Share News

మానేరుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడో?

ABN , Publish Date - Nov 17 , 2026 | 01:14 AM

మండలంలోని కిష్టంపేట సమీపంలో గల మానేరుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు జరుగుతుందోనని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.

 మానేరుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడో?
మానేరుపై వేసిన తాత్కలిక మట్టి రోడ్డు

- ఏళ్లుగా ప్రయాణికుల ఎదురుచూపు

కాల్వశ్రీరాంపూర్‌, నవంబరు16(ఆంధ్రజ్యోతి): మండలంలోని కిష్టంపేట సమీపంలో గల మానేరుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు జరుగుతుందోనని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్ణపల్లి, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌ మండలం కిష్టంపేట నడుమ మానేరు ప్రవహిస్తోంది. ఈ మానేరుపై బ్రిడ్జి నిర్మాణం జరిగితే ప్రయాణికుల దూరంతోపాటు ఆర్థికభారం తగ్గుతుంది. హన్మకొండ మాజీ ఎంపీ జగ్గారెడ్డి గతంలో మానేరుపై బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు కృషి చేశారు. సర్వే చేయించి ప్రతిపాదనలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. కేంద్ర ప్రభుత్వం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో బ్రిడ్జి నిర్మించేందుకు సర్వేకు అనుమతులు ఇచ్చింది. మావోయిస్టు ప్రభావిత గ్రామాల అభివృద్ధి కింద అప్పటికీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ రూ.77 కోట్లు మానేరుపై బ్రిడ్జి నిర్మాణానికి బడ్జెట్‌ పెట్టారు. దీంతో మానేరుపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని ప్రజలు, నాయకులు సంతోషించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మానేరుపై బ్రిడ్జి నిర్మాణానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో నిర్మాణం నిలిచిపోయింది. గత 40 ఏళ్లుగా మానేరుపై బ్రిడ్జి నిర్మాణానికి పలుసార్లు మానేరు పరివాహక ప్రాంత పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలు సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.

పెద్దపల్లి, భూపాలపల్లి ప్రజలకు ప్రయోజనం

ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, సుల్తానాబాద్‌, పెద్దపల్లితోపాటు భూపాలపల్లి జిల్లా టేకుమట్ల, తదితర మండలాలకు ప్రయాణం సులువుగా ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలకు భూపాలపల్లి, పరకాల, దగ్గరవుతుంది. సుమారు 30 కిలోమీటర్ల మేర ప్రయాణం తగ్గుతుందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో మానేరు పొంగి ప్రవహించడం వలన కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల ఇతర మండలాల ప్రయాణికులు గుంపుల, జమ్మికుంట మండలం వావిలాల, రాఘవరెడ్డి పేట తదితర గ్రామాల నుంచి పరకాల భూపాలపెల్లికి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మిస్తే కరీంనగర్‌, పెద్దపల్లి, నుంచి కాల్వశ్రీరాంపూర్‌ ద్వారా బస్సులు పరకాల భూపాలపెల్లికి నడిపే అవకాశం ఉంది. పరకాల, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్‌ నుంచి బస్సుల రాకపోకలు పెరిగి ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రయాణికుల కోరిక మేరకు మానేరులో మట్టి రోడ్డు వేయడం వలన రోజు వందలాది వాహనాలు వస్తున్నాయని కిష్టంపేట ప్రజలు పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా ప్రజలు కరీంనగర్‌, పెద్దపల్లి , సిరిసిల్ల, జగిత్యాలతోపాటు పలు జిల్లాలకు వెళ్లేవారు కూడా ఈ మానేరు పై మట్టి పోయడం వలన ప్రయాణం సులువుగా సాగిస్తున్నారు. రోజు కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, వ్యాన్లు, లారీలు ఇతర వాహనాలు మట్టి రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నాయి. వర్షాలు పడి మానేరు పొంగితే మానేరుపై మట్టి రోడ్డు కొట్టుకపోయి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రభుత్వం ఆలోచించి మానేరుపై బ్రిడ్జి నిర్మిస్తే నాలుగైదు జిల్లాల ప్రజలకు ప్రయాణం సులువుగా ఉంటుందని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Nov 17 , 2026 | 01:14 AM