Share News

‘సన్నాల’ బోనస్‌ ఎప్పుడిస్తారు?

ABN , Publish Date - Jul 18 , 2026 | 01:28 AM

రెండేళ్లుగా పండించిన సన్నరకం వరిధాన్యానికి సంబంధించిన బోనస్‌ డబ్బుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే సన్నరకం వరి ధాన్యానికి క్వింటాకు రూ.500బోనస్‌ ఇస్తామన్న హామీ ఇచ్చింది.

  ‘సన్నాల’ బోనస్‌ ఎప్పుడిస్తారు?

- రెండేళ్లుగా అన్నదాతల ఎదురుచూపులు

- గతేడాది 5లక్షల క్వింటాళ్ల సన్నరకం వరిధాన్యం కొనుగోళ్లు

- ఈ యేడాది యాసంగిలో 8,473క్వింటాళ్లు

- జిల్లాలో రూ.25.43కోట్ల బోనస్‌ పెండింగ్‌

జగిత్యాల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లుగా పండించిన సన్నరకం వరిధాన్యానికి సంబంధించిన బోనస్‌ డబ్బుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే సన్నరకం వరి ధాన్యానికి క్వింటాకు రూ.500బోనస్‌ ఇస్తామన్న హామీ ఇచ్చింది. ఇది నమ్మి జిల్లాలోని రైతులు రెండేళ్లుగా యాసంగిలో సైతం సన్నరకం సాగు చేసి విక్రయించారు. 2025లో వానాకాలం సీజన్‌లో సన్నరకం ధాన్యం బోనస్‌, 2026లో యాసంగి సీజన్‌లో బోనస్‌ రైతుల ఖాతాలో జమ చేయలేదు. గతేడాది వానాకాలం సీజన్‌కు రూ.25.01కోట్లు, ఈ యేడాది యాసంగికి రూ.42.36లక్షలు మొత్తం రూ.25.43కోట్లు బోనస్‌ బకాయిలు పేరుకపోవడంతో ఎప్పుడు చెల్లిస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు.

యాసంగిలోనూ సన్నాల సాగు..

ఈ యేడాది యాసంగిలోనూ జిల్లా రైతులు సుమారు 3.50లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. సన్నరకం సుమారు వెయ్యిమెట్రిక్‌ టన్నులు, దొడ్డురకం 5.50లక్షల మెట్రిక్‌ దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 444కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 95,367మంది రైతుల నుంచి సుమారు 5.50లక్షల మెట్రిక్‌ వరిధాన్యం కొనుగోలు చేశారు. అందులో సుమారు 5,49,100మెట్రిక్‌ టన్నుల దొడ్డురకం, సుమారు 900మెట్రిక్‌ టన్నుల సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేశారు ఇందుకు సంబంధించి ధాన్యం డబ్బులు సుమారు రూ.1,240కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడంతోనే రైతులకు బోనస్‌ చెల్లింపుల్లో ఆలస్యమవుతోందనేది బహిరంగ రహస్యమే. వానాకాలం సీజన్‌ ప్రారంభమై నెలన్నర అవుతోంది. పంటల సాగు కోసం పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు బోనస్‌ బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అధికారులు ఏమంటున్నారంటే..

బోనస్‌ డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండేళ్లకు సంబంధించిన బోనస్‌ నిధులు ప్రభుత్వం నుంచి విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమచేస్తామని జిల్లా సివిల్‌సప్లయి శాఖ, సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌ శాఖ అధికారులు రైతులకు వివరిస్తున్నారు.

బోనస్‌ కోసం ఎదురుచూపులు..

- మైదం శ్రీనివాస్‌, రైతు, తిప్పన్నపేట గ్రామం, జగిత్యాల జిల్లా

సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు బోనస్‌ రావడం లేదు. గతయాసంగి సీజన్‌లో సుమారు 120మంది రైతులు సుమారు 8,500క్వింటాళ్ల వరకు సన్నరకం ధాన్యం విక్రయించారు. అయితే ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం క్వింటాలుకు రూ.500చొప్పున అందించాల్సిన బోనస్‌ డబ్బులను మాత్రం అందించలేదు.

Updated Date - Jul 18 , 2026 | 01:28 AM