సంక్షేమ పథకాలతో ప్రజల మనసు గెలిచాం.
ABN , Publish Date - May 29 , 2026 | 11:52 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజల మనసు గెలిచామని చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు.
కరీంనగర్ అర్బన్, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజల మనసు గెలిచామని చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం, కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన విడివిడిగా చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు శుక్రవారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం సమగ్ర ఓటరు సవరణ పేరుతో కొత్తగా ఓటర్లుగా చేర్చడం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఏదైనా కారణం తోటి ఓటర్ జాబితా నుంచి తొలగించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కరీంనగర్ లాంటి నగర ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, బీజేపీ కొన్ని వర్గాల వారిని టార్గెట్ చేసుకుని వారిని తొలగించేందుకు యత్నిస్తుందన్నారు. బీఎల్‌ఏ-2 ఏజెంట్లు ఈ సమగ్ర ఓటర్ సవరణ కార్యక్రమంలో తమ ఓట్లు ఉన్నాయా లేదా అనేది పరిశీలించి, లేని ఓటర్లను కొత్తగా చేర్పించాలన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ కరీంనగర్ పార్లమెంటు సమన్వయకర్త కూన శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ... సర్‌పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలఅన్నారు. ప్రతి బూత్ నుంచి కనీసం ఐదుగురు పార్టీ సభ్యులు బాధ్యత తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఓటర్లను కాపాడుకునే విధంగా ఓటర్ మ్యాపింగ్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఫ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్... మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో సర్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలో బీఎల్‌ఏ-2ల నియామకం పూర్తయిందన్నారు. పార్టీకి నష్టం కలిగించే విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా పార్టీ ఇస్తున్న సూచనలను, ఆదేశాలను పాటిస్తున్నామని వైద్యుల అంజన్ కుమార్ పేర్కొన్నారు. సమావేశాల్లో టీపీసీసీ ప్రతినిధి చంద్రశేఖర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసయ్య, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎండీ తాజ్, పులి ఆంజనేయులుగౌడ్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, బానోతు శ్రవణ్‌నాయక్, కొరివి అరుణ్‌కుమార్, పురం రాజేశం, వెన్నం రజితరెడ్డి పాల్గొన్నారు.