Share News

సంక్షేమం కరువు

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:05 AM

జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

సంక్షేమం కరువు

(జగిత్యాల/ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌)

జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పలు హాస్టళ్లు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. మరికొన్నింటిని శిథిలావస్థలో గల భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇరుకు, చీకటి గదులు, చాలీచాలని స్నానపు గదులు, మరుగుదొడ్లు, అంతంతమాత్రంగా నీటి వసతి వల్ల విద్యార్థులు ఇక్కట్ల పాలవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బెడ్స్‌ లేకపోవడంతో నేలపైనే నిద్రిస్తుండడం, డైనింగ్‌ హాల్‌ లేక పోవడంతో నేలపైనే అల్పాహారం, భోజనం చేస్తున్నారు. వాచ్‌మెన్లు, ట్యూటర్లు, వార్డెన్లు సమయపాలన పాటించడం లేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో హాస్టళ్లను మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ బృందం పరిశీలించగా వెల్లడైన పలు అంశాలను పరిశీలిస్తే...

ఫ నేలపైనే నిద్ర

జిల్లా కేంద్రంలోని దరూర్‌ క్యాంపులో నిర్వహిస్తున్న ఎస్టీ వసతి గృహంలో 80మంది విద్యార్థులకు గాను 50 మంది మాత్రమే విద్యార్థులున్నారు. పడుకోవడానికి బెడ్లు సక్రమంగా లేకపోడంతో గదుల్లో నేలపైనే విద్యార్థులు నిద్రిస్తున్నారు. దుప్పట్లు సరఫరా చేయకపోవడంతో ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పట్లు కప్పుకుంటున్నారు. గదుల్లో ఫ్లోరింగ్‌ దెబ్బతిని ఇసుక, సిమెంట్‌ తేలి మట్టి దిబ్బలా తయారైంది. ఉదయం 6 గంటలకు రావాల్సిన సంక్షేమ అధికారి ఉదయం 7 గంటలకు వచ్చారు. పది మరుగుదొడ్లున్నప్పటికీ మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. కొన్నింటికి డోర్లు సరిగా లేవు. వాష్‌ ఏరియాలోనే విద్యార్థులు స్నానాలు ఆచరిస్తున్నారు. ఉదయం రావాల్సిన ట్యూషన్‌ టీచర్‌ రాలేదు. వాచ్‌మెన్‌ కూడా హాస్టల్‌లో అందుబాటులో లేడు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో ఉదయం 6 గంటలకు రావాల్సిన వార్డెన్‌ ఉదయం 7.40 గంటలకు వచ్చారు. బాత్‌రూమ్‌లు సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటనే స్నానాలు చేశారు. మధ్యాహ్నా భోజన సమయంలో కూడా వసతి గృహ అధికారి అందుబాటులో లేరు. ఇక్కడ 101 మంది విద్యార్థులకు గాను కేవలం 80 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. కథలాపూర్‌ కస్తూర్బాలో 199 మంది విద్యార్థులున్నారు. విద్యార్థులకు సరిపడా బెడ్స్‌ లేకపోవడంతో నేల మీద నిద్రిస్తున్నారు.

ఫ జిల్లాలో 19 ఎస్సీ హాస్టళ్లు

జిల్లా వ్యాప్తంగా 16 బీసీ హాస్టళ్లలో 880 మంది విద్యార్థులు, 19 ఎస్సీ హాస్టళ్లలో 736 మంది విద్యార్థులు, 3 ఎస్టీ హాస్టళ్లలో 293 మంది విద్యార్థులున్నారు. దీనికి తోడు జిల్లాలో మల్లాపూర్‌, రాయికల్‌ మండలం ఒడ్డెలింగాపూర్‌లో ఎస్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 300 మంది విద్యార్థులు, జిల్లాలో ఐదు మైనార్టీ రెసిడెన్షియల్స్‌లో 600 మంది విద్యార్థులు, 8 ఎస్సీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 500 మంది విద్యార్థులు, 9 బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 500 మంది, 14 కేజీబీవీల్లో 2,600 మంది, 13 మోడల్స్‌ స్కూల్స్‌లో 5,836 మంది విద్యార్థులున్నారు. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లో బాలుర గురుకుల పాఠశాల, మల్యాల మండలం తాటిపల్లిలో బాలికల గురుకుల పాఠశాలలున్నాయి.

ఫబెంచీలు లేక నేలపైనే చదువులు

గొల్లపల్లి మండల కేంద్రంలో కస్తూర్బాగాందీ బాలికల ఆశ్రమ పాఠశాలలో 129 మంది విద్యార్థినులున్నారు. వేసవి కాలంలో చల్లటి నీరు లభించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు సరిపడా బెంచీలు, ఫర్నిచర్‌ లేకపోవడంతో నేలపైనే కూర్చొని చదువుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బెడ్స్‌ లేకపోవడంతో నేల పైన నిద్రించాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. కథలాపూర్‌ కస్తూర్బాలో 199మంది విద్యార్థులున్నారు. విద్యార్థులకు బెడ్స్‌ లేకపోడంతో నేల మీద పడుకుంటున్నారు. బీర్‌పూర్‌ కస్తూర్బా బాలికల పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతోంది. సరిపడా బెంచీలు లేక పలువురు విద్యార్థినులు నేలపైనే కూర్చొని చదువుకుంటున్నారు. మంగేళా బాలికల ఆశ్రమ పాఠశాలలో 63 మంది విద్యార్థులకు కేవలం ఒకే భవనం ఉండగా అందులో రెండు గదులు మాత్రమే ఉన్నాయి. విద్యార్థులకు సరిపడా గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఫ ఆరుబయటే స్నానాలు

జగిత్యాల పట్టణంలో రెండు బీసీ వసతి గృహాలున్నాయి. ఒకటి అద్దె భవనంలో, మరొకటి పక్కా భవనంలో నిర్వహిస్తున్నారు. అద్దె భవనంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాత్‌రూమ్‌లు లేవు. బెడ్స్‌ సరిగా లేకపోడంతో నేలపైనే విద్యార్థులు పడుకుంటున్నారు. అద్దె సకాలంలో రాకపోవడంతో నిర్వహణ కష్టతరంగా మారింది. స్నానాలకు గదులు లేకపోవడంతో హాస్టల్‌ వెనుక ఓపెన్‌ ఏరియాల్లోనే విద్యార్థులు స్నానం చేస్తున్నారు. వెల్గటూరు మండలం స్తంబంపల్లి జ్యోతిబాపులే గురుకుల పాఠశాలను కోటిలింగాలలో గల ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో 385 మంది విద్యార్థులకు గానూ 338 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 21 మంది టీచింగ్‌ స్టాఫ్‌కు గానూ 19 మంది సిబ్బంది హాజరయ్యారు. డైనింగ్‌ హాల్‌ సౌకర్యం లేకపోవడంతో భోజనం చేయడానికి విద్యార్థులు తరగతి గదులు, హాలును వినియోగిస్తున్నారు. రేకుల షెడ్డులలో తరగతి గదులు నిర్వహిస్తుండడంతో వేసవి కాలంలో విద్యార్థులు వేడికి ఇబ్బంది పడుతున్నారు.

ఫ మైనార్టీ హాస్టల్‌లో అరకొర వసతులు

ధర్మపురి కేజీబీవీలో 198 మంది విద్యార్థులున్నారు. బీసీ బాలుర గురుకుల డిగ్రీ కళాశాలలో 98 మంది విద్యార్థులుండగా అన్ని వసతులున్నాయి. ధర్మపురిలో ఎస్టీ, ఎస్సీ బాలురు, ఎస్సీ బాలికల, బీసీ బాలుర కళాశాల, మైనార్టీ స్కూల్‌, మైనార్టీ కళాశాల హాస్టల్‌లున్నాయి. ఇందులో ఎస్సీ బాలురు, బీసీ బాలురు కళాశాల హాస్టళ్లు బీసీ బాలుర హాస్టల్‌లో కొనసాతున్నాయి. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేవు. మైనార్టీ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌, మైనార్టీ కళాశాల అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. ఇందులో వెంటిలేటర్‌ సౌకర్యం, వాష్‌రూమ్‌లు సక్రమంగా లేవు, భవనం పైనుంచి వాటర్‌ లీక్‌ అవుతూ విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. సారంగాపూర్‌ ఎస్సీ బాలుర వసతి గృహంలో 62 మంది విద్యార్థులకు గాను 45 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఒక కామటి, వాచ్‌మెన్‌, అందుబాటులో ఉన్నారు. వార్డెన్‌ అందుబాటులో లేరు.

ఫపెచ్చులూడిన భవనాల పైకప్పు

మెట్‌పల్లి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో 75 మంది ఉన్నారు. భవనం శిథిలావస్థకు చేరడంతో పై కప్పు పెచ్చులు ఊడుతున్నాయి. హాస్టల్‌ వార్డెన్‌ అందుబాటులో లేవు. ఓ సమావేశానికి హాజరు కావడానికి వెళ్లాడని సిబ్బంది తెలిపారు. ఎస్సీ బాలుర హాస్టల్‌లో 33 మంది విద్యార్థులకు గాను కేవలం రెండు డైనింగ్‌ టేబుల్స్‌ ఉన్నాయి. దీంతో అందరూ కింద కూర్చొనే భోజనం చేస్తున్నారు. భవనం పై కప్పు పెచ్చులు అక్కడక్కడ ఊడుతున్నాయి. విద్యార్థులకు పాఠశాలలు దూరంగా ఉండడంతో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. మెట్‌పల్లి మండలం పెద్దపూర్‌ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో గత సంవత్సరం జరిగిన సంఘటనతో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించింది.

ఫపెంకుటిల్లే వసతిగృహం

పెగడపల్లి ఎస్సీ బాలుర వసతి గృహంలో 30 మంది విద్యార్థులకు గాను 16 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. అద్దె పెంకుటింట్లో హాస్టల్‌ నిర్వహిస్తున్నారు. ఇరుకు గదులు, అధ్వాన్న టాయిలెట్లు, వెలుతురు లేని గదులలో అరకొర వసతల మధ్యనే విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నారు. అద్దె పెంకుటింట్లో వర్షం కురిస్తే ఊర్వకుండా ఉండేందుకు పైన పాలిథిన్‌ కవర్‌ కప్పి ఉంచారు. రాత్రి వీచిన ఈదురు గాలులకు కవర్‌ సైతం లేచిపోయింది.

ఫ అద్దె భవనాల్లో నిర్వహణ

జగిత్యాల రూరల్‌ మండలం తిమ్మాపూర్‌ గురుకుల పాఠశాల అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. మురికి కాలువ నిర్మాణం జరగకపోవడంతో విద్యార్థులు సమస్య ఎదుర్కొంటున్నారు. రాయికల్‌ పట్టణంలో బీసీ వసతి గృహంలో 45 మంది, ఎస్సీ వసతి గృహంలో 42 మంది విద్యార్థులున్నారు. ఈరెండు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అల్లీపూర్‌ జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో 350 మంది విద్యార్థులుండగా సరిపడా రూములు లేకపోడంతో తరగతి గదిని వినియోగించుకుంటున్నారు. వర్షం పడితే గదిలోకి వర్షపు నీరు రావడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. మేడిపల్లి శివారులోని మైనార్టీ గురుకులం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఎండపల్లి ఎస్సీ హాస్టల్‌ అద్దె భవనంలో కొనసాగుతోంది. హాస్టల్‌లో 32 మంది విద్యార్థులున్నారు. కోరుట్ల బీసీ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతోంది. విద్యార్థులు నేలపైనే కూర్చొని విధ్యాభ్యాసం చేస్తున్నారు. మైనార్టీ గురుకుల పాఠశాల సైతం అద్దె భవనంలో కొనసాగుతోంది. మల్యాలలో ఎస్సీ బాలికలు, ఇంటిగ్రేటెడ్‌ హాస్టళ్లు ఉన్నాయి. ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఆరుగురు, ఇంటిగ్రేటెడ్‌లో 60 మంది విద్యార్థులున్నారు. ఇందులో ఎస్సీ బాలికల హాస్టల్‌ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు.

ఫ విద్యార్థులకు కోతుల బెడద

కొడిమ్యాల మండలం పూడూరు బీసీ హాస్టల్‌లో 40 మంది విద్యార్థులున్నారు. హాస్టల్‌లో విద్యార్థులు కోతుల సమస్య తీవ్రంగా ఉంది. హాస్టల్‌లో మెనూ ప్రకారమే భోజనం పెడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. మల్లాపూర్‌ బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో కొనసాగుతోంది. ఎస్టీ బాలికల మినీ గురుకులం, మల్లాపూర్‌ ప్రిన్సిపాల్‌ అందుబాటులో లేరు. ఉదయం 9 గంటలకు రావాల్సిన ప్రిన్సిపాల్‌ ఉదయం 10.50 గంటలకు విధులకు వచ్చారు.

Updated Date - Apr 01 , 2026 | 01:05 AM