Share News

భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తాం

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:35 AM

‘భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తాం.. కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధం తెంచుకోవద్దని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డికి వివరించాం.. ఆయన పార్టీని వీడరన్న నమ్మకంతో వెళ్తున్నాం’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు.

భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తాం
జీవన్‌రెడ్డితో చర్చలు జరుపుతున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌

జగిత్యాల, మార్చి 24 (ఆన్‌లైన్‌): ‘‘భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తాం.. కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధం తెంచుకోవద్దని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డికి వివరించాం.. ఆయన పార్టీని వీడరన్న నమ్మకంతో వెళ్తున్నాం’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. అసంతృప్తితో ఉండి కాంగ్రెస్‌కు రాజీనామా ప్రకటించిన జీవన్‌రెడ్డిని బుజ్జగించడానికి మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసానికి టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌లు వచ్చారు. అనంతరం మీడియాతో మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ దాదాపు నలబైమూడేళ్ల పార్టీ అనుబంధం ఉన్న జీవన్‌రెడ్డి తండ్రి లాంటి వారని, రాజకీయంగా ఆయనంత సీనియర్‌ నేత ప్రస్తుతం ఒకరిద్దరు మినహా రాష్ట్రంలో ఎవరూ లేరన్నారు. కొంత కార్యకర్తల ఒత్తిడి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల జీవన్‌రెడ్డి రాజీనామాకు యోచిస్తున్నట్లు గమనించామని మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు.

కాంగ్రెస్‌లో గుర్తింపు కరువు

-మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

కాంగ్రెస్‌లో తనకు గుర్తింపు కరువైందని, గౌరవం దక్కని చోట ఎలా ఉండాలని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తన నివాసానికి వచ్చి వెళ్లిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అప్పటి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి సీఎం పదవి, అప్పటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయన్నారు. తాను ఒంటరిగా మండలిలో పోరాటం చేశానని నాకు ఎందుకు అన్యాయం చేశారని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి తట్టుకోలేక, గౌరవం దక్కకపోవడంతో ఈనెల 25వ తేదీన కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నట్లు మరోమారు స్పష్టం చేశారు. నలబై సంవత్సరాల కాంగ్రెస్‌ అనుబంధాన్ని తెంచుకోవడం బాధగా ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన పరిస్థితుల్లో ఎవరో వచ్చి రాజకీయం చేస్తే ఎలా ఊరుకోవాలని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.

ఫకాంగ్రెస్‌ కండువా కప్పుకోవడానికి నిరాకరణ

మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఇతర నాయకులు జగిత్యాలకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడానికి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి నిరాకరించారు. జగిత్యాలకు వచ్చిన నేతలతో పాటు జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ కండువా కప్పడానికి ఓ కార్యకర్త ప్రయత్నించగా జీవన్‌రెడ్డి సున్నితంగా నిరాకరించి అక్కడే ఉన్న టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌కు కండువా కప్పించారు.

Updated Date - Mar 25 , 2026 | 12:35 AM