చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:27 AM
రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
చందుర్తి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల పరిధిలోని అర్హులైన 37మంది లబ్ధిదారులకు 12లక్షల 37వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 36 వేల బెడ్లు అందు బాటులోకి వచ్చే విధంగా నూతన ఆసుపత్రిలో నిర్మాణంతో పాటు పాత ఆస్పత్రులను ఆధునీకరణ చేస్తున్నట్లు తెలిపారు. నిన్నటి వరకు జిల్లాలో సుమారు 3.39.000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. గత రబీ సీజన్‌లో 2.69,000 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు జరగగా, ఈసారి ఇప్పటికే గత ఏడాదికంటే అధికంగా కొనుగోలు జరిగిందన్నారు. ఇంకా జిల్లాలోని కొనుగోలు కేంద్రాల వద్ద మరో 15,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇంచుమించుగా ఈసారి సుమారుగా 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కువ వచ్చిన ట్టు తెలిపారు. ఈసారి వరి దిగుబడి గణనీయంగా పెరిగినప్పటికీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద, రైస్ మిల్లర్ల వద్ద, గోదాముల వద్ద ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగు తోందన్నారు. రైస్‌మిల్లుల్లో స్థలాభావం లేదా గోదాముల్లో నిల్వ సమస్య లు తలెత్తిన సందర్భాల్లో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ నిల్వ సదుపాయాలు కల్పించి ధాన్యాన్ని వెంటనే తరలించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైన చోట్ల గోదాములు, నిల్వ కేంద్రాలు వినియోగంలోకి తెచ్చి రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవ స్థను నడిపిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం కొనసాగుతోం దని, రైతు ప్రయోజనాలను కాపాడే దిశగా ప్రభుత్వం మరింత వేగంగా ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొట్టే ప్రభాకర్, సర్పంచులు కటకం మల్లేశం, బొజ్జ మల్లేశం, చిలుక బాబు, నాయకులు చింతపంంటి రామస్వామి, దూది శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, బాలు, రాజయ్య,ప్రసాద్, ముస్కు మల్లారెడ్డి, శ్రీనివాస్, రవిందర్ రెడ్డి, ఏసుదాసు, మనోహర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.