Share News

రైతు వేదికల నిర్వహణపై పట్టింపేది?

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:01 AM

రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వ నిర్మించిన రైతువేదికల నిర్వాహణ భారంగా మారింది.

రైతు వేదికల నిర్వహణపై పట్టింపేది?

ఇల్లంతకుంట, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వ నిర్మించిన రైతువేదికల నిర్వాహణ భారంగా మారింది. మండలంలోని ఇల్లంతకుంట, గాలిపెల్లి, పొత్తూరు. వల్లంపట్ల, పెద్దలింగాపూర్‌, దాచారం, రేపాక గ్రామాలలో క్లస్టర్‌ రైతువేదికలను ప్రభుత్వం 2020సంవత్సరంలో నిర్మించింది. ఈ కేంద్రాలలో ఏఈవోలు కొంతసమయం పాటు రైతులకు అందుబాటులో ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. రైతు వేదికల నిర్వహణకు తొలుత నెలకు రూ.9వేలు ఇవ్వాలని నిర్ణయించి కొద్ది నెలలపాటు ఇచ్చింది. అనంతరం నిధుల మంజూరు నిలిపివేసింది. దీనితో రైతువేదికల నిర్వాహాణ భారం ఏఈవోలపై పడింది. ప్రతినెలలో రైతులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. సమావేశానికి వచ్చిన వారిని చూసుకోవలసిన బాధ్యత ఉంటుంది. అంతేకాకుండా రైతు వేదికలను శుభ్రం చేసేవారు లేకపోవడంతో గ్రామపంచాయతీ ద్వారా సిబ్బంది వచ్చి శుభ్రం చేస్తున్నా వారికి కొంత ఇవ్వవలసి వస్తుందని ఏఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లంతకుంటలోని రైతువేదిక అయితే అన్ని ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు వినియోగిస్తుంటారు. ప్రభుత్వం సంవత్సరాల కొద్ది నిర్వాహణ నిధులు మంజూరు చేయకపోవడంలోని ఆంతర్యం ఏమిటో ప్రభుత్వానికే తెలియాలి. ప్రభుత్వం స్పందించి రైతువేదికల నిర్వాహణ నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.

సౌకర్యాలు శూన్యం..

మండలంలోని ఏడు గ్రామాలలో నిర్మించిన రైతువేదికలలో సౌకర్యాలు శూన్యం, రైతువేదికలకు ఎక్కడా ప్రహారీలు లేకపోవడంతో పలు చోట్ల మందుబాబులు వీటి వద్ద మద్యంసేవించి సీసాలు పగలగొడుతున్నారు. పలు గ్రామాలలోని రైతువేదికలలో త్రాగునీరు. మరుగుదొడ్లలో కనీసం నీరు కూడా రావడం లేదంటే వీటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక రైతువేదికల విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మండలంలోని అన్ని క్లస్టర్‌ రైతువేదికల విద్యుత్‌ బిల్లులు రూ.1.12లక్షలు పెండింగ్‌లో ఉన్నట్లు సెస్‌ అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:01 AM