Share News

చివరి బిల్లు అందేదెన్నడో..?

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:46 AM

పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

చివరి బిల్లు అందేదెన్నడో..?

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యంత్రాంగం కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసే దిశగా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నారు. కానీ ఇందిరమ్మ ఇళ్ల బిల్లులకు లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అప్పులు చేసి ముందస్తుగా డబ్బులు చెల్లిస్తూ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నా చివరి దశ బిల్లు రాకపోవడంతో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ప్రభుత్వం ఐదు లక్షలు చెల్లిస్తున్నా మరో ఐదు లక్షల వరకు లబ్ధిదారులు సమకూర్చుకొని సొంతింటి ఆశలను నెరవేర్చుకుంటున్నారు. ఆర్థిక భారమైన ఇంటి నిర్మాణం చేపట్టి పూర్తిచేసుకొని గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు చివరి దశ బిల్లు రాకపోవడంతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు గ్రామాల్లో ఇందిరమ్మ బిల్లు చెల్లింపులో జాప్యంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో రూ.25 కోట్లపైనే పెండింగ్‌..

జిల్లాలో 80.17 శాతం ఇళ్ల నిర్మాణాలకు మార్కౌట్‌ చేశారు. లబ్ధిదారులు ముందస్తు ఆర్థిక భారాన్ని మోస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలో 7367 ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 5906 నిర్మాణాలకు మార్కౌట్‌ ఇచ్చారు. 2664 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. బిల్లు చెల్లింపుల్లో వివిధ కారణాలతో లబ్ధిదారులకు చివరిదశ బిల్లు బకాయిలు మాత్రం రూ.25 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాత సాంకేతిక సమస్యలు కూడా తోడవుతున్నాయి. చివరి విడత బిల్లు చెల్లింపులు ఇబ్బందులు మొదలు కావడంతో లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదలలో తన వాటాపై మెలిక పెట్టింది. ఇందిరమ్మ ఇంటికి చెల్లించే కేంద్రం వాటాధనాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసే విధంగా నిర్ణయించారు. ఇంటి నిర్మాణం పూర్తయినట్లుగా జియో ట్యాగింగ్‌ ద్వారా ఇంటిని ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. పీఎంఏవై కింద రూ.75వేల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో కాకుండా నేరుగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోనే చివరి దశ బిల్లు నిలిచిపోయిందని తెలుస్తోంది. లబ్ధిదారులకు సంబంధించిన ఇంటి నిర్మాణం పూర్తయినట్లు అన్ని వివరాలు ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేసి కేంద్రానికి పంపించాల్సి ఉన్నా ప్రక్రియలో జాప్యం జరుగుతోందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. జీపీఎస్‌, ఏఐ టెక్నాలజీతో ఫొటోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉండడంతో చాలాచోట్ల సాంకేతిక సమస్యలు వస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఉపాధిహామీకి 4,064 ఇళ్ల అనుసంధానం..

కేంద్ర ప్రభుత్వం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మార్పులు తీసుకొచ్చి ఈనెల 1వ తేదీ నుంచి వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజీవిక మిషన్‌(వీబీ జీ రామ్‌ జీ)ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉపాధిహామీ పథకానికి ఇందిరమ్మ ఇల్ల నిర్మాణాలను అనుసంధానం చేశారు. దీని ద్వారా ప్రతి ఇంటి నిర్మాణానికి ఉపాధిహామీ పథకంలో జాబ్‌ కార్డు ఉన్న లబ్ధిదారుడికి 90 రోజుల పని దినాలకు వేతనంగా రూ.27 వేల వరకు కేంద్ర ప్రభుత్వం చెల్లింపులు చేసింది. నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌ జీ పథకంలో మార్గదర్శకాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఉపాధి కూలీ పనులను తొలగించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇళ్లపై దాదాపు రూ.27 వేల వరకు అదనపు భారం పడనుంది. దీనిద్వారా ప్రస్తుతం నిర్మించే ఇళ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8.91 కోట్ల వరకు అదనపు భారం పడనున్నది. జిల్లాలో ఇందిరమ్మ పథకంలో 7367 ఇళ్లు మంజూరు కాగా, సిరిసిల్ల నియోజకవర్గానికి 3242 ఇళ్లు, వేములవాడ నియోజకవర్గానికి 2866 ఇళ్లు, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో ఉన్న జిల్లాలోని బోయినపల్లి మండలానికి 646 ఇళ్లు, ఇల్లంతకుంట మండలానికి 613 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఉపాధిహామీ పథకానికి 4064 ఇళ్లు మంజూరు ఇచ్చారు. దీని ద్వారా 5718 మంది కూలీలకు 365760 వేతన పనిదినాలను సమకూర్చే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 90 రోజుల పని దినాలను 415 మంది కూలీలు పూర్తి చేశారు. ఇందులో బోయినపల్లిలో 48 మంది, చందుర్తిలో 23మంది, ఇల్లంతకుంటలో 35మంది, గంబీరావుపేటలో 44మంది, కోనరావుపేటలో 57 మంది, ముస్తాబాద్‌లో 31 మంది, రుద్రంగిలో నలుగురు, తంగళ్లపల్లిలో 65 మంది, వీర్నపల్లిలో 8 మంది, వేములవాడలో 7 మంది, వేములవాడ రూరల్‌లో 62 మంది, ఎల్లారెడ్డిపేటలో 31మంది కూలీలు ఉన్నారు. వీబీజీ రామ్‌జీ పోర్టల్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అప్లోడ్‌కు వెసులుబాటు ఇచ్చారు. ఈ పథకానికి గతంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంతో అనుసంధానం చేసి ఉపాధిహామీ పథకం నుంచి 90 రోజుల పని దినాలను కల్పిస్తూ అందుకు వేతనంగా రూ.27 వేల వరకు అందిస్తున్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.12వేలు, ఇంకుడు గుంతకు రూ.6 వేలు చెల్లిస్తున్నారు. మిగతా డబ్బులు ప్రభుత్వం మూడు విడతలుగా చెల్లింపులు చేస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీరామ్‌జీ పథకంలో 318 పనులను మార్గదర్శకాల్లో చూపించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని తొలగించింది. దీంతో ఉపాధిహామీ నుంచి అందాల్సిన 90 రోజుల పని దినాల వేతనాలు అందని పరిస్థితి ఉంటుంది. స్వచ్ఛభారత్‌ మిషన్‌కు సంబంధించి రూ.12 వేలు, ఇంకుడు గుంతకు రూ.6 మాత్రం వర్తించనున్నాయి.

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు..

మండలం మంజూరైనవి.. పూర్తయినవి..

బోయిన్‌పల్లి 646 365

చందుర్తి 506 207

ఇల్లంతకుంట 613 348

గంభీరావుపేట 525 210

కోనరావుపేట 499 295

ముస్తాబాద్‌ 252 237

రుద్రంగి 248 120

సిరిసిల్ల 857 327

తంగళ్ళపల్లి 554 295

వీర్నపల్లి 207 69

వేములవాడ అర్బన్‌ 750 126

వేములవాడ మున్సిపల్‌ 527 213

వేములవాడ రూరల్‌ 336 188

ఎల్లారెడ్డిపేట 574 242

మొత్తం 7367 3142

Updated Date - Jul 17 , 2026 | 12:46 AM