ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ ఎప్పుడూ!
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:19 AM
పెద్దపల్లి జంక్షన్‌కు ప్రత్యేక రైళ్ల హాల్టింగ్ విషయంలో రైల్వేశాఖ చిన్నచూపు చూస్తోందన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. కాశీ, ప్రయాగ్‌రాజ్ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులతో పాటు బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులకు ఉపయోగపడే నాలుగు వారపు ప్రత్యేక రైళ్లకు పెద్దపల్లి జంక్షన్‌లో హాల్టింగ్ సౌకర్యం కల్పించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ ఎప్పుడూ!- మంచిర్యాల జిల్లాలో మూడు స్టేషన్లకు, పెద్దపల్లి జంక్షన్‌కు మొండిచేయి
- బెంగళూరు, కాశీ, ప్రయాగ్‌రాజ్ వెళ్లే ప్రయాణికులకు ఇక్కట్లు
- ఆదాయంలో వెనుకబడిన స్టేషన్లకు స్టాప్‌లు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
పెద్దపల్లి జంక్షన్‌కు ప్రత్యేక రైళ్ల హాల్టింగ్ విషయంలో రైల్వేశాఖ చిన్నచూపు చూస్తోందన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. కాశీ, ప్రయాగ్‌రాజ్ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులతో పాటు బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులకు ఉపయోగపడే నాలుగు వారపు ప్రత్యేక రైళ్లకు పెద్దపల్లి జంక్షన్‌లో హాల్టింగ్ సౌకర్యం కల్పించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అనేక మంది బెంగుళూరు, కాశీ, ప్రయాగ్‌రాజ్ వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు పెద్దపల్లి జంక్షన్ అనువుగా ఉంటుంది. మరోవైపు పక్కనే ఉన్న మంచిర్యాల జిల్లాలోని సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల స్టేషన్లలో ఆయా రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించడం చర్చనీయాంశంగా మారింది. 04133/34 కాన్పూర్-ఎస్‌ఎంవీటీ బెంగళూరు-కాన్పూర్ వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్, 04135/36 సుబేధార్‌గంజ్ (ప్రయాగ్‌రాజ్) యశ్వంత్‌పూర్-సుబేదార్‌గంజ్ వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్, 04149/50 ప్రయాగ్‌రాజ్-యశ్వంత్‌పూర్-ప్రయాగ్‌రాజ్ వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్, 04113/14 ప్రయాగ్‌రాజ్- ఎస్‌ఎస్‌ఎస్ హుబ్బల్లి-ప్రయాగ్‌రాజ్ వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లకు పెద్దపల్లి జంక్షన్‌లో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ నాలుగు రైళ్లకు సమీపంలోని సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల స్టేషన్లలో స్టాప్‌లు ఉన్నాయి.
ఫ ఆదాయంలోనూ పెద్దపల్లిదే పైచేయి..
పెద్దపల్లి జంక్షన్‌తో పోలిస్తే ఆదాయం తక్కువగా ఉన్న బెల్లంపల్లి, పెద్దపల్లితో సమానస్థాయిలో ఆదాయం ఉన్న సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ కల్పించి, కీలకమైన పెద్దపల్లి జంక్షన్‌ను విస్మ రించడం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి మీదుగా నిత్యం వేలాది మంది ప్రయా ణిస్తుండగా, ఇక్కడి నుంచి బెంగళూరుకు కాచిగూడ, సికింద్రాబాద్ మీదుగా వెళ్లే రైళ్లలోనూ ప్రస్తుతం ఒక్కదానికి కూడా హాల్టింగ్ సదుపాయం లేకపోవడం గమనార్హం. గతేడాది ప్రారంభించిన కాచిగూడ-కర్నూలు మీదుగా నడిచే 11085/86 గ్వాలియర్-ఎస్‌ఎంవీటీ బెంగళూరు-గ్వాలియర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఏ ఒక్క స్టేషన్‌కు కూడా స్టాప్ ఇవ్వలేదు. ఇటీవలే క్రమబద్ధీకరించిన సికింద్రాబాద్, రాయచూర్ మీదుగా నడిచే 18261/62 బిలాస్‌పూర్-యలహంక, బెంగళూరు-బిలాస్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ రైలుకు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ ఒక్క స్టేషన్‌లో కూడా హాల్టింగ్ సౌకర్యం కల్పించ లేదు.
ఫ ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు..
పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల ప్రాంతాల నుంచి కాశీ, ప్రయాగ్‌రాజ్ వెళ్లే భక్తులు, బెంగళూరుకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు అధికంగా ఉన్నారు. అయినప్పటికీ ప్రత్యేక రైళ్లకు పెద్దపల్లిలో హాల్టింగ్ లేకపోవడంతో ప్రయాణికులు సమీపంలోని ఇతర స్టేషన్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రైల్వేశాఖ ప్రయాణికుల అవసరాలు, ఆదాయ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కనీసం ఈ నాలుగు ప్రత్యేక రైళ్లకైనా పెద్దపల్లి జంక్షన్‌లో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.