బిల్లులెప్పుడు చెల్లిస్తారు..?
ABN , Publish Date - Nov 17 , 2026 | 01:30 AM
అంగన్‌వాడీలను ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్నది. అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాలకు ఆరు నెలలుగా అద్దె చెల్లించడం లేదు.
- అంగన్‌వాడీలపై బకాయిల భారం
- పెండింగ్ ఆరు నెలలు అద్దె, మూడు నెలల గ్యాస్ బిల్లు
- నెల ఆలస్యంగా జీతాలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
అంగన్‌వాడీలను ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్నది. అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాలకు ఆరు నెలలుగా అద్దె చెల్లించడం లేదు. మూడు నెలలుగా గ్యాస్, కూరగాయల బిల్లులు చెల్లించక టీచర్లు అప్పులు చేసి చెల్లిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లకు, ఆయాలకు వేతనాలు కూడా నెల రోజులు ఆలస్యంగా అందుతుండడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఫ అద్దె భవనాల్లో 128 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లాలో 777 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 128 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటన్నింటికి నెలకు 5,03,867 రూపాయల అదెద్ద చెల్లిస్తారు. ఆరు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో 30,23,202 రూపాయలు బకాయి పడిపోయాయి. 2026 ఏప్రిల్‌లో అద్దె చెల్లించిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ నిధులు మంజూరుకు నోచుకోవడం లేదు. అంగన్‌వాడీలో పౌష్టికాహారం అందించడానికి ఉపయోగించే గ్యాస్ బిల్లులను కూడా మూడు నెలలుగా చెల్లించడం లేదు. ఒక్కో గ్యాస్ సిలిండర్‌కు 1,015 రూపాయలు చెల్లిస్తారు. జూలై మాసం తర్వాత గ్యాస్ బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారు.
ఫ ఇబ్బందుల్లో అంగన్‌వాడీ టీచర్లు
అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం తయారు చేయడం కోసం కూరగాయలు, ఇతర దినుసుల కోసం గర్భిణిలు బాలింతలకు ఒక్కొక్కరికి 1.25 రూపాయలు, పిల్లలకు 75 పైసల చొప్పున చెల్లిస్తారు. జూలై మాసంలో కూరగాయల బిల్లులు చెల్లించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్లీ మంజూరు చేయలేదు. అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాలకు నెలల తరబడి అద్దె చెల్లించక పోవడంతో ఆయా భవనాల ఇంటి ఓనర్లు టీచర్లపై అద్దె కోసం ఒత్తిడి తెస్తున్నారు. మూడు నెలలుగా గ్యాస్ బిల్లు రాక పోవడంతో టీచర్లే తమ అరకొర జీతం నుంచి వాటిని చెల్లించి బిల్లు వచ్చిన తర్వాత తీసుకోవాల్సి వస్తున్నది. అంగన్‌వాడీ కేంద్రాల్లో 715 మంది టీచర్లు, 534 మంది ఆయాలు పనిచేస్తున్నారు. వీరికి నెల వేతనాలు 1,39,24,950 రూపాయలు చెల్లిస్తారు. జీతం చెల్లింపులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతి రోజు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా గర్భిణులు, బాలింతలకు అటెండెన్స్ వేస్తారు. ఆ యాప్, కేంద్రాలకు సరఫరా చేసిన మొబైల్ ఫోన్స్ పనిచేయక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టులు భర్తీ చేయక పోవడంతో పనిచేస్తున్న వారిపై ఒత్తిడి పెరుగుతున్నది.
ఫ ఖాళీలను భర్తీ చేయని ప్రభుత్వం
జిల్లాలో 62 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 249 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టులో తొమ్మిది టీచర్ పోస్టులు 38 ఆయా పోస్టులు, రూరల్ ప్రాజెక్టు పరిధిలో 15 టీచర్ పోస్టులు, 69 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గంగాధర ప్రాజెక్టు పరిధిలో 21 టీచర్ పోస్టులు, 57 ఆయా పోస్టులు, హుజూరాబాద్ ప్రాజెక్టు పరిధిలో 19 టీచర్ పోస్టులు 85 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని వెంటనే భర్తీ చేయాలని ఆయా కేంద్రాల గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 4,309 మంది గర్భిణులు, 3753 మంది బాలింతలు, 3837 మంది ఆరు నెలలలోపు చిన్నారులు, ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలలోపు చిన్నారులు 20,231 మంది, 3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులు 20,212 మంది అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. కేంద్రాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా వీరికి అందాల్సిన సేవల్లో లోపాలు జరిగడంతోపాటు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రైవేట్ భవనాల్లో నడిచే అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె చెల్లించి గ్యాస్, కూరగాయల పెండింగ్ బిల్లులను ఇవ్వాలని టీచర్లు, ఆయాలు కోరుతున్నారు.