Share News

రాష్ట్రాన్ని నంబర్‌ వనగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Feb 06 , 2026 | 01:01 AM

దేశంలోనే తెలంగాణ రాషా్ట్రన్ని అభివృద్ధిలో జూంబర్‌ వనగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంతరెడ్డి అన్నారు.

రాష్ట్రాన్ని నంబర్‌ వనగా తీర్చిదిద్దుతాం

కరీంనగర్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశంలోనే తెలంగాణ రాషా్ట్రన్ని అభివృద్ధిలో జూంబర్‌ వనగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంతరెడ్డి అన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రజా పాలననను సాగిస్తున్నామని అన్నారు. చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి మాట్లాడుతూ కరీంనగర్‌ను పట్టిపీడిస్తున్న డంపు యార్డు సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కరీంనగర్‌-వరంగల్‌ నగరాల మధ్య డంపుయార్డు నెలకొల్పి విద్యుత ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కరీంనగర్‌కు రింగ్‌రోడ్డు మంజూరు చేస్తామని, తద్వారా నగర అభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పారు. కరీంనగర్‌, వరంగల్‌ నగరాలను కలిపి అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కరీంనగర్‌ గడ్డ నుంచే మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమై స్వరాష్ట్ర సాధన దోహదపడిందని గుర్తుచేశారు. ఇందిరమ్మ పథకం ద్వారా లక్షల సంఖ్యలో ఇళ్లను లబ్ధిదారులకు అందించామన్నారు. ఉచిత విద్యుత పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత కరెంటు వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలుచేస్తుందని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి లా, ఎల్‌ఎల్‌ఎం, ఇంజనీరింగ్‌ కళాశాలలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

ఫ అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట

తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు బీమా పంపిణీ చేశామని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి 48 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంతరెడ్డి తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సుసౌకర్యం కల్పించామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉద్యోగం చేసే మహిళలకు నెలకు నాలుగు వేల రూపాయల వరకు ఆదా అవుతుందని, ఇప్పటి వరకు తొమ్మిది వేల కోట్లను మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని సీఎం తెలిపారు. మహిళా స్వయం ఉపాధి సంఘాలకు జీరో వడ్డీ రుణాలుగా 27 వేల కోట్లను మంజూరు చేస్తున్నామని, వారిని అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చేసి కోటీశ్వర్లుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు.

మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులు

ఆర్టీసీలో మహిళా సంఘాలకు వెయ్యి అద్దె బస్సులను కేటాయించామని ముఖ్యమంత్రి రేవంతరెడ్డి తెలిపారు. వాటికి యజమానులు మహిళలేనని అన్నారు. అదానీ, అంబానీలకు దీటుగా మహిళలకు సోలార్‌ పవర్‌ప్లాంట్ల నిర్వహణ, వెయ్యి మెగా వాట్ల విద్యుత ఉత్పత్తి చేసే బాధ్యతలు అప్పగించామని చెప్పారు. జగిత్యాలలో రోడ్డు విస్తరణ, యంగ్‌ ఇండియా స్కూల్‌ కోసం స్థలాన్ని కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. వేములవాడ రాజన్న దేవాలయాన్ని 150 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. ధర్మపురి, కొండగట్టు క్షేత్రాలను అభివృద్ధి చేస్తామని, అటవీ ప్రాంతాలను ఏకో టూరిజంగా తీర్చిదిద్దుతామని అన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆయా ప్రాంతాలను టూరిజం డెవలప్‌మెంట్‌ కింద తీసుకొని అభివృద్ధి చేస్తామని,, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు. 2,676 మహిళా స్వయం సహాయక సంఘాలకు 110 . 10 కోట్ల రూపాయల చెక్కును సీఎం అందజేశారు.

Updated Date - Feb 06 , 2026 | 01:01 AM