పంచాయతీ భవనం పూర్తయ్యేదెప్పుడు?
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:34 AM
మండలంలోని అమ్మనగుర్తి గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. ప్రస్తుతం గ్రామ ప్రభుత్వ పాఠశాల భవనంలోని ఓ గదిలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
సైదాపూర్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అమ్మనగుర్తి గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. ప్రస్తుతం గ్రామ ప్రభుత్వ పాఠశాల భవనంలోని ఓ గదిలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అమ్మనగుర్తి పాత గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో 2016లో దానిని తొలగించారు. అప్పటి ఎమ్మెల్యే ఉపాది హామీ పథకం నుంచి గ్రామ పంచాయతీ నిర్మాణానికి 13 లక్షల రూపాయలు మంజూరు చేశారు. 15 జూన్ 2016న భూమి పూజ చేసి గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. స్లాబ్ వేసిన అనంతరం నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపి వేశాడు. అప్పటి నుంచి ఇద్దరు సర్పంచుల పదవి కాలం గడిచింది. 10 సంవత్సరాలు గడిచి పోయాయి. గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తి కాలేదు. ప్రస్తుతం కొత్త సర్పంచ్ వచ్చాడు. ఈ సర్పంచ్ పదవీకాలం పూర్తయ్యేలోపైనా గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తవుతుందా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.