పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం
ABN , Publish Date - Mar 18 , 2026 | 11:44 PM
పరాభవ నామసంవత్సర ఉగాది పండుగను జిల్లావ్యాప్తంగా గురువారం వైభవంగా జరుపుకోనున్నారు. బ్రహ్మ సృష్టి రచన ప్రారంభించాడని చెప్పుకునే ఉగాదినాడు సంతోషంగా ఉంటే సంవత్సరమంతా సంతోషంగా ఉంటారు.
కరీంనగర్ కల్చరల్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): పరాభవ నామసంవత్సర ఉగాది పండుగను జిల్లావ్యాప్తంగా గురువారం వైభవంగా జరుపుకోనున్నారు. బ్రహ్మ సృష్టి రచన ప్రారంభించాడని చెప్పుకునే ఉగాదినాడు సంతోషంగా ఉంటే సంవత్సరమంతా సంతోషంగా ఉంటారు. ఈ రోజు ఏ ఇంట్లో చూసినా పండగకళ కనిపిస్తోంది. తలంటు స్నానాలాచరించి, నూతన వస్ర్తాలు ధరించి, దైవదర్శనం చేసుకొని, పెద్దల ఆశీస్సులు పొందాలి. గృహాలు, వ్యాపార, వాణిజ్య నిలయాలను మామిడి, పూల తోరణాలు, అరటి బోదెలతో అలంకరించుకోవాలి. దేవతార్చన, పంచాంగ పూజ జరపాలి. ఉగాది పచ్చడి, భక్ష్యాలు, పూర్ణాలను నైవేద్యంగా సమర్పించి భోజనం చేయాలి. సాయంత్రం పంచాంగ శ్రవణం, కవిత్వ, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనాలి. శ్రీరామ నవరాత్రులు ఉగాది నుంచే ఆరంభమవుతాయి. ఉగాదినాడు ధ్వజారోహణం, తలంటుస్నానం, గొడుగులు, విసనకర్రల దానాలు, బ్రహ్మపూజ, ఉగాది పచ్చడి స్వీకరణ, పంచాంగ శ్రవణం, చలివేంద్రాల ప్రారంభం, రాజ, స్నేహిత, బంధు దర్శనం, నవరాత్రుల ప్రారంభం, దశదానాలు చేయండం వంటి 10 పనులు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. ఈ దిశలో గురువారం ఆలయాల్లో, గృహాల్లో పండగ సందడి నెలకొననుంది.