ఖాళీ స్థలాల్లో పన్ను వసూలేదీ...?
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:56 AM
జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలపై విధించే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్‌టీ) వసూళ్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పెద్దపల్లి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలపై విధించే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్‌టీ) వసూళ్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణాలు విస్తరిస్తున్న కొద్దీ వందల సంఖ్యలో ఖాళీ ప్లాట్లు వెలుస్తున్నా.. వాటిని గుర్తించి పన్ను పరిధిలోకి తీసుకురావడం, డిమాండ్ నోటీసులు జారీ చేయడం, బకాయిలను వసూలు చేయడంలో మున్సిపల్ రెవెన్యూ విభాగం పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని, సుల్తానాబాద్ పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. పట్టణాల్లో ప్రధాన రహదారులు, కొత్త కాల నీలు, శివారు ప్రాంతాల్లో నిర్మాణాలు జరగని ఖాళీ ప్లాట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే అన్ని ఖాళీ స్థలాలు వీఎల్‌టీ పరిధిలోకి వచ్చాయా? ఎన్ని అసెస్‌మెంట్లు ఉన్నాయి? ఎంత డిమాండ్ ఉంది? ఎంత వసూలైంది? ఎంత బకాయి ఉందనే వివరాలను మున్సిపాలిటీల వారీగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
మున్సిపాలిటీ యాక్ట్ 2019 ప్రకారం నిర్మాణానికి అనువైన, వ్యవసాయేతర ఖాళీ స్థలాలపై 0.5 శాతం వీఎల్‌టీ విధించే నిబంధన ఉంది. ఖాళీ స్థలానికి సంబంధించి నిర్మాణం లేదా రిజిస్ట్రేషన్ సమయంలో పన్ను విధించే అవకాశం చట్టంలో పేర్కొన్నారు.
ఫ చర్యలు చేపడితేనే ఆదాయం
ఖాళీ స్థలాలపై పన్ను వసూలు చేయాలంటే ముం దుగా వాటిని గుర్తించి అసెస్‌మెంట్ చేయాల్సి ఉం టుంది. అనంతరం యజమానులకు డిమాండ్ నోటీ సులు జారీ చేసి పన్ను వసూలు చేయాలి. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ఆస్తి వివరాలను మున్సిపల్ వ్యవస్థతో సమన్వయం చేయడం, ఖాళీ ప్లాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా వీఎల్‌టీ పరిధిని విస్తరించవచ్చు. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో వీఎల్‌టీకి ప్రత్యేక ఆన్‌లైన్ మాడ్యూల్ ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది వీఎల్‌టీ అసెస్‌మెంట్లు నమోదైనట్లు ప్రభుత్వ సాంకేతిక సంస్థ పేర్కొంది.
ఫ బకాయిలపై దృష్టి ఏదీ?
పట్టణాల్లో ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇచ్చి పన్ను వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో స్థలాలు గుర్తించడం, పాత అసెస్‌మెంట్లను నవీకరించడం, యజమానుల వివరాలను సరిచేయడం వంటి అంశాలు పూర్తిస్థాయిలో జరగడం లేదనే ఆరోప ణలు ఉన్నాయి. దీంతో మున్సిపాలిటీలకు రావాల్సిన ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది.
ఫ ప్రత్యేక డ్రైవ్ చేపడితే.
జిల్లాలోని నాలుగు పట్టణ ప్రాంతాల పరిధిలో ఖాళీ స్థలాల సమగ్ర సర్వే నిర్వహించి.. పాత, కొత్త ప్లాట్లను గుర్తించి వీఎల్‌టీ అసెస్‌మెంట్లు పూర్తి చేసి బకాయిల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ చేపడితే మున్సిపాలిటీల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రిజి స్ట్రేషన్, మున్సిపల్ రెవెన్యూ విభాగాల మధ్య సమన్వ యం పెంచితే పన్ను పరిధిలోకి రాని ఖాళీ స్థలాలను గుర్తించడం సులభమవుతుంది. జిల్లాలో మున్సిపాలిటీల వారీగా మొత్తం వీఎల్‌టీ అసెస్‌మెంట్లు, డిమాండ్, వసూళ్లు, బకాయిల అధికారిక గణాంకాలు బయటకు వస్తే ఖాళీ స్థలాల పన్ను వసూళ్లలో అసలు పరిస్థితి స్పష్టమయ్యే అవకాశం ఉంది.
ఫ అవసరం ఉన్న వారు మాత్రమే కడుతున్నారు
ఆకుల వెంకటేశ్ కమిషనర్ పెద్దపల్లి
పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో వీఎల్‌టీ పన్నులు ప్రత్యేకంగా వసూలు చేయడం లేదు. కొందరు ఎల్‌ఆర్‌ఎస్ కట్టి ఉన్నందును వీఎల్‌టీ చెల్లించడం లేదు. రిజిష్ట్రేషన్లలలో భాగంగా వీఎల్‌టీని చేరిస్తే అందరూ కడతారు. అవసరం ఉన్న వారు మాత్రమే వీఎల్‌టీ పన్ను చెల్లిస్తున్నారు. ఇది తప్పని సరి వసూలు చేయా లన్న నిబంధన పెట్టినా, లేక రిజిస్ట్రేషన్ సమయంలో ఈ అంశాన్ని లింక్ చేసినా అందరూ విధిగా చెల్లిస్తారు.
ఫ 2023 వరకు వీఎల్‌టీ వసూళ్లు
టి రమేష్ మున్సిపల్ కమిషనర్ సుల్తానాబాద్
వీఎల్‌టీ పన్నుల వసూళ్లు 2020 నుంచి 2023 వరకు జరిగాయి. అనంతరం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో వీఎల్‌టీ వసూళ్లు చేయడం లేదు. రిజిస్ట్రేషన్లకు కూడా ఎలాంటి లింకు లేదు. ఇటీ వల ఎల్‌ఆర్‌ఎస్ రావడంతో చాలా మంది ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకున్న వారు ఓపెన్ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.
ఫ నాలాతో ఓపన్ ల్యాండ్స్ రిజిష్ట్రేషన్స్
వీఎల్‌టీ పన్నులు లేకుండానే మున్సిపాలిటీలలోని ఓపెన్ ల్యాండ్స్ రిజిష్ట్రేషన్లు జరుగుతున్నాయి. కేవలం నాలా అధారంగా చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఆధికారులు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయడంలేదు. కేవలం ఎల్‌ఆర్‌ఎస్‌తోనూ, నాలాతోనూ చేస్తున్నారు. రెండు నెలల నుంచి ఎల్‌ఆర్‌ఎస్ కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.