కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం సహించం
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:36 AM
కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను ఉద్దేశించి అన్నారు.
యావర్ రోడ్డు విస్తరణ ఆలస్యానికి ఎమ్మెల్యేనే కారణం
ఫ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాల, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ పార్టీలో ఉన్నాడో స్పష్టత లేని వ్యక్తి నైతిక విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేయడమనేది ప్రజా ప్రతినిధుల హక్కు అని అన్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసినా, ముఖ్యమంత్రిని కలిసినా తనకు అభ్యంతరం లేదని, కానీ మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పదేళ్లు పార్టీ కోసం పని చేసిన వారికే టికెట్లు ఇస్తామన్నారు. పార్టీ కార్యకర్తల హక్కులను కాపా డడం కోసం ఎంతదూరం వెళ్లడానికైనా సిద్ధమని జీవన్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ టికెట్ల వ్యవహారం మా అధిష్ఠానం చూసుకుంటుందని ఇతరులు కలగజేసుకుంటే సహించేది లేదని అన్నారు. 1984లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన చంద్రబాబు ఆధిపత్యాన్ని సహించలేక కాంగ్రెస్‌లో చేరానని అన్నారు. 1985 తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చిందని ఆమాత్రం ఎమ్మెల్యేకు అవగాహన లేకపోవడం దురదృష్టమన్నారు. జగిత్యాల పట్టణం ోని యావర్ రోడ్డు నిర్మాణం ఆలస్యం అవడానికి ఎమ్మెల్యేనే కారణమని ఆరోపించారు. నూకపెల్లి డబుల్ బెడ్ రూం ఇళ్ళలో మౌలిక వసతులు పూర్తి కాకముందే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పంపిణీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 2 వందల ఎకరాల స్థలం సేకరించి నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చామన్నారు. అక్కడ ఇళ్లు కడితే తనకు పేరు వస్తుందనే కారణంతో డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించారని అన్నారు. అనంతరం పాత్రికేయులతో కలిసి సమీకృత మార్కెట్ వద్దకు వెళ్ళి శిలాఫలకాలను చూపించారు. ప్రారంభించి రెండు సంవత్సరాల మూడు నెలలు గడిచినా ఇప్పటికీ వినియోగంలోకి రాలేదని విమర్శించారు. ఈ సమావేశంలో టిపిసిసి కార్యధర్శి బండ శంకర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్, గుంటి జగదీశ్వర్, జున్ను రాజెందర్, తోపారపు లావణ్య, రజనీకాంత్ పాల్గొన్నారు.