కొనుగోళ్లు ఏవి?
ABN , Publish Date - Nov 03 , 2026 | 01:07 AM
దసరా దాటింది.. దీపావళి రాబోతోంది. కానీ జిల్లాలో ఇంకా ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు.
- ఇంకా ప్రారంభమవని ధాన్యం కొనుగోలు కేంద్రాలు
- కాలాయాపన చేస్తున్న యంత్రాంగం
- ఈసారి కూడా ధాన్యం సేకరణలో ఆలస్యం
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
దసరా దాటింది.. దీపావళి రాబోతోంది. కానీ జిల్లాలో ఇంకా ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లావ్యాప్తంగా వరికోతలు ముమ్మరమయ్యాయి. ముందుగా పంటను వేసిన వారు కోసం పచ్చిధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. పంట పొలాల్లోరు కాంటాలు పెడుతున్నారు. ఇదంతా బాహాటంగా జరుగుతనాన్నా జిల్లాలో ధాన్యాన్ని సేకరించేందుకు ఏర్పాటు చేయాల్సిన కొనుగోలు కేంద్రాల విషయంలో నాన్చివేత ధోరణి కనిపిస్తోంది. అక్టోబరు చివరి వారంలో ఏర్పాటు చేయాలనుకున్న కేంద్రాల్లో సగమైనా ఇప్పటి వరకు ప్రారంభమవ్వాలి. నవంబరు మొదటి వారంలో కొనుగోళ్ల వేగం పెరగాలి. ఇందుకు భిన్నంగా ఈ సారి కేంద్రాల ఏర్పాటు విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. పంట ఆశించిన స్థాయిలో రాలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తుండగా.. వచ్చిన ఽధాన్యాన్ని వచ్చినట్లు కొనుగోలు చేస్తే ఇబ్బంది ఉండదని రైతులు అంటున్నారు.
కొనుగోలు కేంద్రాల వివరాలు
---------------------------
మొత్తం కేంద్రాలు- 315
పీఏసీఎస్ - 178
ఐకేపీ - 89
డీసీఎంఎస్- 39
హాకా- 9
------------------------------
మండలానికి ఒక్కటి కూడా..?
జిల్లావ్యాప్తంగా ఈసారి 315 కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబధించి పలుమార్లు కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క మండలంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. ఒకటి రెండు చోట్ల మాత్రం అక్కడి ప్రజాప్రతినిధులు కేంద్రాలను ప్రారంభించినా అక్కడ ఇప్పటి వరకు ఒక్క గింజను కూడా కొనలేదు. కేంద్రాల ఏర్పాటు ఆలస్యం చేయడం వల్ల రైతులు రోజుల తరబడి కల్లాల్లోనే నిరీక్షించాల్సి ఉంటుంది. కేంద్రాలకు సమకూర్చాల్సిన బస్తాలు, టార్పాలిన్లు, ఇతరత్రా సామగ్రి పంపిణీ విషయంలోనూ ఇంకా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఫ జాప్యం వల్ల ప్రైవేటుకే..
కోతలు పూర్తయిన రైతులు పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్మేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరను మించి వ్యాపారులు సన్నధాన్యాన్ని కొంటుండడంతో అటు వైపే మొగ్గు చూపుతున్నారు. కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యానికి తేమ శాతం 17 ఉండాలనే నిబంధనతోపాటు తూకం వేయడానికి నిరీక్షించడం, హమాలీ, తరుగు ఇతరత్రా ఇబ్బందులు ఉండవని పంటపొలం వద్దనే అమ్మకాలకు అన్నదాతలు ఇష్టపడుతున్నారు. అధికారులు కూడా ఈ సారి దిగుబడిగా వచ్చే పంట ఉత్పత్తిలో ప్రైవేటుకు వ్యాపారులు అమ్ముకోగా మిగిలినది కొనాలనే ధోరణితోనే ఆలస్యం చేస్తున్నారని రైతులు అంటున్నారు. ఈ సారి 2.65 లక్షల ఎకరాల్లో జిల్లాలో వరి పంటను సాగు చేశారు. ఎక్కువ శాతం సన్నరకాలను వేశారు. వేసిన పంట విస్తీర్ణాన్ని బట్టి మంచిగా పంట పండితే 6.25 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడిగా రానుంది. అధికారులు మాత్రం 5.45 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో మూడు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని లెక్కలేశారు. ఇందుకు తగినట్లు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.