగుతారు. వరసగా మూడు సమావేశాలకు హాజరుకాకపోతే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది.

ఫసభ్యుల సంఖ్యకు అనుగుణంగా అవకాశం...

మున్సిపల్‌ చట్టం ప్రకారం ప్రతి మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్ల సంఖ్యకు అనుగుణంగా కో-ఆప్షన్‌ సభ్యులను నియమించుకునే అవకాశం ఉంది. మున్సిపాలిటీలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నవారికి మాత్రమే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మైనారిటీలు (ఒక పురుషులు, ఒక మహిళ), క్రిస్టియన్‌ మైనారిటీ, జనరల్‌, అనుభవం ఉన్న మాజీ కౌన్సిలర్ల కేటగిరీల నుంచి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రతి మున్సిపాలిటీలో ఒక్కో కేటగిరి నుంచి పదుల సంఖ్యలో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

ఫనేతల చుట్టూ ప్రదక్షిణలు..

మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్‌ పదవులను ఆశిస్తున్న వ్యక్తులు ఆయా పార్టీలకు చెందిన నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతలను కలుస్తూ కో ఆప్షన్‌ పదవిని తనకు కేటాయించాలని కోరుతున్నారు. దీనికి తోడు ఇటీవల బాధ్యతలను చేపట్టిన మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను కలిసి అవకాశం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్లతో ముందస్తుగా మంతనాలు జరుపుతూ ఏకగ్రీవం కాకుండా ఒక వేళ ఓటింగ్‌ జరిగితే మద్దతు పలకాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.

Updated Date - Feb 27 , 2026 | 01:01 AM