మక్కలు కొనేదెవరు?
ABN , Publish Date - Mar 26 , 2026 | 02:04 AM
ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత మొక్కజొన్న రెండో ప్రధాన పంటగా సాగవుతోంది. మెట్ట ప్రాంతాలు, బోరులు, బావుల కింద మొక్కజొన్న పంటను సాగు చేసి రైతులు యాసంగి సీజనలో ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఈ సీజనలో ఉమ్మడిజిల్లా పరిధిలో 95,901 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు కనిష్ఠంగా 30 క్వింటాళ్ల చొప్పున మూడు టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. ఈ సీజనలో ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు లక్షల టన్నుల మొక్కజొన్న దిగుబడి వస్తుందని అంచనా వేశారు.
- ఉమ్మడి జిల్లాకు చొప్పదండి కొనుగోలు కేంద్రమే దిక్కు
- అదీ ప్రారంభం కానీ వైనం
- 95,901 ఎకరాల్లో మొక్కజొన్న సాగు
- మూడు లక్షల టన్నుల దిగుబడి అంచనా
- అమ్ముకునే వీలు లేక రైతుల ఆందోళన
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత మొక్కజొన్న రెండో ప్రధాన పంటగా సాగవుతోంది. మెట్ట ప్రాంతాలు, బోరులు, బావుల కింద మొక్కజొన్న పంటను సాగు చేసి రైతులు యాసంగి సీజనలో ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఈ సీజనలో ఉమ్మడిజిల్లా పరిధిలో 95,901 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు కనిష్ఠంగా 30 క్వింటాళ్ల చొప్పున మూడు టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. ఈ సీజనలో ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు లక్షల టన్నుల మొక్కజొన్న దిగుబడి వస్తుందని అంచనా వేశారు. మొక్కజొన్న కోతలు ప్రారంభించిన చోట వచ్చిన దిగుబడి పరిశీలించినా ఆ అంచనాలు మేరకు దిగుబడి వస్తున్నది. మూడు లక్షల టన్నుల దిగుబడి వస్తున్న జిల్లాలో రైతుకు మద్దతు ధర లభించేలా చూసేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేదు. దీంతో మద్దతు ధర కంటే క్వింటాల్‌కు నాలుగు వందల నుంచి 500 రూపాయల తక్కువ ధరకే రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
ఫ యాసంగిలో విస్తృతంగా సాగు
యాసంగి సీజనలో కరీంనగర్ జిల్లాలో 30,242, జగిత్యాల జిల్లాలో 42,500, పెద్దపల్లి జిల్లాలో 18,851, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,308 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. నాలుగు జిల్లాలలోనూ మొక్కజొన్న కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండగా మార్క్‌ఫెడ్ సంస్థ ఉమ్మడి జిల్లా పరిధిలోని చొప్పదండిలో మాత్రమే మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా భూపాలపల్లిలో ఆరు కొనుగోలు కేంద్రాలను, హన్మకొండ జిల్లాలో ఒక కొనుగోలు కేంద్రాన్ని, కరీంనగర్ జిల్లాలో ఒక్క కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మార్చి 24న మార్క్‌ఫెడ్ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని రైతులు వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్నకు మద్దతు ధర చెల్లించక పోవడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగగా మార్క్‌ఫెడ్ సంస్థ ఎట్టకేలకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దానిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోలేదు.
ఫ క్వింటాల్‌కు రూ. 2,400 మద్దతు ధర
ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాల్‌కు 2,400 రూపాయల మద్దతు ధరగా నిర్ణయించింది. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో 1900 నుంచి 2000 రూపాయల వరకు చెల్లించి మాత్రమే మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలుచేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సీజనలో మధ్యప్రదేశ, ఛత్తీస్‌గఢ్ జిల్లాలో మొక్కజొన్న పంట విస్తీర్ణం పెరిగి ఎక్కువ పంట రావడంతో అక్కడ రైతుల నుంచి తక్కువ ధరకే వ్యాపారులు మక్కలు కొనుగోలు చేస్తుండడంతో ఇక్కడ మద్దతు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా మొక్కజొన్నను పౌల్ర్టీ, పశువుల ఫీడ్ వ్యాపారులు, పౌల్ర్టీ సంస్థలు కొనుగోలు చేస్తాయి. గత సంవత్సరం కొనుగోలు చేసిన మొక్కజొన్న మార్క్‌ఫెడ్ గోదాముల్లో నిల్వ ఉందని, వాటిని అమ్మితేకానీ మళ్లీ కొని నిలువ చేసే అవకాశం లేనందు వల్ల మార్క్‌ఫెడ్ ఈసారి మొక్కజొన్నలను కొనుగోలు చేయడానికి కేంద్రాలు ఏర్పాటు చేయలేదని తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో రైతులు 720 కోట్ల రూపాయల విలువ చేసే మొక్కజొన్న దిగుబడి సాధించినా.. వాటిని అమ్ముకునే అవకాశం లేక ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఉమ్మడి జిల్లా పరిధిలో ఒక్కొక్క జిల్లాలో కనీసం ఒక్కో కొనుగోలు కేంద్రమైనా ప్రారంభించి వెంటనే మక్కలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.