Share News

బీఆర్‌ఎస్‌లో సంస్థాగత నిర్మాణమెప్పుడో..?

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:30 AM

బీఆర్‌ఎస్‌ పార్టీలో సంస్థాగత నిర్మాణమెప్పుడో అని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌లో సంస్థాగత నిర్మాణమెప్పుడో..?

జగిత్యాల, మార్చి16 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీలో సంస్థాగత నిర్మాణమెప్పుడో అని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014కు ముందు పార్టీ సంస్థాగతంగా కీలకంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు పదవులు కేటాయిస్తూ పర్యవేక్షిస్తూ ఉండేది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండడంతో కేడర్‌ నైరాశ్యంలో ఉంటోంది. సంవత్సరాల తరబడి పార్టీ కమిటీల్లోనూ చోటు దక్కుతుందని భావించినప్పటికీ నిరాశే ఎదురవుతోంది. పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ క మిటీలు ఎప్పుడు వేస్తారోననే చర్చ జరుగుతోంది. పార్టీ పదవుల ఇస్తే ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడంతో పాటు పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పలువురు కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు.

ఫజిల్లాలో గతంలో బీఆర్‌ఎస్‌ ఇలా..

జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో గత ప్రభుత్వ హయాంలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి గెలుపొందిన కొప్పుల ఈశ్వర్‌ గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. కోరుట్ల, జగిత్యాల నియోజక వర్గాల నుంచి సైతం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, సంజయ్‌ కుమార్‌ గత ప్రభుత్వ హయాంలో బాధ్యతలు నిర్వర్తించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్‌ఎస్‌ నేత ఎల్‌.రమణ వ్యవహరిస్తున్నారు. అయితే గత యేడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. ధర్మపురి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ గెలుపొందారు. కోరుట్ల, జగిత్యాల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీ చేసిన డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌లు గెలుపొందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ పార్టీని మారారు. కాంగ్రెస్‌ సర్కారుతో కలిసి పనిచేస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పునర్‌వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది.

ఫఆశావహుల ఎదురుచూపులు

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రెండు పర్యాయాలు అధికారంలో ఉంది. అధికారం కోల్పోయి రెండు సంవత్సరాలు దాటినప్పటికీ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను వేస్తే అధిష్ఠానం ప్రజా సమస్యలపై ఇచ్చే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుందన్న అభిప్రాయాలున్నాయి. ఇప్పటివరకు జిల్లా స్థాయి పూర్తి కమిటీలు, అనుబంధ కమిటీలు లేవు. కేవలం అధ్యక్షుడిని మాత్రమే నియామకం చేశారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కమిటీలో పూర్తి కార్యవర్గం గాని, అనుబంధ కమిటీల నియామకంగాని జరగడం లేదు. దీంతో జిల్లాలో క్రియాశీలకంగా పనిచేస్తున్న క్యాడర్‌ నిరాశకు గురవుతున్నారు.

ఫ కాలయాపనపై అసంతృప్తి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం నుంచి పార్టీలోనే పని చేస్తున్న పలువురు నాయకులు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కమిటీల్లో చోటు దక్కుతుందని, జిల్లా కమిటీల్లోనూ అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. కానీ అసలు కమిటీలు వేయడానికి పార్టీ అధిష్ఠానం చర్యలు చేపట్టకపోవడంతో నైరాశ్యంలో కొట్టుమిట్టాడు తున్నారు. త్వరలో కమిటీలు వేస్తామని, యాక్టీవ్‌గా పనిచేసే వారికి అవకాశం ఇస్తామని, పనిచేసే ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తింపు ఇస్తుందని తరుచుగా పేర్కొంటున్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్న అభిప్రాయాల్లో బీఆర్‌ఎస్‌ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నప్పటికీ కొందరికి మాత్రమే అవకాశాలు ఇస్తూ ఇతరులకు రిక్తహస్తం చూపుతున్నారని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల్లో నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తూ తమను విస్మరిస్తున్నారని పలువురు నాయకులు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఫపరిషత్‌ ఎన్నికలు దగ్గర పడుతున్నా..

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ హామీలు, గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపిస్తోంది. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. ఇటీవల మున్సిపల్‌, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా పార్టీ సంస్థాగతంపై అధిష్ఠానం ఫోకస్‌ పెట్టకపోవడంతో కేడర్‌లో అసంతృప్తి నెలకొంది. అధిష్ఠానం స్పందించి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.

Updated Date - Mar 17 , 2026 | 01:30 AM