Share News

చేయూత అందేదెన్నడో..?

ABN , Publish Date - Oct 28 , 2026 | 01:10 AM

కొత్తగా చేయూత పింఛన్ల కోసం జిల్లాలో వేలాది మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

చేయూత అందేదెన్నడో..?

జగిత్యాల, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): కొత్తగా చేయూత పింఛన్ల కోసం జిల్లాలో వేలాది మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు మంజూరు చేయడంతో పాటు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్‌ మొత్తాన్ని పెంచుతామని ఇచ్చిన హామీ ఇంకా అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం కొలువుదీరి మూడేళ్లు కావస్తున్నా కొత్త పింఛన్ల మంజూరుపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. జూన్‌ 2వ తేదీ, ఆగస్టు 15, దసరా పండుగ ఇలా ఏ పండుగ వచ్చినా కొత్త పింఛన్లు వస్తాయని ఆశగా ఎదురుచూడడం, ఆ తర్వాత నిరాశ చెందడం దరఖాస్తుదారులకు పరిపాటిగా మారింది.

ఫజిల్లాలో 17,494 మంది దరఖాస్తు

చేయూత పింఛన్ల కోసం ఆగస్టు 9వ తేదీ నుంచి సెప్టెంబరు 15వ తేదీ వరకు ప్రభుత్వం దరఖాస్తుకు అవకాశం కల్పించింది. జిల్లాలో 17,494 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అధికంగా 6,935 మంది వితంతువులు, 3,155 మంది దివ్యాంగులు, 3,099 మంది గీత కార్మికులు, 1,836 మంది ఒంటరి మహిళలు, 3,099 మంది చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 4,139 దరఖాస్తులు అనర్హమైనవిగా అధికారులు గుర్తించారు. మరో 1,528 దరఖాస్తులు హోల్డ్‌లో ఉంచినట్లు సంబంధిత అధికార వర్గాలు అంటున్నాయి.

ఫ 2,13,754 మంది పింఛను లబ్ధిదారులు..

జిల్లాలో వివిధ రకాల పింఛన్లు లబ్ధిదారులు 2,13,754 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.46.20 కోట్లు ప్రభుత్వం అందిస్తోంది. వీరిలో వృద్ధాప్య పింఛను లబ్ధిదారులు 54,479 మంది, వితంతువులు 42,157 మంది, దివ్యాంగులు 15,512 మంది, గీత కార్మికులు 3,232, చేనేత కార్మికులు 2,299, హెచ్‌ఐవీ బాధితులు 900మంది, పైలేరియా బాధితులు 1,617 మంది, డయాలసిస్‌ బాధితులు 232 మంది, ఒంటరి మహిళలు 4,470 మంది, బీడీ వర్కర్లు 88,114 మంది, బీడీ టేకేదారులు 742 మంది లబ్ధిదారులు ఉన్నారు.

ఫహామీల అమలు శూన్యం..

అసెంబ్లీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు పింఛన్ల మొత్తాన్ని రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ హామీనిచ్చింది. ఇతర ఫించన్లను కూడా పెంచుతామని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు పింఛన్లు అందుతాయని అర్హులు ఆశించారు. ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించింది. కానీ వాటి మంజూరును మాత్రం పట్టించుకోలేదు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నెలలు గడుస్తున్నా పింఛన్లు మంజూరు కాకపోవడంతో కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫప్రతి సందర్భంలోనూ నిరాశే..

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2వ తేదీన కొత్త పింఛన్లు ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 15వ తేదీన పక్కాగా అన్నారు. ప్రధానంగా దివ్యాంగులు, ఒంటరి మహిళళు, వితంతువులు, చేనేత, గీతా కార్మికులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించడంతో వారిలో ఆశలు చిగురించాయి. జూన్‌ 2వ తేదీ పోయి ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం గడిచినా పింఛన్లు మంజూరు కాలేదు. ఆ తర్వాత దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభించి, మండలాల వారీగా అర్హతలను పరిశీలించారు. దీంతో కనీసం దసరా పండుగ నాటికైనా పెన్షన్లు అందుతాయని దరఖాస్తుదారులు భావించారు. కానీ అది కూడా నిరాశే మిగిల్చింది. దీపావళి పండుగ నాటికైనా అందిస్తారన్న ఆశతో దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - Oct 28 , 2026 | 01:10 AM