కోఆప్షన్ పదవుల భర్తీకి మోక్షమెప్పుడో?
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:50 AM
మున్సిపల్ ఎన్నికలు ముగిసి పదినెలలు కావస్తున్నా కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ మాత్రం ఇంకా కొలిక్కి రావడం లేదు.
పెద్దపల్లి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలు ముగిసి పదినెలలు కావస్తున్నా కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ మాత్రం ఇంకా కొలిక్కి రావడం లేదు. జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఈ పదవుల భర్తీ పెండింగ్లోనే ఉంది. ఒక్కోపట్టణ స్థానిక సంస్థలో నలుగురు చొప్పున మొత్తం 17మంది కోఆప్షన్ సభ్యులను నియమించాల్సి ఉంది. ఈ మేరకు మున్సిపల్ ఉన్నతాధికారుల నుంచి ఆయా మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు వచ్చి నెలలు గడుస్తున్నా ఎంపిక ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు పేర్లను ఖరారు చేయకపోవడంతో ఆశావహులు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
- 126ప్రజాప్రతినిధుల స్థానాలు..
జిల్లాలోని నాలుగు పట్టణ స్థానికసంస్థల్లో మున్సిపల్ ఎన్నికల ద్వారా మొత్తం 126 మంది ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు. ఇందులో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 60 కార్పొరేటర్ స్థానాలు ఉండగా, పెద్దపల్లి మున్సిపాలిటీలో 36, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో 15 చొప్పున కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించగా, పాలకవర్గాలు కొలువుదీరాయి. అయితే కోఆప్షన్ సభ్యుల నియామకం మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఒక్కో పట్టణ స్థానిక సంస్థలో నలుగురు చొప్పున మొత్తం 16మందికి అవకాశం కల్పించాల్సి ఉంది.
- ఒక్కో పదవికి పలువురి పోటీ..
కోఆప్షన్ సభ్యుల పదవులపై అధికారపార్టీకి చెందిన పలువురు నాయకులు ఆశలు పెట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసి అవకాశం దక్కనివారు, పార్టీకోసం పనిచేసిన నాయకులు, స్థానికంగా గుర్తింపు ఉన్ననేతలు ఈ పదవులను ఆశిస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలంటూ ఇప్పటికే ఆయానియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలిసి విజ్ఞప్తులు చేశారు. ఎమ్మెల్యేలు సైతం ఆశావహుల పేర్లను సేకరించి పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే ఒక్కో పదవికి పలువురు పోటీ పడుతుండ టంతో ఎవరికి అవకాశం కల్పించాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకోవడం ఆలస్యమవుతోంది. ఒకరికి అవకాశం కల్పిస్తే మరొకరు అసంతృప్తికి గురయ్యే పరిస్థితి ఉండటంతో ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
- కమిషనర్లకు ఆదేశాలొచ్చినా..
మున్సిపల్ ఎన్నికల నిర్వహణతోపాటు కోఆప్షన్ సభ్యుల నియామకానికి సంబంధించి మున్సిపల్ ఉన్నతాధికారుల నుంచి ఆయా మున్సిపల్ కమిషనర్లకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేల నుంచి తుది జాబితాలు ఖరారు కాకపోవడంతో నియామక ప్రక్రియ ముందుకు సాగడంలేదు. అధికారికంగా ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై స్పష్టత లేక పోవడంతో పదవులు ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.
- దీపావళిలోగా భర్తీ చేస్తారా?
మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల పదవులతోపాటు వివిధ నామినేటెడ్ పదవుల భర్తీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉంది. పార్టీకోసం కష్టపడిన వారికి, ఎన్నికల్లో అవకాశం దక్కని వారికి నామి నేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీపావళిలోగా పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవులన్నింటినీ భర్తీచేసే దిశగా పీసీసీ, ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పెద్దపల్లి జిల్లాలోని నాలుగు పట్టణ స్థానికసంస్థల్లో కోఆప్షన్ సభ్యుల ఎంపిక అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పది నెలలుగా ఎదురు చూస్తున్న 16మంది కోఆప్షన్ సభ్యుల నియామకానికి దీపావళి నాటికైనా మోక్షం లభిస్తుందా? లేక ఆశావహులకు మరికొంతకాలం నిరీక్షణ తప్పదా? అన్నది ఆసక్తికరంగా మారింది.