Share News

చినుకు జాడేది..?

ABN , Publish Date - Jun 18 , 2026 | 01:25 AM

వర్షాకాలం ప్రారంభమై పదిహేడు రోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించక పోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. సాధారణంగా మృగశిర కార్తెతోనే వర్షాలు ప్రారంభమై ఖరీఫ్‌ సాగుకు ఊపందుకోవాల్సి ఉండగా, ఈ ఏడాది వర్షాలు ముఖం చాటేయడంతో సాగు పనులు ముందుకు కదలడం లేదు. జిల్లాలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 70 శాతం లోటు నమోదు కావడం రైతులను కలవరపెడుతోంది.

చినుకు జాడేది..?

- పదిహేడు రోజులుగా వర్షాల కోసం నిరీక్షణ

- సాధారణానికి 70 శాతం లోటు వర్షపాతం

- ముందుకు సాగని ఖరీఫ్‌ పనులు..

- ఆందోళనలో రైతులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

వర్షాకాలం ప్రారంభమై పదిహేడు రోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించక పోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. సాధారణంగా మృగశిర కార్తెతోనే వర్షాలు ప్రారంభమై ఖరీఫ్‌ సాగుకు ఊపందుకోవాల్సి ఉండగా, ఈ ఏడాది వర్షాలు ముఖం చాటేయడంతో సాగు పనులు ముందుకు కదలడం లేదు. జిల్లాలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 70 శాతం లోటు నమోదు కావడం రైతులను కలవరపెడుతోంది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం బుధవారం నాటికి జిల్లాలో సాధారణ వర్షపాతం 81.9 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, కేవలం 24.9 మిల్లీమీ టర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గత 17 రోజుల్లో ఐదు రోజులు మాత్రమే స్వల్ప వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవే శించినప్పటికీ జిల్లాకు పూర్తిస్థాయిలో విస్తరించకపో వడంతో వర్షాలు మందగించినట్లు అధికారులు చెబుతున్నారు.

ముందుకు కదలని సాగు..

ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 2,78,290 ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 2,15,500 ఎకరాల్లో వరి, 52,094ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నట్లు ప్రణాళిక రూపొందించారు. అయితే వర్షాభావం కారణంగా సాగు పనులు ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు. చెదురుమదురు వర్షాల నేప థ్యంలో కొందరు రైతులు పత్తి విత్తనాలు వేసినా అవి పూర్తిస్థాయిలో మొలకెత్తడం లేదు. మరి కొం దరు రైతులు దుక్కులు దున్ని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఎల్‌నినో ప్రభావమేనా..?

ఈసారి వర్షాల ఆలస్యానికి ఎల్‌నినో ప్రభావమే ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రభావం నెలాఖరు వరకు కొనసాగితే జిల్లాలో వరి సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటల సాగుపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ వర్షాలు కురుస్తాయనే ఆశతో పలువురు రైతులు వ్యవసాయ బావుల ఆధారంగా వరి నార్లు పోస్తున్నారు. జిల్లాలో వర్షాలు పడకపోయినా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసి ప్రాజెక్టు నిండితే వరి సాగుకు నీటి కొరత ఉండదని రైతులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత వాతా వరణ పరిస్థితుల నేపథ్యంలో వర్షాలపై స్పష్టత లేకపోవడం రైతుల్లో ఆందోళనను పెంచుతోంది.

నాలుగేళ్లతో పోలిస్తే..

గత నాలుగేళ్లలో జూన్‌ నెల వర్షపాతాన్ని పరిశీ లిస్తే ఈ ఏడాది పరిస్థితి ఆందోళనకరంగా కనిపి స్తోంది. 2022 జూన్‌లో 186.5 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదైంది. 2023లో 42.4 మిల్లీమీటర్ల వర్షపా తం కురిసి 70 శాతం లోటు నమోదైంది. 2024లో సాధారణ వర్షపాతం కంటే 19 శాతం అధికంగా 192.7మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 2025 లో 82.6 మిల్లీమీటర్లకుగాను 42 శాతం లోటు నమోదైంది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 24.9 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం.

ఆకాశం వైపు రైతుల చూపులు

వర్షాకాలం ప్రారంభమై రెండు వారాలకు పైగా గడిచినా చినుకు జాడ కనిపించకపోవడంతో రైతు లు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లోనైనా విస్తారంగా వర్షాలు కురి స్తేనే ఖరీఫ్‌ సాగు గాడిన పడే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా రైతాంగం వరుణుడి కరుణ కోసం నిరీక్షిస్తోంది.

జాడలేని వానలు... దంచి కొడుతున్న ఎండలు...

కళ్యాణ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): మృగశిర కార్తెలో విస్తారంగా వర్షాలు కురావాల్సి ఉండగా ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అత్యధికంగా 42.0డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం 40.8, సోమవారం 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉదయం 7గంటలకే ఎండ దంచికొడు తుంది. మధ్యాహ్నం వేళల్లో భానుడు ప్రతాపం చూపుతుండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 11గంటలకు వేడిగాలులు వీస్తున్నాయి. రాత్రి 8గంటలు దాటినా ఎండ వేడి తగ్గడం లేదు. వారం రోజులుగా ఎండలు పారిశ్రామిక ప్రాంతం లో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. నిత్యం రద్దీగా ఉండే వాణిజ్య, వ్యాపార కూడలి అయిన కళ్యాణ్‌నగర్‌, లక్ష్మీనగర్‌, శివాజీనగర్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో జనం లేక వెలవెలబోతున్నాయి. మధ్యాహ్నం 12గంటలు దాటితే రోడ్లపైకి జనం రావడం లేదు. ఓసీపీలలో సాధారణకంటే రెండు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఎండల ప్రతాపంతో గోదావరితోపాటు బావుల్లో, బోర్లలో నీటి మట్టం తగ్గుతుంది. ఇప్పటికే విస్తారంగా వర్షాలు పడాల్సి ఉండా వనరుడి జాడ లేకుండా పోయింది.

Updated Date - Jun 18 , 2026 | 01:25 AM