Share News

ఇంటర్నెట్‌ ఇంకెప్పుడు..?

ABN , Publish Date - Nov 16 , 2026 | 01:18 AM

కరీంనగర్‌ కొత్త కలెక్టరేట్‌లో ఇంటర్నెట్‌ సేవల రూపంలో అసౌకర్యాలు ఎదురవుతున్నాయి.

ఇంటర్నెట్‌ ఇంకెప్పుడు..?

- కొత్త కలెక్టరేట్‌లో సేవలకు అంతరాయం

- కొన్ని శాఖల్లో ఇబ్బందులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరీంనగర్‌ కొత్త కలెక్టరేట్‌లో ఇంటర్నెట్‌ సేవల రూపంలో అసౌకర్యాలు ఎదురవుతున్నాయి. పలు శాఖల కార్యాలయాలు ఇంటిగ్రేటెడ్‌ భవనంలోకి మారినప్పటికీ పరిపాలన పరంగా అందించే సేవలకు అంతరాయం వాటిల్లుతోంది. ప్రస్తుతానికి కొన్ని విభాగాల్లోని ఉద్యోగులు తాత్కాళికంగా మొబైల్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవల్ని వినియోగిస్తున్నారు. ఇంకొందరు టీ-ఫైబర్‌ సదుపాయం కోసం నిరీక్షిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ డిస్ర్టిక్ట్‌ ఆఫీసర్స్‌ కాంప్లెక్స్‌ (ఐడీఓసీ) కొత్త భవనంలోకి శాఖలు మారి నెలరోజులు గడిచాయి. ఇంకా కొన్ని కార్యాలయాలు ఈ భవనంలోకి రావాల్సి ఉంది. వారికి కేటాయించిన గదుల్లోకి వచ్చిన అధికారులు, సిబ్బంది ఇప్పుడిప్పుడే పనిపై దృష్టి సారిస్తున్నారు. ఫర్నీచర్‌ సమకూర్చుకుంటూ ఒక్కో సౌకర్యాన్ని మెరుగుపర్చుకుంటున్నారు. ఈ సమయంలో రోజువారీ పనితీరులో కీలకమైన ఇంటర్నెట్‌ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ల్యాప్‌టాప్‌లు వినియోగిస్తూ ఇక్కట్లను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు.

ఫ కనెక్షన్లు పూర్తయినా..

51 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త కలెక్టరేట్‌లో బహుళ అంతస్తుల్లో అన్నింటా కలిపి 38కిపైగా శాఖలకు కార్యాలయాలను కేటాయించారు. భవనం నిర్మాణ సమయంలోనే ఇంటర్నెట్‌ సరఫరాకు అవసరమైన విధంగా టీ-ఫైబర్‌ కేబుల్‌ వ్యవస్థను అన్ని గదుల్లోకి ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అన్ని కార్యాలయాలకు టీ-ఫైబర్‌ కనెక్షన్లను ఇచ్చారు. దీనికి అనుసంధానంగా ఆయా కార్యాలయాల్లో మోడెమ్‌లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. వీటిని త్వరగా కొనుగోలు చేసుకోవాలని ఇటీవలే కలెక్టరేట్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రస్థాయి నుంచి నిర్వహించే వీడియో కాన్ఫరెన్సలను ప్రస్తుతానికి పాత కలెక్టరేట్‌ భవనంలోనే నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి ఎనఐసీ (నేషనల్‌ ఇనఫార్మాటిక్‌ సెంటర్‌) వ్యవస్థను ఇంకా కొత్త భవనంలోకి మార్చలేదు. దీనికి ప్రత్యేకమైన ఇంటర్నెట్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేయించాల్సి ఉండడంతో ఆలస్యమవుతోంది. ఈ గవర్నెన్స సేవలను, వీడియో కాన్ఫరెన్సల నిర్వహణ బాధ్యతను సమకూర్చే ఈ ఎనఐసీ విభాగాన్ని కొత్త కలెక్టరేట్‌లోకి త్వరలో మార్చే ఏర్పాటు చేస్తున్నారు. కొత్త భవనంలో మానిటర్‌ను ఏర్పాటు చేసినా కనెక్షన ఇవ్వాల్సి ఉంది. దీంతో జిల్లాస్థాయి ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సల కోసం పాత కలెక్టరేట్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. కొన్ని కీలకమైన శాఖల్లోని కంప్యూటర్‌ ఆపరేటర్లకు సరైన వేగంతో కూడిన ఇంటర్నెట్‌ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పాత భవనంలో ఉన్న ఇంటర్నెట్‌ను వాడుకునేందుకు అక్కడికి అవసరమైనప్పుడు వెళ్తున్నారు. పరిపాలన పరంగా సేవలను మరింతగా పెంచడానికి వీలైనంత తొందరగా ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని మెరుగుపర్చాల్సిన అవసరముంది. ముఖ్యంగా ప్రజావాణి సహా ఇతరత్రా అర్జీలను ఆనలైనలో పొందుపర్చాలన్నా.. లేదా వివిధ విభాగాల రిపోర్ట్‌లు నమోదు చేయాలన్నా ఇంటర్నెట్‌ సదుపాయమే కీలకం. అందుకని ఒకటి రెండు రోజుల్లో ఇంటర్నెట్‌ సేవల్లో అంతరాయం లేకుండా పూర్తిస్థాయి సౌకర్యాలను కల్పించాలి. ఇలా చేస్తేనే ఆయా శాఖల్లోని ఉద్యోగుల పనితీరులో వేగం పెరిగితే ఇక్కడికి వచ్చే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.

Updated Date - Nov 16 , 2026 | 01:18 AM