నిధులు మంజూరయ్యేదెన్నడో..?
ABN , Publish Date - Aug 08 , 2026 | 01:04 AM
జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన నిర్వహణ నిధులు ఇప్పటికీ విడుదల కాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దగ్గర పడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు అందక పోవడంతో రోజువారీ నిర్వహణ ఖర్చులను సొంతంగా భరిస్తున్నారు.
-పాఠశాలలకు చాక్‌పీసులు, రిజిస్టర్లకు డబ్బుల్లేవు
- విడుదలలో జాప్యంతో ప్రధానోపాధ్యాయుల ఇక్కట్లు
- జిల్లాలో 1,090 ప్రభుత్వ పాఠశాలలు
జగిత్యాల, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన నిర్వహణ నిధులు ఇప్పటికీ విడుదల కాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దగ్గర పడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు అందక పోవడంతో రోజువారీ నిర్వహణ ఖర్చులను సొంతంగా భరిస్తున్నారు. మరోవైపు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో వేడుకల ఏర్పాట్లకు నిధుల కొరత ప్రభావం చూపనుంది. సాధారణంగా ఈ నిధులు రెండు విడతల్లో విడుదలవుతాయి. తొలి విడత జూలై మొదటి వారంలో రావాల్సి ఉన్నప్పటికీ విడుదల కాలేదు.
ఫకేటాయింపులు ఇలా..
ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యను బట్టి నిర్వహణ నిధులు కేటాయిస్తుంది. 30 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలకు రూ.10 వేలు, 31 నుంచి 100 వరకు విద్యార్థులున్న పాఠశాలలకు రూ.25 వేలు. 101 నుంచి 250 వరకు రూ.50వేలు, 1,000 మందికి పైగా విద్యార్థులుంటే రూ.లక్ష వరకు సంవత్సరానికి ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అందుకు అనుగుణంగా ఖర్చులు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రభుత్వం సత్వరమే నిర్వహణ నిధులు విడుదల చేయాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి.
ఫసొంత డబ్బులు పెట్టుకుంటున్న పరిస్థితి...
ప్రధానంగా పాఠశాలల్లో హాజరు రిజిస్టర్లు, చాక్‌పీసులు, ల్యాబ్ సామాగ్రి, చిన్న పాటి మరమ్మతులు పరీక్షల నిర్వహణ వంటి అవసరాలకు నిర్వహణ నిధులు వినియోగిస్తుంటారు. నిధులు అందకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ముందుగా సొంత డబ్బులు వెచ్చించి పాఠశాలలను నడిపిస్తున్నారు. పాఠశాలలకు క్రీడా సామగ్రి కొనుగోలుకు సైతం నిధులు రావాల్సి ఉంది. త్వరలోనే స్కూల్ గేమ్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) పోటీలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు శిక్షణ, అవసరమైన సామాగ్రి సమకూర్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జిల్లాలో పాఠశాలలు
---------------------------------------------------------------------------------
మేనేజ్‌మెంట్ పాఠశాలల సంఖ్య బాలురు బాలికలు మొత్తం విద్యార్థులు
---------------------------------------------------------------------------------
ప్రభుత్వ - 33 - 1,499 - 1,699 - 3,198
టీజీఆర్‌ఈఐఎస్ - 2 - 504 - 647 - 1,151
కేజీబీవీ - 16 - 0 - 3,319 - 3,319
బీసీ వెల్ఫేర్ - 7 - 1,674 - 1,488 - 3,162
మైనార్టీ వెల్ఫేర్ - 5 - 805 - 687 - 1,492
సోషల్ వెల్ఫేర్ - 5 - 1,369 - 1,063 - 2,423
ట్రైబల్ వెల్ఫేర్ - 5 - 70 - 315 - 385
లోకల్ బాడీ - 705 - 22,225 - 21,068 - 43,293
మోడల్‌స్కూల్స్ - 13 - 3,229 - 4,989 - 8,218
యూఆర్‌ఎస్ - 1 - 59 - 0 - 59
ఎయిడెడ్ - 3 - 34 - 52 - 86
ప్రైవేటు - 92 - 47,024 - 40,001 - 87,025
ప్రైవేటు (సీబీఎస్‌ఈ) - 3 - 1,498 -1,143 - 2,641
---------------------------------------------------------------------------------
మొత్తం - 1,090 - 79,981 - 76,471 - 1,56,452
---------------------------------------------------------------------------------