ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ..
ABN , Publish Date - Oct 19 , 2026 | 01:25 AM
జిల్లావ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి పట్టణంలోని ప్రధాన కూడళ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. జగిత్యాల పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మినీ స్టేడియం, విద్యానగర్ రామాలయం, ధరూర్ క్యాంప్ రామాలయం మైదానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఘనంగా సద్దుల బతుకమ్మ
-వాడవాడలా ఆడిపాడిన మహిళలు..
-వాగులు, చెరువుల్లో నిమజ్జనం
జగిత్యాల టౌన్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి పట్టణంలోని ప్రధాన కూడళ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. జగిత్యాల పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మినీ స్టేడియం, విద్యానగర్ రామాలయం, ధరూర్ క్యాంప్ రామాలయం మైదానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం గొల్లపల్లి రోడ్డులోని మోతే వాగు, గోవిందుపల్లిలోని ధరూర్ వాగు, చింతకుంట చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. వేడుకల్లో భాగంగా మహిళలు పసుపు, కుంకుమలను వాయినాలుగా ఇచ్చిపుచ్చుకున్నారు. నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించి వేడుకల్లో పాల్గొన్నారు. కమిషనర్ సత్యప్రణవ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చింతకుంట వద్ద జరుగుతున్న బతుకమ్మ నిమజ్జన ఉత్సవాలను పరిశీలించారు. పట్టణ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో నిమజ్జన ప్రాంతాలతో పాటు పట్టణంలోని పలు చోట్ల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందంగా బతుకమ్మలను అలంకరించిన వారికి ఎస్పీ అశోక్ కుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు.