Share News

చేయూత ఏది?

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:49 AM

కొత్త పింఛన్ల దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పథకం కింద కొత్త పింఛన్లను ఇస్తామని గతంలో ప్రభుత్వం సంకేతాలు అందించింది. దీంతో నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు సంతోషించారు.

చేయూత ఏది?

- నిరాశలో కొత్త పింఛన దరఖాస్తుదారులు

- తెలంగాణ అవతరణ వేడుకల్లో ఊసెత్తని సర్కారు

- నాలుగేళ్లుగా ఎదురుచూపులు

- జిల్లాలో 2,19,480 మంది పింఛనదారులు

జగిత్యాల, జూన 12 (ఆంధ్రజ్యోతి): కొత్త పింఛన్ల దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పథకం కింద కొత్త పింఛన్లను ఇస్తామని గతంలో ప్రభుత్వం సంకేతాలు అందించింది. దీంతో నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు సంతోషించారు. కానీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున పింఛన్లకు సంబంధించి సర్కారు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరాశకు గురయ్యారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ప్రతినెల 2,19,480 మంది వివిధ రకాల పింఛన్లను తీసుకుంటున్నారు. గత బీఆర్‌ఎస్‌ సర్కారు 2022 ఆగస్టులో చివరిసారిగా పింఛన్లను మంజూరు చేసింది.

- లక్షకు పైగా దరఖాస్తులు...

పింఛన్ల కోసం పలువురు కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాల్లో దరఖాస్తులు అందించారు. ప్రజాపాలన కార్యక్రమాల్లో జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష వరకు దరఖాస్తులు వచ్చినట్లు అంచనా ఉంది. అర్హులైన లబ్ధిదారులు ప్రజావాణిలో, ఆనలైన ద్వారా దరఖాస్తు చేయడమే కాకుండా నేరుగా గ్రామపంచాయతీలు, మండల పరిషత కార్యాలయాల్లో అధికారులకు దరఖాస్తులు అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 1,15,000 మందికి పైగా వివిధ రకాల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అంచనా ఉంది.

- జూన 2న పింఛన్లు ఇస్తారని...

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. జిల్లాలో పలువురు దరఖాస్తుదారులు పలు రకాల ధ్రువపత్రాలను మీ సేవ కేంద్రాల ద్వారా తీసుకున్నారు. ప్రధానంగా భర్త మరణ ధ్రువీకరణ, వయస్సు నిర్ధారణ కోసం ఆధార్‌, సదరం క్యాంపుల్లో పొందిన దివ్యాంగుల ధ్రువీకరణ తదితర పత్రాలు తీసుకొని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పింఛన్ల కోసం ఎదురుచూసినా ఫలితం దక్కలేదు.

- వితంతువులకు వెంటనే...

వృద్ధాప్య పింఛన పొందే వ్యక్తి చనిపోతే మృతి భార్య జీవించి ఉంటే ఆమేకు వెంటనే వితంతు పింఛన మంజూరు చేస్తున్నారు. కానీ వయస్సు రీత్యా 65 ఏళ్లు దాటిన వారికి, సదరం క్యాంపు ద్వారా దివ్యాంగుల సర్టిఫికేట్‌ పొందిన వారికి, చిన్నవయస్సులో భర్త చనిపోయిన వారికి, ఒంటరి మహిళలు, బీడీ, గీతా, చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదు. సుమారు నాలుగేళ్లుగా పింఛన్ల కోసం కార్యాల యాల చుట్టూ దరఖాస్తుదారులు తిరుగుతున్నారు. అంతేకాకుండా ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో సైతం పింఛన్లు ఇప్పించాలంటూ అధికారులను, సర్పం చలను వేడుకుంటూ మళ్లీ దరఖాస్తులను అందజేశారు.

ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే..

- రఘువరన, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో వివిధ సందర్భంలో చేయూత పింఛన్ల కోసం పలువురు దరఖాస్తులు అందించారు. ప్రజాపాలన కార్యక్రమాల్లో, గ్రామ, వార్డు సభలో, ప్రజావాణి కార్యక్రమాల్లో కొత్త పింఛన్లు కోరుతూ దరఖాస్తులు వస్తున్నాయి. అయితే కొత్త పింఛన్ల మంజూరు ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. కొత్తగా చేయూత పింఛన్ల మంజూరు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలన కోసం సంబంధిత ఎంపీడీవోలకు పంపిస్తున్నాము.

Updated Date - Jun 13 , 2026 | 01:49 AM