అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు..
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:56 PM
ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత నిస్తూ ముందుకు సాగుతున్నదని, అర్హులైన ప్రతి ఒక్క రికి సంక్షేమ ఫలాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.
వేములవాడ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత నిస్తూ ముందుకు సాగుతున్నదని, అర్హులైన ప్రతి ఒక్క రికి సంక్షేమ ఫలాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. గురువారం వేములవాడ లోని ఒక ఫంక్షన్ హాల్లో వేములవాడ నియోజకవర్గం లోని చేయూత నూతన పెన్షన్ల మంజూరు పత్రాలను కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతి రోజూ సుమారు 18 గంటలు శ్రమిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈనెల 19వ తేది నుంచి కొత్తగా మంజూరైన పెన్షన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతా ల్లో జమ అయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. జిల్లాలో కొత్తగా 8,209 పెన్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో 1,13,264 మందికి పెన్షన్లు అందుతున్నాయని, కొత్తగా మంజూరైన పెన్షన్లతో కలిపి 1,21,473 మందికి ప్రతి నెలా పెన్షన్లు అందనున్నాయని వివరించారు. ఇందుకోసం ప్రతి నెలా సుమారు రూ.25.97 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిం చనుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్య మని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ లాంటి పథకాలను కొనసాగిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఒకవైపు సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అండగా నిలుస్తూ, మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనతో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు (తలసే మియా, సికిల్ సెల్, హిమోఫీలియా) గీత కార్మికులు, నేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించి, అర్హుల ఎంపిక కోసం అధికారులతో విచారణ చేయించామని పేర్కొ న్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించామని, ఆయా దరఖాస్తు లను అధికారులు విచారణ చేయించామని తెలిపారు. ఈ నెల 18 వ తేదీ వరకు మంజూరు పత్రాలు అంది స్తామని పేర్కొన్నారు. 19వ తేదీన తర్వాత లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని వెల్లడిం చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వారి పేరిట ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పించే పనులు చేయిస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా స్కూల్ విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించే బాధ్యత అప్పగించామని తెలిపారు. వయోవృద్ధుల సంరక్షణ కోసం ప్రభుత్వ చట్టం చేసిందని, త్వరలో అమలు కానున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆర్డీఓకే ఎస్ బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్, మార్కెట్ కమిటీ చైర్మన్లు రొండి రాజు, చెలుకల తిరుపతి, కచ్చకాయల ఎల్లయ్య, ప్యాక్స్ ఛైర్మన్లు వకులాభరణం శ్రీనివాస్, బొమ్మేన భాస్కర్, ఏగోలపు శ్రీనివాస్, గసికంటి ప్రభాకర్, పిల్లి కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.